UP Bypolls Results : అఖిలేశ్ యాదవ్ కంచుకోటలో బీజేపీ ఆధిక్యం

ABN , First Publish Date - 2022-06-26T19:22:21+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ముందంజలో

UP Bypolls Results : అఖిలేశ్ యాదవ్ కంచుకోటలో బీజేపీ ఆధిక్యం

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. దీంతో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలకు బీటలువారుతున్నట్లు కనిపిస్తోంది. అఖిలేశ్, ఆ పార్టీ అగ్ర నేత ఆజం ఖాన్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 


రామ్‌పూర్, ఆజంగఢ్ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అఖిలేశ్ యాదవ్ శాసన సభ్యునిగా ఎన్నికవడంతో ఆజంగఢ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నేత ఆజం ఖాన్ రామ్‌పూర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆజంగఢ్‌లో ప్రధానంగా బీజేపీ, ఎస్‌పీ, బీఎస్‌పీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఎస్‌పీ అభ్యర్థి షా ఆలం దాదాపు 1 లక్ష ఓట్లు సాధించి, ఎస్పీ, బీజేపీ అభ్యర్థులకు సమీపానికి వచ్చారు. ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ విజయావకాశాలను షా ఆలం దెబ్బతీశారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ పాల్గొనకపోవడం కూడా ప్రభావం చూపిందని కొందరు చెప్తున్నారు. అయితే తన ప్రచారాన్ని అన్ని వేళలా అఖిలేశ్ పర్యవేక్షించారని ధర్మేంద్ర చెప్తున్నారు. 


రామ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఘనశ్యామ్ సింగ్ లోఢీ పోటీ చేశారు. ఆయన ఇటీవలే ఆ పార్టీలో చేరారు. ఆజం ఖాన్ ప్రతిపాదించిన అసీం రజా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ స్థానం నుంచి బీఎస్‌పీ పోటీ చేయలేదు. 


ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి దినేశ్ లాల్ యాదవ్ ‘నిర్హువా’ (బీజేపీ), ధర్మేంద్ర యాదవ్ (ఎస్‌పీ), షా ఆలం (బీఎస్‌పీ) పోటీ చేశారు. 


Updated Date - 2022-06-26T19:22:21+05:30 IST