Abn logo
Apr 30 2021 @ 14:51PM

Exitpollపై బీజేపీ డబుల్ స్టాండ్.. అస్సాం ఒకే, బెంగాల్‌పై విమర్శలు

కో‌ల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఎనిమిదవ విడత పోలింగ్ అనంతరం దేశంలోని కొన్ని సర్వేలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని దాదాపు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇక కేరళలో మళ్లీ లెఫ్ట్ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఇక పుదుచ్చేరిలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్లు కొన్ని సంస్థలు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ మమతదే అధికారం అని ఎక్కువ సర్వేలు తెలిపాయి. అస్సాంలో మళ్లీ కమల వికాసమే అని పేర్కొన్నాయి.


కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్‌పై భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇంచార్జ్ కైలాశ్ విజయవర్గీయ ఎగ్జిట్ పోల్స్‌పై భిన్నంగా స్పందించారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి రానుందన్న ఫలితాలపై ఏకీభవిస్తూనే బెంగాల్‌లో మమతకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సర్వే సంస్థలు క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండా అంచనాలు కట్టాయి. నిజానికి వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సైలెంట్ పోలింగ్ ఎక్కువగా ఉంది. 18-20 శాతం వరకు ఈ ఓటర్లు ఉంటారు. 2011లో కూడా వామపక్షాలదే మళ్లీ అధికారం అని చెప్పారు. కానీ టీఎంసీ అధికారంలోకి వచ్చింది. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ 18 లోక్‌సభ సీట్లు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది’’ అని కైలాష్ విజయవర్గీయ అన్నారు.


అయితే ఈయనే అస్సాం ఎగ్జిట్‌ పోల్స్‌ను స్వాగతించారు. ఎగ్జిట్ పోల్స్‌ను ప్రస్తావిస్తూనే ‘‘సర్వే సంస్థలు ప్రకటించిన ఫలితాలు వాస్తవం. అస్సాంలో అధికారం మళ్లీ బీజేపీదే’’ అని తేల్చి చెప్పారు. విజయవర్గీయ ద్వంద్వ వైఖరిపై విపక్షాలు, నెటిజెన్లు మండిపడుతున్నారు. తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే సరైనవని, వ్యతిరేకంగా వస్తే తప్పు పట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement