ప్రధాని మోదీతో భేటీ అనంతరం BJP కార్పొరేటర్ల రియాక్షన్ ఇదీ.. ఆ మహిళా నేత పార్టీ మారుతున్నారా..?

ABN , First Publish Date - 2022-06-08T17:21:54+05:30 IST

ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో భేటీ అనంతరం BJP కార్పొరేటర్ల రియాక్షన్ ఇదీ.. ఆ మహిళా నేత పార్టీ మారుతున్నారా..?

  • దిశానిర్దేశనం
  • కార్పొరేటర్లతో మోదీ భేటీ 
  • ఆత్మీయ పలకరింపు  
  • ప్రధాని సూచనలు ఆత్మ విశ్వాన్ని పెంచాయి : కార్పొరేటర్లు

హైదరాబాద్‌ సిటీ/ రాంనగర్‌/నల్లకుంట/రాజేంద్రనగర్‌ : ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. గత నెల 26న ప్రధాని హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా భారీ వర్షం కారణంగా కొందరు కార్పొరేటర్లు కలుసుకోలేకపోయారు. దీంతో గ్రేటర్‌కు చెందిన కార్పొరేటర్లతో భేటీ అవ్వడానికి మంగళవారం సాయంత్రం ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఆయన రాజకీయంగా, జీవితంలో ఎదిగేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. చివరగా కార్పొరేటర్లతో మోదీ ఫొటోలు దిగారు. కష్టపడితే భవిష్యత్‌ తమదేనంటూ దిశానిర్దేశనం చేశారు.


నూతన ఉత్తేజం

ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలనే ప్రధాని సూచనలతో ఆత్మవిశ్వాసంతో పాటు నూతనోత్తేజం కలిగింది. ప్రధాని మార్గదర్శకాలకు అనుగుణంగా డివిజన్‌లో పనిచేస్తాం. - బి.పద్మావెంకటరెడ్డి, బాగ్‌అంబర్‌పేట


అరుదైన గౌరవం

మోదీతో కార్పొరేటర్ల భేటీ మాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాం. ఆయన మాటలను జీవితంలో మరచిపోలేం. - వై.అమృత,  నల్లకుంట


భరోసా ఇచ్చారు..

2023లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి పనిచేయాలని, పనిని బట్టి గుర్తింపు లభిస్తుందని సూచించారు. - కె.రవిచారి, రాంనగర్‌


మరువలేని జ్ఞాపకం 

ప్రధాని మోదీతో భేటీ కావడం జీవితంలో మరువలేని జ్ఞాపకం. ఆయన మాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భేటీలో నేనే అతి చిన్న వయస్కురాలిని కావడం ఆనందంగా అనిపించింది. - జి.రచనశ్రీ, కవాడిగూడ.


ఈ భేటీకి అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సి.సునీతాప్రకాష్‌ గౌడ్‌ వెళ్లకపోవడంతో పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ, తాను పార్టీ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని, వ్యక్తిగత కారణాలతోనే వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-08T17:21:54+05:30 IST