సోనియా గాంధీకి జేపీ నడ్డా లేఖ

ABN , First Publish Date - 2021-05-11T18:43:39+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ విధానంపై ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని

సోనియా గాంధీకి జేపీ నడ్డా లేఖ

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ విధానంపై ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ఆందోళన సృష్టించవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీతో సహా ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలను కోరారు. ప్రజలను తప్పుదోవపట్టించడాన్ని ఆపాలని కోరారు. ఈ మేరకు ఆయన సోనియా గాందీకి మంగళవారం ఓ లేఖ రాశారు. 


కోవిడ్-19 రెండో ప్రభంజనం చాలా తీవ్రమైన విపత్తు అని, దీనికి కారణం మోదీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో జేపీ నడ్డా స్పందిస్తూ సోనియా గాంధీకి నాలుగు పేజీల లేఖ రాశారు. భారత దేశంలో వ్యాక్సిన్ తయారవడం దేశానికి గర్వకారణమైన విషయం కావాలన్నారు. దానికి బదులుగా కాంగ్రెస్ నేతలు ఈ వ్యాక్సిన్‌ను ఎగతాళి చేసే ప్రయత్నం చేశారని, ప్రజల మనసుల్లో సందేహాలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పని చేశారన్నారు. వ్యాక్సిన్లను అనుమానించే చరిత్ర లేనటువంటి దేశంలో సందేహాలను సృష్టించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న రికార్డు కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. అది కూడా వందేళ్ళకోసారి వచ్చే మహమ్మారి విలయం సృష్టిస్తుండగా ఇలా జరుగుతోందని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ చేయడంలో బాధ్యతను విస్మరిస్తోందని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మధ్య సమాచార లోపం తీవ్రంగా ఉందా? అని ప్రశ్నించారు. అత్యున్నత స్థాయి కాంగ్రెస్ నేతలు ఏప్రిల్‌లో మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ను వికేంద్రీకరించాలని కోరిన సంగతిని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ తొలి రెండు దశల్లోనూ 160 మిలియన్ల మందికి అందజేసినట్లు తెలిపారు. 


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా పేదలకు సాయపడేందుకు ముందుకు వస్తాయా? అని ప్రశ్నించారు. 


వ్యాక్సినేషన్ విధానాన్ని, కోవిడ్-19 మహమ్మారిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నడ్డా ఆరోపించారు. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తనకు తాను మేలు చేసుకోవడం లేదన్నారు. లాక్‌డౌన్‌ను ఓ వైపు వ్యతిరేకిస్తూ, మరోవైపు కావాలంటున్నారని మండిపడ్డారు. కోవిడ్ రెండో ప్రభంజనంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకుండా, తమకు ఏ సమచారమూ రావడం లేదని ఆరోపిస్తున్నాయని పేర్కొన్నారు. 


కేరళలో భారీ ఎన్నికల ప్రచార సభల వల్ల కోవిడ్ కేసులు పెరిగాయని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలపై అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడుతోందని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. నిరసనలకు మద్దతిస్తూ, కోవిడ్ మార్గదర్శకాలను పాటించడం గురించి మాట్లాడుతోందని ఆరోపించారు. పంజాబ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 


Updated Date - 2021-05-11T18:43:39+05:30 IST