Abn logo
Feb 3 2020 @ 17:58PM

మంట కలిసిన మర్యాద

నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అమరావతి కలిసివచ్చే అంశం. అమరావతి తరలింపును బీజేపీ అడ్డుకోగలిగితే ఆ పార్టీకి ప్రజల ఆదరణ లభిస్తుంది. రాజధాని రైతులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల వారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బీజేపీ పెద్దలు కట్టడి చేయాలని ఆశిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు ఈ దిశగా నిర్దుష్ట కార్యాచరణ ప్రకటించకపోవడం పట్ల ప్రజలు నిరాశ చెందారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అక్కడ బీజేపీ పెద్దలతో ఏమి మాట్లాడారో తెలియదు. మొత్తం మీద అందివచ్చిన అవకాశాన్నిబీజేపీ నాయకులు చేజార్చుకుంటున్నారన్న భావన మాత్రం రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించింది.

 

అమరావతీ! ఊపిరి పీల్చుకో!! ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఇప్పటివరకు అందరూ భావించిన అమరావతి ఊపిరి తీయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తలపెట్టినప్పటికీ.. శాసన మండలి చైర్మన్‌ మహ్మద్‌ షరీఫ్‌ ఆ నగరికి ప్రస్తుతానికి ప్రాణవాయువు అందించారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు తీసుకుంటే సహించబోమని హెచ్చరించింది. ఫలితంగా అమరావతి మనుగడకు ప్రస్తుతానికి ఢోకా లేదు. వికేంద్రీకరణ బిల్లుకు సెలెక్ట్‌ కమిటీ ఆమోదం లభించి... శాసన మండలిలో పాస్‌ అవడానికి నాలుగు నెలల వ్యవధి పడుతుంది.


ఆ తర్వాత అది చట్టరూపం తీసుకున్నప్పటికీ, విచారణ జరపడానికి హైకోర్టు సిద్ధంగా ఉంది. నికరంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏడాది పాలన పూర్తి అయ్యేసరికి అమరావతి ఉసూరుమంటూనే ఉంటుంది. అమరావతి నగరానికి వేల ఏళ్ల చరిత్ర ఉందని కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తన ‘భగవంతుని మీది పగ’ నవలలో వివరించారు. అంతటి ఘనచరిత్ర ఉన్న అమరావతి ఆయుష్షును వికేంద్రీకరణ పేరిట హరించాలన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నానికి శాసన మండలిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాన్ని విపరీత మనస్తత్వం కలిగిన జగన్మోహన్‌ రెడ్డి సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు.

 

50 శాతానికిపైగా ఓట్లతో 151 సీట్లలో గెలిచిన తనకు ఇంత అవమానమా? అంటూ ఆయన రగిలిపోతున్నారు. ఫలితమే శాసన మండలి రద్దుకు ప్రతిపాదనలు! మయసభలో పరాభవానికి గురైన దుర్యోధనుడు పాండవులపై అసూయతో రగిలిపోయినట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శాసనమండలిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసూయ ద్వేషాలతో రగిలిపోయే వారు అంతిమ విజయాన్ని అందుకోలేరని చరిత్ర చెబుతోంది. అమరావతి విషయంలో కూడా జగన్మోహన్‌ రెడ్డికి ఇదే అనుభవం ఎదురుకావొచ్చు. ‘విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని ఎవరు అడిగారు?’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు ఆంతరంగిక సంభాషణలలో ప్రశ్నిస్తున్నారు.

 

‘మేం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఉన్నదాంతో సంతృప్తిపడే మనస్తత్వం మా ప్రజలది. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అనుచరులు విశాఖలో వాలిపోతారన్న భావనే మాకు రుచించడం లేదు. మేం సంపాదించుకున్న భూములకు టికానా ఉండదా? అన్న ఆందోళనలో మేం ఉన్నాం’’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో స్థలాలు, భూములు ఉన్నవారు అవి కబ్జాకు గురవుతాయేమోనన్న భయంతో ప్రహరీలను నిర్మించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారు.

