Kerala Ministerను తొలగించాలంటూ గవర్నర్‌కు బీజేపీ లేఖ

ABN , First Publish Date - 2022-07-06T23:30:58+05:30 IST

భారత రాజ్యాంగాన్ని విమర్శించిన కేరళ మంత్రి, సీపీఎం నేత సాజి చెరియన్‌

Kerala Ministerను తొలగించాలంటూ గవర్నర్‌కు బీజేపీ లేఖ

తిరువనంతపురం : భారత రాజ్యాంగాన్ని విమర్శించిన కేరళ మంత్రి, సీపీఎం నేత సాజి చెరియన్‌ (Saji Cherian)ను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది. మల్లపల్లిలో ప్రతి వారం నిర్వహించే రాజకీయ వ్యాఖ్యాన కార్యక్రమం 100వ ఎపిసోడ్‌లో సాజి రాజ్యాంగాన్ని విమర్శించారని ఆరోపించింది. 


Kerala గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ (Arif Mohammad Khan)కు కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ (K. Surendran) రాసిన లేఖలో, సాజి చెరియన్ తన వ్యాఖ్యల ద్వారా మన దేశ రాజ్యాంగాన్ని, దాని నిర్మాతలను కించపరిచారని, అవమానించారని ఆరోపించారు. భారతీయులందరి హక్కులను పరిరక్షించేవిధంగా, అందరినీ కలుపుకునిపోయే విధంగా, అందరికీ వర్తించే విధంగా ఎంతో శ్రమతో దీనిని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కూడా సాజి అవమానించారన్నారు. మన దేశ పునాదులను ధ్వంసం చేసే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రయత్నం జరిగిందన్నారు. ఇది ఓ ఎమ్మెల్యే హోదాకు తగదని, అంతేకాకుండా రాజ్యాంగాన్ని బలపరచవలసిన మంత్రికి కూడా తగదని చెప్పారు. ఈ నేపథ్యంలో సాజి చెరియన్‌ను తక్షణమే కేరళ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 


సాజి చెరియన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీశన్ కూడా డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 


బీజేపీ డిమాండ్‌ను తోసిపుచ్చిన సీపీఎం

సాజి చెరియన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ చేసిన డిమాండ్‌ను కేరళ అధికార కూటమిలోని సీపీఎం తోసిపుచ్చింది. ఆయన అనుకోకుండా నోరు జారి మాట్లాడారని తెలిపింది. 


ఇదిలావుండగా, సాజి చెరియన్ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. తాను రాజ్యాంగ విలువలను బలపరుస్తానని చెప్పారు. రాజ్యాంగ విలువల సాధనలో తాను, తన పార్టీ ముందు వరుసలో ఉంటాయన్నారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ సాంఘిక న్యాయం, ఆర్థిక భద్రత ఉన్నాయని, అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం ఉండటం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలని తాను చెప్పానని తెలిపారు. 


కేరళలోని పటనంతిట్టలో మంగళవారం జరిగిన సీపీఎం కార్యక్రమంలో సాజి చెరియన్ మాట్లాడుతూ, భారత దేశానికి గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగం ఉందని మనమంతా చెప్తూ ఉంటామని, అయితే భారత దేశంలో అత్యధికులను కొల్లగొట్టడానికే ఈ రాజ్యాంగాన్ని రాశారని తాను అంటానని చెప్పారు. బ్రిటిషర్లు తయారు చేసిన దానిని ఓ భారతీయుడు రాజ్యాంగంగా రాశారని అన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో 75 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారన్నారు. 


Updated Date - 2022-07-06T23:30:58+05:30 IST