అమృతోత్సవాల పేరిట బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆర్భాటం

ABN , First Publish Date - 2022-08-13T07:00:51+05:30 IST

అమృతోత్సవాల పేరిట బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆర్భాటం

అమృతోత్సవాల పేరిట బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆర్భాటం
పల్లిపాడులో పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి

సోనియా, రాహుల్‌ని అవమానిస్తే..స్వాతంత్ర్యాన్ని అవమానించినట్టే..

ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో సీఎల్పీ నేత భట్టి

కొణిజర్ల/ వైరా / తల్లాడ, ఆగస్టు 12: స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ, టీఆర్‌ఎస్‌ తామే స్వాతంత్య్రం తెచ్చినట్లుగా అమృతోత్సవాల పేరిట ఆర్భాటం చేయటం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఆయన చేపట్టిన ఆజాదీకాగౌరవ్‌ యాత్ర నాలుగో రోజైన శుక్రవారం కొణిజర్ల మండలంలో ముగిసింది. ఉదయం పల్లిపాడు గ్రామం ప్రారంభమైన ఆయన యాత్ర శాంతినగర్‌ మీదుగా వైరా, స్టేజీ పినపాక, రెడ్డిగూడెం మీదుగా తల్లాడ చేరుకుంది. ఈ సందర్భంగా వైరా, పినపాక గ్రామాల్లో జరిగిన సభల్లో భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ అలాగే నెహ్రూ కుటుంబసభ్యులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని అవమానిస్తే స్వాతంత్ర్యాన్ని అవమానించడమేనన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ మతం పేరిట దేశాన్ని విభజించి మతఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ ఎనిమిదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు అమ్ముతూ ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్న మోదీ నిరుద్యోగుల వ్యతిరేకి అని ఆరోపించారు.  కాంగ్రెస్‌ సృష్టించిన సంపదను అంబానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తూ దేశాన్ని, భవిష్యతను బహుళజాతి సంస్థలకు మోదీ తాకట్టు పెడుతున్నాడని నిప్పులు చెరిగారు. స్టేజీ పినపాక వద్ద భట్టి పాదయాత్ర జరగుతుండగా.. అటుగావెళుతున్న ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆగి భట్టికి సంఘీభావం తెలిపారు. ఇక రక్షాబంధన్‌ సందర్భంగా పలు చోట్ల భట్టికి మహిళలు రాఖీలు కట్టారు. పల్లిపాడులో రాంపుడి రాజ్యలక్ష్మీతో పాటు మరికొందరు భట్టికి రాఖీలు ఖట్టారు. ఇక వైరాలో కొణిజర్ల మండలం లక్ష్మీపురం సర్పంచ బాణోతు పద్మ తన భర్త ఉప్పలచలక ఎంపీటీసీ సభ్యుడు బాలాజీతో కలిసి వచ్చి భట్టికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. 


వైరాలో భట్టికి బంజారా మహిళల ఘనస్వాగతం

ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో భాగంగా వైరా చేరుకున్న భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ నాయకులు మాలోతు రాందా్‌సనాయక్‌, బాణోతు బాలాజీనాయక్‌ భారీ జనసమీకరణతో ఘనస్వాగతం పలికారు. లంబాడా మహిళలు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి తలపైన బిందెలతో బంజారా నృత్యాలు చేశారు. మహిళలు బోనాలతో తరలిరాగా.. కోలాట నృత్యాలు, బాణసంచా కాల్పులు, పూలవర్షంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు మహిళలు భట్టి విక్రమార్కకు హారతులిచ్చారు. భట్టి వెంట కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు మాలోతు రాందా్‌సనాయక్‌, బాణోతు బాలాజీ, శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు, నాయుడు సత్యం, వడ్డే నారాయణ, రాంపూడి రోశయ్య, పుచ్చకాయల వీరభద్రం, చప్పిడి వెంకటేశ్వరరావు, యడ్లపల్లి వీరయ్యచౌదరి, పొదిల హరినాథ్‌, బత్తుల గీత, పమ్మి అశోక్‌, పల్లపు కొండలు, బోళ్ల గంగారావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T07:00:51+05:30 IST