మమత బెనర్జీ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-08T17:27:25+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు

మమత బెనర్జీ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. ‘ఘెరావ్ సీఆర్‌పీఎఫ్ జవాన్స్’ అని ఆమె పిలుపునిచ్చారని, ఇది దేశ వ్యతిరేకమని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి గురువారం ఫిర్యాదు చేసింది. శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆమెపై నిషేధం విధించాలని కోరింది. 


బీజేపీ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, మమత బెనర్జీ బుధవారం ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీకి చెందిన సీఆర్‌పీఎఫ్ మహిళలను కొడుతోందని, ప్రజలను వేధిస్తూ, చంపుతోందని ఆరోపించారు. ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్ళకుండా సీఆర్‌పీఎఫ్ అడ్డుకుంటోందన్నారు. వాళ్ళని అలా చేయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారన్నారు. తాను పశ్చిమ బెంగాల్ హోం మంత్రినైనప్పటికీ పోలీసులకు అటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో పోలీసులను బీజేపీ ప్రభావితం చేసిందని, పోలీసులను నమ్మవద్దని కోరారు. అవసరమైతే బృందాలుగా ఏర్పడి పోలీసులను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులను కొందరు మాటల్లోపెట్టి, మరికొందరు త్వరత్వరగా వెళ్ళి ఓట్లు వేయాలని కోరారు. 


294 శాసన సభ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తమకు 200కు పైగా స్థానాలు లభిస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మమత బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్తోంది. అయితే బీజేపీ జోస్యంపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. బీజేపీకి కనీసం రెండంకెల్లో అయినా స్థానాలు దక్కబోవని ఎద్దేవా చేసింది. మమత బెనర్జీ నేతృత్వంలో మళ్ళీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తోంది.


 

Updated Date - 2021-04-08T17:27:25+05:30 IST