Abn logo
Oct 23 2020 @ 00:30AM

బిహార్‌లో బీజేపీ డబుల్‌ గేమ్‌

నరేంద్ర మోదీ ఎంత శక్తిమంతుడు అయినప్పటికీ బిహార్ ఆయన నాయకత్వ సామర్థ్యాలకు పరిమితులను విధిస్తోంది. కులాల అంక గణితం ముందు మోదీ ఆకర్షణ శక్తి నిలవదని స్పష్టంగా రుజువయింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్ ఘన విజయమే అందుకు నిదర్శనం. తత్కారణంగానే, నితీశ్‌కు ఇప్పుడు ప్రజామద్దతు ఎంతగా తగ్గినప్పటికీ ఆయన్ని తమ పక్షాన నిలుపుకోవడం బీజేపీకి అనివార్యమయింది.


బిహార్ విలక్షణత ఏమిటి? ఆర్య చాణక్యుని కార్య క్షేత్రమది. అపర చాణక్యులకు ఇప్పుడు అక్కడ కొదవ లేదు. నాటి చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మిస్తే నేటి చాణక్యులు సమతా సమాజాన్ని నిర్మిస్తామంటున్నారు అధికారాన్ని అప్పగిస్తే! ఆ అధికారం కోసం జరుగుతున్న తాజా పోరాటం చరిత్ర గమనాన్ని మలుపు తిప్పనున్నది.


బిహార్ పన్నెండు నెలలుగా ఒక విపత్తు తరువాత మరొక విపత్తులో నలిగిపోతోంది. వలసలు, వరదలు, దిగజారిన ఆర్థికం, ప్రకృతి వైపరీత్యాలు... కరోనా ఆపత్కాలంలో ఇలా వరుసగా ఆపదలనెదుర్కొన్న రాష్ట్రం మరొకటి లేదనడం సత్యదూరం కాదు. మరి ప్రస్తుత శాసనసభా ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య జయాపజయాల నిర్ణాయక అంశం కాబోతుందని ఒక సర్వేలో వెల్లడి కావడంలో ఆశ్చర్యమేముంది? రాష్ట్ర యువత నిరుద్యోగిత గణాంకాలు దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి.


నెలల తరబడి లాక్‌డౌన్ ఇక్కట్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం బిహారీలకు ఒక ఉపశమనంగా ఉంది. అందునా వారికి తమ రాజకీయాల పట్ల అమితమైన అనురక్తి. అయినప్పటికీ బిహార్ ఎన్నికల విలక్షణత, విద్యుదావేశం ప్రస్తుత ఎన్నికల్లో కానరావడం లేదు. కొవిడ్ ఆంక్షలు కారణమా? కావచ్చు కానీ బిహార్ -2020 ఒక శకాంతానికి సంకేతం. 1990లో మండల్ భావజాలంతో ప్రభవించిన చైతన్యశీల రాజకీయాల శకమది. మరి ఈ యుగసంధిలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరుస్తుందా? 


కాలంలో సరిగ్గా మూడు దశాబ్దాల వెనక్కు వెళదాం. 1990లో బిహార్ రాజకీయాలలో ఒక పెనుమార్పు సంభవించింది. లాలూ ప్రసాద్ యాదవ్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన సంవత్సరమది. ఆయన కేవలం మరొక ప్రజాకర్షక నాయకుడు మాత్రమే కాదు. ఒక వెనుకబడిన కులం రాజకీయ సాధికారితకు ఉజ్వల ప్రతీక లాలూ. బిహార్‌లో అప్పటి వరకు ప్రబలంగా ఉన్న రాజకీయ సమీకరణాలను ఆయన పూర్తిగా మార్చివేశారు. 1990 అక్టోబర్‌లో లాల్ కృష్ణ ఆడ్వాణీ అయోధ్య రథయాత్ర బిహార్‌లో సాగుతుండగా లాలూ ప్రసాద్ ఆయన్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపారు. లాలూ చేపట్టిన ఈ సాహసోపేత చర్య ఆయన రాజకీయాల పరిధిని మరింత విశాలం చేసింది. కొత్త ప్రాధాన్యాన్ని సంతరింప చేసింది. ‘కమండల్’ పై మండల్ అస్త్రాన్ని లాలూ విజయవంతంగా సంధించిన ఫలితమది. ముస్లింలు ఆయన్ని తమ రక్షకుడిగా విశ్వసించారు. ముస్లిం-యాదవ్ వర్గాల మధ్య రాజకీయ పొత్తు సుస్థిరమయింది. మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. గంగానదిలో ఎంతో నీరు ప్రవహించింది. లాలూ ప్రసాద్ ఇప్పుడు జైలులో ఉన్నారు. ఆయన కుమారులు తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ హిందుత్వ మౌలిక భావజాలంపై రాజీపడకుండానే మండల్ శక్తులను తనతో కలుపుకుని కొత్త రాజకీయ ప్రస్థానం చేస్తోంది. బిహార్‌లో ప్రప్రథమంగా అది నెంబర్ 1 పార్టీగా వెలుగొందుతోంది. 


