బీజేపీ కార్పొరేటర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-05-18T15:41:24+05:30 IST

పాత పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేశారనే అభియోగంతో మీర్‌పేట్‌ 26వ డివిజన్‌

బీజేపీ కార్పొరేటర్‌ సస్పెన్షన్‌

పంచాయతీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ కేసులో..

హైదరాబాద్/సరూర్‌నగర్‌: పాత పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేశారనే అభియోగంతో మీర్‌పేట్‌ 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెండ్యాల నర్సింహను ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెండ్యాల నర్సింహ కార్పొరేటర్‌గానే కాకుండా మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 9వ డివిజన్‌లోని నందిహిల్స్‌కు చెందిన ప్లాటు యజమాని బి.జగన్‌మోహన్‌రెడ్డి నుంచి రూ.2.25 లక్షలు తీసుకుని, పాత గ్రామ పంచాయతీ కాలం నాటి తేదీ (01.02.2016)తో అనుమతి ఇచ్చారు. ఆయన ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టగా కార్పొరేషన్‌ అధికారులు పత్రాలు పరిశీలించగా అవి బోగ్‌సవి అని తేలింది.


దాంతో యజమాని జగన్‌మోహన్‌రెడ్డి గత మార్చి 29న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. తన నుంచి రూ.2.25 లక్షలు తీసుకుని పంచాయతీ పర్మిషన్‌ ఇచ్చారని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, ఆస్తిని మార్టిగేజ్‌ చేయడం లాంటివి ఏమీ అవసరం లేదని  కార్పొరేటర్‌ నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా కలెక్టర్‌ మునిసిపల్‌ అధికారులను ఆదేశించగా, వారి పరిశీలనలోనూ సదరు అనుమతి పత్రాలు నకిలీవని తేలింది. నివేదిక పరిశీలించిన కలెక్టర్‌ కార్పొరేటర్‌ నర్సింహకు మార్చి 31న షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఇదంతా అధికార పార్టీ రాజకీయ కుట్ర అని, తాను బోగస్‌ అనుమతులు ఇవ్వలేదని షోకాజ్‌ నోటీసుకు కార్పొరేటర్‌ వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని కలెక్టర్‌ కార్పొరేటర్‌ నర్సింహను ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫిర్యాదుదారుడు సమర్పించిన ఆడియో క్లిప్పింగ్స్‌పై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలంటూ మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌కు గత ఏప్రిల్‌ 30న కలెక్టర్‌ లేఖ రాశారు. ఇన్‌స్పెక్టర్‌ సమర్పించే నివేదిక ఆధారంగా తుది చర్యలు ఉంటాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-18T15:41:24+05:30 IST