 

మండలిపై మాటల మంటలు

తన అహంపై దెబ్బకొట్టిన శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు దాదాపుగా వచ్చిన ముఖ్యమంత్రి... ‘‘పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు యేటా 60 కోట్లు ఖర్చయ్యే శాసనమండలి అవసరమా?’’ అని ప్రశ్నిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు వంటివాళ్లు తందానా అని అంటున్నారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన బిల్లును శాసన మండలి అడ్డుకోవడం ఏమిటి?’’ అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. చరిత్ర తెలియనివారికి ఏమి చెప్పగలం? అయినా ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలిని పునరుద్ధరించింది ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డే కదా! అప్పుడు మంత్రిగా ఉన్న ధర్మాన వంటివాళ్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేదో తెలియదు.

 

వికేంద్రీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు గానీ, ఆ తర్వాత శాసన మండలిలో సెలెక్ట్‌ కమిటీకి పంపే సమయంలో గానీ అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యుల ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉంది. ఉభయ సభల సభాపతుల వ్యవహార శైలి గురించి కూడా మాట్లాడుకోవాలి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, చైర్మన్‌్‌ షరీఫ్‌ కూడా 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే. ప్రజారాజ్యం ఆవిర్భావంతో సీతారాం ఆ పార్టీలోకి జంప్‌ అయ్యారు. షరీఫ్‌ మాత్రం నమ్ముకున్న పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి సేవలందించిన ఆయనకు ఎట్టకేలకు శాసన మండలి చైర్మన్‌ పదవి లభించింది.

 

షరీఫ్‌ తరహాలో మొదటినుంచి పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న పలువురికి శాసన మండలిలో అవకాశం కల్పించినందున వారంతా పార్టీకి విధేయులుగానే ఉన్నారు. ఫలితంగానే తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో పైచేయి సాధించగలిగింది. మధ్యలో వచ్చినవారు మాత్రం ప్రలోభాలకు లొంగిపోయారు. పదవుల పంపకంలో పార్టీ విధేయులకే ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పరిణామం రాజకీయ పార్టీలకు గుర్తుచేస్తోంది. ఈ విషయం అలా ఉంచితే, అధికార పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు తనను ఎంతగా దూషించినా చైర్మన్‌ స్థానంలో ఉన్న షరీఫ్‌ శాంతంగానే ఉండిపోయారు. తనపై ఉభయ పక్షాల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రాజధాని రైతుల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.

 

ఇదే వికేంద్రీకరణ బిల్లుపై శాసన సభలో చర్చ సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం ఎలా ప్రవర్తించారో ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవడం మంచిది. తానొక సభాపతినన్న విషయాన్ని విస్మరించిన సీతారాం... పలు సందర్భాలలో చంద్రబాబు సహా తెలుగుదేశం సభ్యులపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రవర్తనను విజ్ఞులు జీర్ణించుకోలేకపోయారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అధికారపార్టీ సభ్యులు నానా మాటలు అంటున్నా.. కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. ‘బలమైన తెలుగుదేశం పార్టీని ప్రస్తుత పరిస్థితికి తీసుకువచ్చిన చంద్రబాబునాయుడు 70 ఏళ్లు వచ్చినా ఆ బతుకు బతకడం ఎందుకు?’ అని మంత్రి కొడాలి నాని దూషించినా, సీతారాం ఆనందించారే గానీ అడ్డుపడలేదు. అధికార పార్టీకి చెందినవాళ్లు తనను ఎంతగా దూషించినా చంద్రబాబు మౌనంగా భరించారే తప్ప ప్రతిదాడికి దిగలేదు.

 

తన ప్రసంగం చివరిలో అమరావతిని తరలించవద్దని వయసులో తనకంటే చిన్నవాడైన జగన్మోహన్‌ రెడ్డికి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నానని చంద్రబాబు చెప్పిన మాటలు కూడా అధికార పార్టీ మనసు మార్చలేదు. కొంతమంది మంత్రులు, శాసన సభ్యులు మాట్లాడిన తీరు చూసిన తర్వాత అలాంటి వారిని ఎన్నుకున్నందుకు వారికి ఓట్లు వేసినవాళ్లు కూడా చింతిస్తూ ఉండి ఉంటారు. తనను ఆనందింపజేయడానికై మంత్రులు, శాసనసభ్యులు పరిధి దాటి ప్రవర్తించినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వారించకపోగా.. ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. శాసన మండలిలో ఉండాల్సిన విద్యావంతులు వగైరా శాసనసభలోనే ఉన్నందున మండలి అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్యావంతులు అంటే సభ్యత, సంస్కారం లేకుండా నిండుసభలో బూతులు మాట్లాడేవారు అని నిర్వచించుకోవాలేమో! శాసన మండలిలో మంత్రులు సైతం చైర్మన్‌ స్థానం ఎదురుగా బల్లలు ఎక్కడాన్ని ఇప్పుడే చూశాం.

 

అంతకు కొద్దిగా ముందు శాసనసభలో జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా ఆక్షేపించారు. పోడియం వద్దకు వచ్చేవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఈ మాటలు అన్న కొద్దిసేపటికే శాసన మండలిలో అధికారపక్ష సభ్యులు ఎలా ప్రవర్తించారో మనం చూశాం. అందుకే అంటారు ‘కొంతమంది నోటివెంట కొన్ని మాటలు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది’ అని! శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ను మంత్రులు బొత్స తదితరులు ఎలా దూషించారో విన్నాం. అనర్హులను అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందనీ, తొత్తులకు పదవులు కట్టబెట్టారనీ మంత్రి బొత్స విమర్శించడం అభ్యంతరకరంగా ఉంది.

 

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బొత్స ఆ పార్టీని వదిలిపెట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టుగా... షరీఫ్‌ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీలలో చేరలేదు. దశాబ్దాలపాటు తనను ఏ పదవీ వరించకపోయినా ఆయన నమ్ముకున్న పార్టీని కాదనుకోలేదు. దీన్నిబట్టి ఎవరికి విలువలు ఉన్నాయో అర్థమవడం లేదా? అటు శాసనసభలో, ఇటు శాసనమండలిలో అధికారపార్టీకి చెందిన మంత్రులు, సభ్యుల ప్రవర్తన మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది.

 

వింత మాటలు, వితండ వాదనలు

తన చర్యలు, నిర్ణయాలపై ఇంటా బయటా విమర్శలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి వాటిని ఖాతరు చేయకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనను సమర్థిస్తున్న వారు సైతం తొందరలోనే పశ్చాత్తాపం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. జాతీయ మీడియా సైతం తరచుగా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని జగన్‌ సహా కొంతమంది మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేకపోయినా రాజధానులను నోటిఫై చేస్తారు. నోటిఫైడ్‌ రాజధానిలోనే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, శాసనసభ, ప్రధాన న్యాయస్థానాలు ఉంటాయి. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలను పరిపాలించిన వాళ్లు పిచ్చివాళ్లు అయి రాజధానులను ఏర్పాటు చేసుకోలేదు.

 

జగన్‌ అండ్‌ కో మాటల ప్రకారం రాజశేఖర్‌ రెడ్డి కూడా పిచ్చివాడే! ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని మంత్రి కన్నబాబు వంటివాళ్లు వింతవాదన చేస్తున్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా.. ‘ముఖ్యమంత్రి సచివాలయానికి పోయే అవసరం ఏమి ఉంది? నేను ఇంట్లో ఉన్నా, ఫామ్‌ హౌస్‌లో ఉన్నా అదే సచివాలయం అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక విషయాలలో కేసీఆర్‌నే ఆదర్శంగా తీసుకుంటున్న జగన్‌ అండ్‌ కో ఇప్పుడు రాజధానికే సరికొత్త నిర్వచనం ఇస్తోంది. ఈ గుంపు వాదన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌కు రాజధానే అవసరం లేదన్నట్టుగా ఉంది. విశాఖలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో ప్రస్తుతానికి శాసనసభ భవనాన్నే ఉంచి మూడు రాజధానుల పాట పాడుతున్నారు.

 

గుజరాత్‌ రాజధానిగా గాంధీనగర్‌ను ప్రకటించుకున్నారు. అహ్మదాబాద్‌కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీ నగర్‌లోనే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉంటాయి. అందుకే దాన్ని రాజధాని అని ప్రకటించుకున్నారు. విధి నిర్వహణ కోసం గాంధీనగర్‌ వెళ్లే ఉద్యోగులు, అధికారులు సాయంత్రానికల్లా అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అహ్మదాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాల కోసం గాంధీనగర్‌ నిర్మించి రాజధానిగా ప్రకటించుకున్నారు. భారతదేశంతో పోల్చితే మూడు రెట్లు అధిక భూభాగం ఉన్న అమెరికాకు ఒక వాషింగ్టన్‌ మాత్రమే రాజధాని.

