తెలంగాణపై బీజేపీ పగటి కలలు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-07-02T05:02:03+05:30 IST

తెలంగాణ ప్రజల్లో బీజేపీకి ఆదరణ లేకున్నా అధికారంలోకి వస్తామంటూ ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణపై బీజేపీ పగటి కలలు: ఎమ్మెల్యే
నారాయణఖేడ్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌, జూలై 1: తెలంగాణ ప్రజల్లో బీజేపీకి ఆదరణ లేకున్నా అధికారంలోకి వస్తామంటూ ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఖేడ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్ర భాగస్వామ్యం ఉందంటూ అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక రైతులు తెలంగాణ ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు వచ్చి తాగునీటిని తీసుకెళ్తున్నారని చెప్పారు. డబుల్‌ఇంజన్‌ సర్కార్‌ తెలంగాణాలో చెల్లదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చిందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పరశురాం, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు విజయ్‌బుజ్జి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నగేష్‌, మాజీ సర్పంచ్‌ నజీబ్‌, నాయకులు రమేష్‌ చౌహాన్‌, రవీందర్‌నాయక్‌, అభిషేక్‌ షెట్కార్‌, ప్రభుయాదవ్‌, రాజునాయక్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పర్యటించారు. వర్షాలతో మట్టిరోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిల్వ ఉన్ననీటిని తొలగించి, మొరం వేయించి చదును చేయించారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఆయనవెంట నజీబ్‌, అభిషేక్‌ షెట్కార్‌, నగేష్‌, మూఢరామక్రిష్ణ, తదితరులు ఉన్నారు. 


 


Updated Date - 2022-07-02T05:02:03+05:30 IST