ఎస్పీలోకి కాంగ్రెస్, బీజేపీ, బీజేపీ టాప్ లీడర్లు

ABN , First Publish Date - 2021-10-01T21:08:09+05:30 IST

403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 314 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. కాగా, ఈ యేడాది మేలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్పీ బాగా పుంజుకుంది..

ఎస్పీలోకి కాంగ్రెస్, బీజేపీ, బీజేపీ టాప్ లీడర్లు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో దూకుడు మీదున్న సమాజ్‌వాదీ పార్టీలోకి ఇతర పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద లీడర్లు సైతం సైకిల్ (సమాజ్‌వాదీ పార్టీ గుర్తు) ఎక్కుతున్నారు. వీరితో పాటు ఇద్దరు మాఫియా లీడర్లు కూడా ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఐదు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎస్పీకి తాజా పరిణామాలు మరింత ఎక్కువ బలాన్ని చేకూర్చనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


ఎస్పీలో చేరికల వివరాలు..

*జేపీ ధన్‌గర్ నేతృత్వంలోని ‘జన్ పరివర్తన్ దళ్‌’ను పూర్తిగా ఎస్పీలో విలీనమైంది.

*గౌతమబుద్ధ నగర్ బీఎస్పీ నేత బబ్లూ సేన్, తన అనుచరులతో కలిసి ఎస్పీలో చేరారు.

*బీఎస్పీ నేత, మాజీ ఎంపీ రిజ్వానా జహీర్‌.. తన కూతురితో కలిసి ఎస్పీలో చేరారు.

*ఘటంపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఎస్పీ నేత రాం ప్రకాష్ కుశ్వాహా ఎస్పీలో చేరారు.

*బీఎస్పీ నేత రిటా కుశ్వాహా ఎస్పీలో చేరారు.

*కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే బుందేల్‌ఖండ్ వినోద్ చతుర్వేది ఎస్పీలో చేరారు.

*మహోబా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత మనోజ్ తివారి ఎస్పీలో చేరారు.

*కిన్నర్ ఏక్తా సంఘ్ జాతీయ అధ్యక్షుడు, తన అనుచరులతో కలిసి ఎస్పీలో చేరారు.

*అప్నాదళ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఓంకార్ సింగ్ ఎస్పీలో చేరారు.

*భారతీయ జనతా పార్టీ-వెనుకబడిన తరగతుల శాఖ అధ్యక్షుడు అరుణ్ కుమార్ మౌర్య ఎస్పీలో చేరారు.


403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 314 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. కాగా, ఈ యేడాది మేలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్పీ బాగా పుంజుకుంది. 3,050 జిల్లా పంచాయత్ సీట్లలో ఎస్పీ ఏకంగా 782 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార బీజేపీ 580 స్థానాలకే పరిమితం అయింది. ఇక బీఎస్పీ 336 స్థానాలతో తన ఉనికిని నిలుపుకుంది.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. రేసులో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ ప్రధానంగా ఉన్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల పోటీ నామమాత్రంగానే ఉండనున్నట్లు అంచనాలు ఉన్నాయి.

Updated Date - 2021-10-01T21:08:09+05:30 IST