ఉత్తర భారతావనిలో, మరీ ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాలలో బీజేపీ సొంతంగా అధికారానికి రాని ఏకైక రాష్ట్రం బిహార్. మిగతా రాష్ట్రాలలో అది ఒక కీలక రాజకీయ శక్తిగా ఉంది. ఆ పార్టీ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. బిహార్‌లో మాత్రం చాలా కాలంగా అది ఒక గౌణ రాజకీయ శక్తిగా మాత్రమే ఉంది. మండల్ శక్తుల మద్దతుదారుగా, సహచర పక్షంగా ఒక అప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. 2005 ఫిబ్రవరి ఎన్నికలలో బీజేపీకి కేవలం 10.97 శాతం ఓట్లు రావడమే గగనమై పోయింది. అయితే 2015 నాటికి ఆ పార్టీకి లభించిన ఓట్లు 24. 42 శాతానికి పెరిగాయి. 2019 సాధారణ ఎన్నికలలో బిహార్‌లో ఎన్‌డిఏ కూటమి ఎదురులేని శక్తిగా నిలిచింది. 40 లోక్‌సభా స్థానాలలో 39 ఆ కూటమికి కైవసమయ్యాయి. 243 అసెంబ్లీ సెగ్మెంట్లలో 223 పూర్తిగా ఆ కూటమి వైపే మొగ్గాయి. ఈ కాలంలో బిహార్‌లో బీజేపీ చాల వరకు జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్ కుమార్ నాయకత్వాన్ని అనుసరించింది. మౌలిక మండల్ విప్లవం నుంచి ప్రభవించిన ఈ నాయకుడు కలహశీల జెట్టీ కాదు, హుందాగా వ్యవహరించే పెద్ద మనిషి. 


2020లో ఆ పరిస్థితులు మారాయి. నితీశ్ నాయకత్వంపై బీజేపీ తన విశ్వాసాన్ని పదే పదే పునరుద్ఘాటిస్తోంది. ఎన్‌డిఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేస్తోంది. అయితే అధికార సమతౌల్యతలో మార్పు వచ్చిందనేది ప్రతి ఒక్కరికీ తేటతెల్లంగా తెలుస్తూనే ఉంది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–-జనతాదళ్ (యు) కూటమి ఘన విజయం సాధించింది. లాలూప్రసాద్ అస్తవ్యస్త పాలననుంచి బిహార్‌ను విముక్తం చేస్తానని ‘సుశాశన్ బాబు’గా సుప్రసిద్ధుడైన నితీశ్ కుమార్ హామీని బిహారీలు విశ్వసించారు. బీజేపీ–-జనతాదళ్ (యు) కూటమికి పట్టం కట్టారు. నితీశ్ తన పాలనలో ఘనమైన ఫలితాలను సాధించారు. వివేకవంతుడైన పాలకుడిగా పేరు పొందారు. అయితే ఇదంతా గతం. బీజేపీని కాదని లాలూ వైపు, లాలూను కాదని కాదని బీజేపీ వైపు మొగ్గడంతో నికార్సైన లౌకికవాదిగా, సుపరిపాలకుడుగా నితీశ్ పేరుప్రఖ్యాతులు దెబ్బ తిన్నాయి. దృఢ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. సామాన్యప్రజలతో సంబంధాలను కోల్పోయారు. ఆయన నాయకత్వం బలహీనపడింది. ఒక విధంగా ఏకాకి అయిపోయారని చెప్పక తప్పదు. ఎంత మార్పు! దేశానికి నాయకత్వం వహించడంలో నరేంద్రమోదీ యోగ్యతలను సమర్థంగా సవాల్ చేసిన నాయకుడు నితీశ్ కుమార్. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో ఎల్లెడలా మోదీ బొమ్మలే కన్పిస్తున్నాయి. ఎన్‌డీఏ తన విజయానికి బ్రాండ్ మోదీ ఘనత పైనే పూర్తిగా ఆధారపడుతోంది. బీజేపీ–జనతాదళ్ (యు) సంబంధాలలో కొట్టవచ్చిన మార్పు కన్పిస్తోంది. నితీశ్ ఇప్పుడు ఒక ప్రాంతీయ నాయకుడు మాత్రమే కాగా కూటమి బిగ్‌బాస్ నరేంద్ర మోదీ! 


