మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర

ABN , First Publish Date - 2020-07-12T07:49:23+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో బిజీగా ఉన్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ శనివారం ఆరోపించారు...

మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర

  • కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలకు వల
  • రూ.10-25 కోట్ల ఆఫర్‌: రాజస్థాన్‌ సీఎం గెహ్లోత్‌

జైపూర్‌, జూలై 9: కరోనా మహమ్మారిపై పోరాటంలో బిజీగా ఉన్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ శనివారం ఆరోపించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయల ఆశ చూపి తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. బీజేపీ జాతీయ నేతల ఆదేశాలతో రాష్ట్ర నేతలు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఇస్తామన్నారని, రాజీనామా చేసిన తర్వాత మరో రూ.15 కోట్లు ఇస్తామని ఆశ పెట్టారని గెహ్లోట్‌ విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇలాగే 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ తీర్థం పుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ ఉచ్చులో పడలేదన్నారు. ఈ కుట్రపై పోలీసు అధికారుల ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఇలాంటి కుతంత్రాలు జరగలేదని, 2014 తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు, మతం పేరిట ప్రజలను చీల్చడం, రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటి నీచపు పనులకు బీజేపీ దిగజారిందని గెహ్లోత్‌ తీవ్రంగా విమర్శించారు.


గోవా, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి చిన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి కుతంత్రాలతోనే బీజేపీ గద్దెనెక్కిన విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్రలో మెజారిటీ లేకున్నా బీజేపీ నేత సీఎంగా ప్రమాణం చేయడం వంటి దిగజారుడు చర్యలకు సైతం పాల్పడిందని ఎద్దేవా చేశారు. 200 మందితో కూడిన రాజస్థాన్‌ అసెంబ్లీలో గెహ్లోత్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాగా, గెహ్లోట్‌ నియమించిన ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేసింది. 


Updated Date - 2020-07-12T07:49:23+05:30 IST