 

దాదాపు 150 కోట్లు జనాభా ఉన్న చైనాకు కూడా ఒకే రాజధాని ఉంది. జగన్‌ అండ్‌ కో లెక్క ప్రకారం అభివృద్ధిలో పోటీపడుతున్న అమెరికా, చైనావాళ్లు తెలివి తక్కువ వాళ్లన్నమాట! శాసన మండలి నిర్వహణ కోసం యేటా 60 కోట్ల రూపాయలు ఖర్చుచేయలేని స్థితిలో పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ఉందని చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి.. మూడు రాజధానులు నిర్మిస్తామనడం, ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. రాజధాని విలువ, నగర ప్రాధాన్యం తెలియనివాళ్లు లేదా తెలిసినా గుర్తించడానికి ఇష్టపడనివాళ్లు రాజ్యమేలుతుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.

 

మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా వందకోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులను అభివృద్ధి చేస్తుందంటే నమ్ముతున్న వారిని ఏమనుకోవాలి? గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం పదిశాతం వడ్డీకి అప్పు చేసినప్పుడు తీవ్రంగా తప్పుబట్టిన జగన్మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు 11 శాతానికిపైగా వడ్డీకి అప్పుచేసి పంచిపెడుతున్నారు. అమరావతిని త్రిశంకు స్వర్గంలోకి నెట్టిన జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్లు పూర్తి అయ్యేసరికి ఏ రాజధానినీ అభివృద్ధి చేయకపోగా, రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేకుండా చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

 

బీజేపీ, జనసేన ఏం చేస్తాయి?

అమరావతి విషయమై వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య పోరాటం జరుగుతున్న సమయంలోనే జనసేన - బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. రాజధానిని తరలించకుండా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు అడ్డుకుంటారని రాష్ట్ర ప్రజలు గంపెడాశతో ఉన్నారు. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం ద్వారా పైచేయి సాధించిన రోజే జనసేన–-బీజేపీ నాయకులు దేశ రాజధానిలో మంతనాలు జరుపుతూ ఉన్నారు. చివరకు త్వరలోనే లాంగ్‌మార్చ్‌ నిర్వహిస్తామని ఇరు పార్టీల నాయకులు ఉమ్మడిగా ప్రకటించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అమరావతి కలిసివచ్చే అంశం.

 

అమరావతి తరలింపును బీజేపీ అడ్డుకోగలిగితే ఆ పార్టీకి ప్రజల ఆదరణ లభిస్తుంది. రాజధాని రైతులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలవారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బీజేపీ పెద్దలు కట్టడి చేయాలని ఆశిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు ఈ దిశగా నిర్దుష్ట కార్యాచరణ ప్రకటించకపోవడం పట్ల ప్రజలు నిరాశ చెందారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అక్కడ బీజేపీ పెద్దలతో ఏమి మాట్లాడారో తెలియదు. మొత్తంమీద అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ నాయకులు చేజార్చుకుంటున్నారన్న భావన మాత్రం రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించింది.

 

రాజధాని తరలింపు విషయంలో జగన్మోహన్‌ రెడ్డి సక్సెస్‌ అయితే మాత్రం జనసేన బీజేపీ చేతులు కలిపినా ఒరిగేది ఏమీ ఉండదు. రాష్ట్రంలో బీజేపీ బలపడకపోగా ఆ పార్టీతో చేయి కలిపినందుకు జనసేన ఉన్న బలాన్ని కూడా కోల్పోవచ్చు. జగన్‌ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మనసులో ఏముందో మాత్రం తెలియడం లేదు. రాజధాని తరలింపునకు ఈ ఇరువురు పెద్దల ఆమోదం ఉందన్నట్టుగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించే పనిలో మాత్రం ప్రస్తుతానికి జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు. రాజధాని తరలింపు విషయంతోపాటు ఇతరత్రా అంశాలపై స్పష్టత రాకముందే తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌..