2019 సార్వత్రక ఎన్నికలలో బిహార్‌లో ఎన్‌డీఏకు ఓటు వేసిన వారిలో అత్యధికులు నరేంద్ర మోదీ కారణంగానే ఆ కూటమికి ఓటు వేసినట్టు చెప్పారని ఒక విశ్వసనీయ సర్వే వెల్లడించింది. బిహార్ ఓటర్లలో 64 శాతం మంది మోదీయే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారని కూడా ఆ సర్వే పేర్కొంది. అభివృద్ధి సాధకుడు, హిందుత్వ యోధుడుగానే కాకుండా ఇతర వెనుకబడిన కులాల ప్రతినిధిగా కూడా మోదీని బిహారీలు అమితంగా అభిమానిస్తున్నారు. రాష్ట్ర స్థాయి బిహారీ నాయకులు సంకుచిత కుల అస్తిత్వాలకే పరిమితం కాగా మోదీ కులాలకు అతీతంగా సకల సామాజిక వర్గాల మద్దతును పొందగలిగారు. ఫలితంగానే బిహార్‌లో బీజేపీ గణనీయంగా పుంజుకుని తిరుగులేని అగ్రగామి పార్టీగా ఆవిర్భవించింది.


నరేంద్ర మోదీ ఎంత శక్తిమంతుడు అయినప్పటికీ బిహార్ ఆయన నాయకత్వ సామర్థ్యాలకు పరిమితులను విధిస్తుంది. కులాల అంక గణితం ముందు మోదీ ఆకర్షణ శక్తి నిలవదని స్పష్టంగా రుజువయింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, కాంగ్రెస్‌పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్ ఘన విజయం సాధించడమే అందుకు నిదర్శనం. తత్కారణంగానే, నితీశ్‌కు ప్రజామద్దతు ఇప్పుడు ఎంతగా తగ్గినప్పటికీ ఆయన్ని తమ పక్షాన నిలుపుకోవడం బీజేపీకి అనివార్యమయింది. ఒకనాడు తన ప్రత్యర్థి అయిన నితీశ్‌తో కలిసి ఉమ్మడి ర్యాలీలలో పాల్గొనడం ప్రధాని మోదీకి తప్పనిసరి అయింది. అలాగే మల్ల సామాజికవర్గ నాయకుడైన ముఖేశ్ సహాని నేతృత్వంలోని వికాసీల్ ఇన్సాన్ పార్టీ లాంటి చిన్నచితకా పక్షాలతో కూడా పొత్తు పెట్టుకోవడం బీజేపీకి తప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో వలే బిహార్‌లో కూడా యాదవేతర వెనుకబడిన కులాల మద్దతును బీజేపీ కూడగట్టుకొంటోంది. సామాజిక సమీకరణాలలో పెను మార్పులకు ఇది తప్పనిసరి. సంప్రదాయక అగ్రవర్ణాల వారి మద్దతుపైనే ఆధారపడకుండా విస్తృత పరిధిలో సకల సామాజికవర్గాల మద్దతుతో ఒక కొత్త రాజకీయ సంకీర్ణాన్ని నిర్మించేందుకు బీజేపి ప్రయత్నిస్తోంది.


నితీశ్ కుమార్ పదిహేనేళ్ళ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కన్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు ‘మోదీత్వ -ప్లస్’ ఏర్పాటుపై బీజేపీ ఆధారపడుతోంది. నితీశ్ కుమార్ ఎన్‌డీఏలో కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నప్పటికీ అదే సమయంలో ఆయన ప్రభుత్వానికి దూరంగా ఉండాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ఒక ప్రమాదకరమైన రాజకీయ ఘర్షణకు తెరతీసింది. కేంద్రప్రభుత్వంలో తమ భాగస్వామి అయిన చిరాగ్ పాశ్వాన్‌ను నితీశ్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించేందుకు ప్రోత్సహిస్తోంది. బీజేపీ వ్యూహంలో భాగంగానే నితీశ్ నాయకత్వంపై చిరాగ్ తిరుగుబాటు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.. సమర్థ పాలకుడుగా నితీశ్‌కు ఉన్న మంచిపేరు చిరాగ్ విమర్శలతో తుడిచిపెట్టుకుపోగలదని బీజేపీ ఆశిస్తోంది. అయితే అదే సమయంలో బలహీనపడ్డ బిహార్ ముఖ్యమంత్రి తమ మద్దతుపై ఆధారపడి ఉండే పరిస్థితిని కల్పిస్తోంది. రాబోయే ఐదేళ్ళూ తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ అంతిమంగా బిహార్ ప్రభుత్వ సారథ్యాన్ని సాధించుకోవడమే బీజేపీ వ్యూహం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన మూడో రాష్ట్రమైన బిహార్‌లో తమ సొంత ముఖ్యమంత్రి అధికారానికి రావడమే భారతీయ జనతా పార్టీ అంతిమ లక్ష్యం.


తాజా కలం: మహారాష్ట్రలో గత ఏడాది జరిగిన నాటకీయ పరిణామాలు బిహార్‌లో కూడా సంభవించనున్నాయా? ఉద్ధవ్ ఠాక్రే వలే నితీశ్ కూడా బీజేపీపై తిరుగుబాటు చేస్తారా? శరద్‌పవార్ వలే లాలూప్రసాద్ యాదవ్ పరిణత రాజనీతిజ్ఞుని పాత్ర పోషిస్తారా? ఈ ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు. బిహార్ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరి ఆటకట్టుకు ప్రయత్నించి సఫలమవుతారనేది నిశ్చితంగా చెప్పలేము.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement