డబుల్ ఇంజెన్ ప్రభుత్వంతోనే మణిపూర్ అభివృద్ధి: మోదీ

ABN , First Publish Date - 2022-02-22T21:10:02+05:30 IST

మణిపూర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ ..

డబుల్ ఇంజెన్ ప్రభుత్వంతోనే మణిపూర్ అభివృద్ధి: మోదీ

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో మణిపూర్ అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పునాదులు వేసిందని చెప్పారు. మణిపూర్‌లోని హైన్‌గాంగ్ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అన్నారు.


''గత ఐదేళ్లలో మణిపూర్ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేసింది. బీజేపీ సుపరిపాలనను, సత్సంకల్పాన్ని మీరు చూశారు. మరో 25 ఏళ్ల భవిష్యత్తుకు బీజేపీ బాటలు వేసింది'' అని మోదీ అన్నారు. కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో అసమానత్వాన్నే రాష్ట్రం చవిచూసిందని విమర్శించారు. మణిపూర్ రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిందని, దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో అసమానతలే చోటుచేసుకున్నాయని అన్నారు. బీజేపీ అసాధ్యాలను సుసాధ్యం చేసిందని, మణిపూర్‌లోని ఏ ప్రాంతంలోనూ ఇప్పుడు బంద్‌లు, దిగ్బాంధాలు లేవని అన్నారు.


ప్రభుత్వంలో చురుకైన భాగస్వామ్యం కోసం, ప్రభుత్వ నిర్ణయాలలో పాలుపంచుకునేందుకు యువత, ఫస్ట్ టైమ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఎన్.‌బీరేన్ సింగ్ అందరినీ కలుపుకొని వెళ్తూ రాష్ట్రాన్ని మార్పు దిశగా పరుగులు తీయిస్తున్నారని ప్రశంసించారు. కోవిడ్ సమయంలోనూ మణిపూర్‌లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందించామని చెప్పారు. 2017 కంటే ముందే ఇలాంటి మహమ్మారి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. మణిపూర్‌లోని ప్రతి పది మందిలో ఏడుగురు ఉచిత రేషన్ లబ్ధి పొందుతున్నారని చెప్పారు. మణిపూర్ మహిళలు విదేశీ శక్తులపై చారిత్రక పోరాటం సాగించారని ప్రశంసించారు. ఎన్డీయే ప్రభుత్వాలు మాత్రమే మహిళల సమస్యలను అర్ధం చేసుకుని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు పనిచేయగలవని అన్నారు. కాగా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి దశ ఓటింగ్ మార్చి 5న జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-02-22T21:10:02+05:30 IST