 

బీజేపీతో ఎందుకు చేతులు కలిపారో తెలియక జనసైనికులు సతమతమవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ లేకుండా కేవలం జనసేన -బీజేపీ మాత్రమే చేతులు కలిపినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఢీ కొనలేరన్న అభిప్రాయం కూడా ఉంది. సీఏఏ వంటి బిల్లుల విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ముస్లింలు రాష్ట్రంలో బీజేపీతో జతకట్టే ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు రాజకీయ పొత్తుల గురించి కాకుండా రాజధాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో గ్రూపుల గొడవ ఎక్కువగా ఉందనీ, అందుకే కేంద్ర పెద్దలు తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ చెబుతున్నారు.

 

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకునే బీజేపీని ఇరకాటంలోకి నెట్టడానికై తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అమరావతి తరలింపు అంశాన్ని ఆధారంగా చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. రాజధాని తరలింపును అడ్డుకోవడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల్లో పార్టీపట్ల వ్యతిరేకత వస్తుందా? అన్న మీమాంస తలెత్తినప్పుడు ‘ఇప్పుడు మనం 21 సీట్లకు పరిమితమయ్యాం. ఇంతకంటే పోయేది ఏముంది? అంతగా అయితే పార్టీని మూసేసుకుందాం గానీ, పార్టీపరంగా స్పష్టమైన వైఖరితోనే ముందుకు వెళ్లాలి’ అని నాటి సమావేశంలో పార్టీ అధినేత వద్ద అచ్చెన్నాయుడు స్పష్టంచేశారట! ఈ కారణంగానే శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికై తెలుగుదేశం పార్టీ తన సర్వశక్తులను ఒడ్డి పోరాడింది. వైసీపీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, ప్రలోభాలకు ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే ప్రస్తుతానికి లొంగిపోయారు.

 

సోమవారం నాటికి ఇంకెవరైనా జారిపోతారేమో తెలియదు! ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా శాసన మండలిలో కూడా బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో జగన్‌ అండ్‌ కో ఉంది. మెజారిటీ సమకూరిందన్న నమ్మకం కుదిరితే శాసన మండలిని కూడా సోమవారం నాడు సమావేశపరిచి చైర్మన్‌ షరీఫ్‌పై అవిశ్వాసం పెట్టి తొలగిస్తారు. ఆ తర్వాత తమ మనిషిని చైర్మన్‌గా ఎన్నుకుని వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసుకుంటారని చెబుతున్నారు. ప్రలోభాలు ఫలించని పక్షంలో శాసన మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసే అవకాశముంది. మండలి రద్దుకు తీర్మానం చేసినా దాన్ని పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి సంతకం కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఒకవేళ రద్దు తీర్మానాన్ని పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలోనే ఆమోదిస్తే రాష్ట్రంలో బీజేపీ మాత్రమే కాదు, జనసేన కూడా ఇరకాటంలో పడుతుంది.

 

ఏదిఏమైనా శాసన మండలి ఉంటుందా? లేదా? వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీ పరిశీలనలోనే ఉంటుందా? అన్నది తేలాలంటే సోమవారం వరకు వేచిచూడాల్సిందే. ఆ తర్వాత కూడా హైకోర్టు నుంచి గండం ఎదురవుతుంది. భూ సమీకరణ కింద రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా అడుగు ముందుకు వేయడానికి వీలులేదని హైకోర్టు ఆంక్షలు విధించవచ్చునని అంటున్నారు. 33 వేల ఎకరాలతోపాటు గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం 600 ఎకరాల భూములిచ్చిన రైతులకు ఉన్న పళంగా నష్టపరిహారం చెల్లించే పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం లేదు. దీంతో రాజధాని వ్యవహారంలో పీటముడి పడుతుంది. ఇటు అమరావతిలోనూ, అటు విశాఖలోనూ అభివృద్ధి జరిగే అవకాశం కూడా లేదు. జీవచ్ఛవంలా అమరావతి మిగిలిపోతుంది. భూములు త్యాగం చేసినందుకు నిన్నటి వరకు పూజలు అందుకున్న రైతులు.. అధికార పార్టీ నాయకుల ఛీత్కారాలను ఎదుర్కొంటూనే ఉంటారు. రైతులకు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరెక్కడా ఉండదు!

ఆర్కే

Advertisement