Abn logo
Sep 26 2021 @ 00:47AM

ఇంటికో ఉద్యోగం... నిరుద్యోగ భృతి ఏమాయే

ప్రజా సంగ్రామ యాత్రలో నల్ల కండువాతో బండి సంజయ్‌

- ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన 

- కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బంధువులకు ఉద్యోగాలు 

- తెలంగాణ విద్యావంతులకు మోసం 

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

- ప్రజా సంగ్రామ యాత్రలో నల్లకుండువాలతో నిరసన 


సిరిసిల్ల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే... నిరుద్యోగ భృతి ఏమాయే... అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ నల్ల కండువాలు ధరించి ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహించినా, ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సంజయ్‌ హెచ్చరించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ముస్తాబాద్‌ మండల కేంద్రం నుంచి ప్రారంభమై గన్నెవానిపల్లె, సేవాలాల్‌తండా మీదుగా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె నుంచి సారంపల్లి వరకు 14 కిలోమీటర్ల మేరకు కొనసాగింది. కేంద్ర పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా యాత్రలో పాల్గొన్నారు. 29వ రోజు సంగ్రామ యాత్రలో నిరుద్యోగ గర్జనగా యువకులు కదం తొక్కారు. త్యాగాలు మావి, భోగాలు కేసీఆర్‌ కుటుంబానివా అంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని నల్ల కండువాలతో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊరూవాడా ప్రచారం చేశారని తెలంగాణ వచ్చిన తరువాత ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోగా వారి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు మాత్రం డజన్ల కొద్దీ ఉద్యోగాలు ఇచ్చారన్నారు.  తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యావంతులైన యువతీ, యువకులను  మోసగించారని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగింది కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు ఉపాధి కల్పించడం కోసం కాదన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎందరో యువతీ యువకులు అశలు పెట్టుకున్నారని కానీ వారి అశలు అడియాశలు అయ్యాయని అన్నారు. ఉద్యోగాలు దొరక్క యువతీ, యువకులు ఆవేదన చెందుతున్నారని అనేక చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు లక్షా 7 వేలు కాగా తరువాత ఉద్యోగ విరమణతో 30 వేలు, ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవడంతో మరో 30 వేలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 50 వేలు, కొత్త జిల్లాల ఏర్పాటుతో 5వేలు, విద్యుత్‌ సంస్థల అవసరాల కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టులు 15 వేలు, కొత్త కార్పొరేషన్లకు 5 వేలు, ఇలా ఖాళీలు 2.50 లక్షల వరకు ఉన్నాయని ఒకటి రెండు నోటిఫికేషన్లు తప్ప పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో దాదాపు 50 మంది చనిపోయారని, కొంత మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని అన్నారు. కేసీఆర్‌ గంటల తరబడి ఉద్యోగ ఖాళీల భర్తీపై కేబినెట్‌ సమావేశాలు నిర్వహించారని ఖాళీల భర్తీకి ప్రణాళిక రూపొందిస్తున్నామని నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి ప్రయత్నించారని అన్నారు. సమావేశం ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 40 వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదని ఏడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో  ఒకటి కూడా భారీ పరిశ్రమ నెలకొల్ప లేదన్నారు. రెండు సంవత్సరాల్లో లక్షా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని కేసీఆర్‌ గంభీర ప్రకటన చేసినా ఎక్కడి వేసినా గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. గ్రూప్‌ 1 ఉద్యోగాల నియామకాలు లేవు. గ్రూప్‌ 2 తూతూ మంత్రంగా పది ఖాళీలకు రెండు ఖాళీలు భర్తీ చేసినట్లుగా ఉందన్నారు. ఎంప్లాయ్‌మెంట్‌ ఎంక్చేంజ్‌, టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో 25 నుంచి 30 లక్షల నిరుద్యోగులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మొత్తం ఖాళీలు ఒకేసారి భర్తీ చేయాలని మేము డిమాండ్‌ చేయడం లేదని ఏటా భర్తీ కోసం ఒక క్యాలెండర్‌ ప్రకటిస్తే నిరుద్యోగులు ప్రణాళిక బద్ధంగా తయారు కావడానికి సులువవుతుందని అన్నారు. నోటిఫికేషన్లు వస్తాయని ఇతర ఉద్యోగాలు వదిలి నోటిఫికేషన్లు రాక, జరిగిన పరీక్షలకు ఫలితాలు రాక రోడ్లమీద తిరుగుతున్నారని అన్నారు. ఔట్‌ సోర్సింగ్‌, కార్మిక సర్వీసులను ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన ఇంత వరకు రెగ్యులరైజ్‌ దాఖలాలు లేవన్నారు. 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును ఎందుకు కేసీఆర్‌ పక్కన పెట్టారో చెప్పాలని అన్నారు. వేతనాలు చెల్లించి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను, కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని అన్నారు. ఉద్యోగులు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టి నోటిఫికేషన్లు ఆపేయడం, కోర్టుల్లో కుట్రపూరితంగా కేసులు వేయడంతో ఉద్యోగాల భర్తీని అపడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాల్పడుతోందని అన్నారు. నిరుద్యోగ, యువతీ, యువకులకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కేసీర్‌ నిలుపుకోలేదన్నారు. నిరుద్యోగ యువతీ యువకులను ఆకర్షించి ఓట్లు దండుకుని మోసం చేశారని అన్నారు. 2019 బడ్జెట్‌ సమావేశాల్లో నిరుద్యోగ భృతికి రూ.1810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని ఐదారు నెలల్లోనే విధి విధానాలు రూపొందించి అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన హామీలు నీటి మీద రాతలుగా మిగిలాయని అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ ఖాళీలపై బీసీ,  ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులపై వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని అన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, బీజేవైంఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.