వికసించని కమలం

ABN , First Publish Date - 2022-02-23T14:45:47+05:30 IST

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రెండాకుల పార్టీ అన్నాడీఎంకే వాడిపోయింది. ఇక ఒంటరిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ‘కమలం’ వికసించకుండానే మిగిలిపోయిం

వికసించని కమలం

చెన్నై: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రెండాకుల పార్టీ అన్నాడీఎంకే వాడిపోయింది. ఇక ఒంటరిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ‘కమలం’ వికసించకుండానే మిగిలిపోయింది. దీంతో ఎంతోకొంత లాభదాయకంగా కనిపించిన ఈ జోడీ.. విడిపోవడంతో నష్టమే తప్ప, లాభం లేదని ఇరువర్గాలు పునరా లోచనలో పడినట్లు కనిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే -బీజేపీ కలిసి పోటీ చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల జోడీ కొంత మెరుగ్గానే వున్నట్లు అనిపించింది. అన్నాడీఎంకే సంగతె లాగుతన్నా బీజేపీకి నలుగురు శాసనసభ్యులు చేరడంతో ఆ పార్టీ లాభ పడింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఒంటరిగా పోటీ చేస్తే తమకు ఏ మేరకు ఓటు శాతం ఉంటుందో స్పష్టమవుతుందన్న ఉద్దేశంతో బీజేపీ ప్రయోగం చేయగా, తమపై ఒత్తిడి లేకుండాపోయిందని అన్నాడీఎంకే సంబరప డింది. దీంతో సీట్లు ఆశించిన అభ్యర్థులందరినీ అన్నాడీఎంకే సంతృప్తి పరచగలిగింది.


వ్యూహమేదీ?

గత ఏడాది అధికారం కోల్పోయిన అన్నాడీఎంకేలో.. ఈసారి ఎన్నికలకు ప్రత్యే కంగా వ్యూహమంటూ లేకుండాపోయింది. ఆ పార్టీ ఉపసమన్వయకర్త, తాజా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కొంత మేర ప్రచారం చేసినా అది పెద్దగా ఫలిత మివ్వలేకపోయింది. పార్టీలో సమన్వయలోపం, వ్యూహలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ ఎన్నికల ఫలితాలతో పార్టీకి పెద్దగా ఒరిగేదే మీలేదన్న భావన ఆది నుంచే కార్యకర్తల్లో కనిపించింది. దీంతో తమ అభ్యర్థిని గెలిపించి తీరాలన్న కసి వారిలో కనిపించలేదన్న విమర్శ అంతర్గతంగా వినిపిస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఆది నుంచి ముమ్మరంగా ప్రచారం చేశారు. జాతీయ నేతలెవ్వరూ రాకపోయినా, రాష్ట్ర నేతలు కార్యకర్తలను సమన్వయపరచు కుంటూ ప్రచారం చేశారు. కొన్ని చోట్ల కార్యకర్తలు తక్కువస్థాయిలో వున్నా... ప్రచార భేరి మాత్రం హోరెత్తించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నమే చేసినట్లు కనిపించింది. దీనికి తోడు స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ, వాటిని పరిష్కరించేందుకు తమకు అవకాశమివ్వాలంటూ కమలనాధులు చేసిన అభ్యర్థన ఓటర్లను కొంత ఆలోచింపజేసినా, రాష్ట్రంలో అధికారం లేని పార్టీ అభ్యర్థులకు ఇప్పుడు ఓటేస్తే తమకు పనులు కావన్న భావన ఓటర్లలో కనిపించింది. అందుకే బీజేపీ కార్యకర్తలు వీధివీధి ప్రచారం చేసినా ఓటర్లపై పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ పార్టీ స్వల్ప స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

Updated Date - 2022-02-23T14:45:47+05:30 IST