ఉప ఎన్నికల్లో బీజేపీ హవా

ABN , First Publish Date - 2022-06-27T09:08:20+05:30 IST

దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించింది.

ఉప ఎన్నికల్లో బీజేపీ హవా

యూపీలో 2 లోక్‌సభ సీట్లలో గెలుపు.. ఎస్పీ కీలక స్థానాల్లో పాగా

త్రిపురలో 4 సీట్లలో 3 బీజేపీకే.. పంజాబ్‌లో కేజ్రీవాల్‌కు అకాలీ షాక్‌

లోక్‌సభలో ఉన్న ఒక్క సీటూ పాయె.. యూపీలో గెలుపు చరిత్రాత్మకం: మోదీ

వారసత్వం, కులతత్వాన్ని ఓటర్లు తిప్పికొట్టారు: యూపీ సీఎం యోగి

ఆత్మకూరు మెజారిటీ 82,888.. ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం


న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కీలక స్థానాలైన రాంపూర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా... బీజేపీ 3 స్థానాలను గెలుచుకుంది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా... టౌన్‌ బోర్డోవాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాంపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఘనశ్యాంసింగ్‌ లోధీ... ఎస్పీ అభ్యర్థి మహమ్మద్‌ ఆసీం రజాను ఓడించారు. అలాగే ఆజంగఢ్‌లో బీజేపీకి చెందిన దినేశ్‌ యాదవ్‌ నిరాహు... ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌ను ఓడించారు. ఎస్పీ నేతలు అఖిలేశ్‌ యాదవ్‌, ఆజంఖాన్‌  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తమ లోక్‌సభ సీట్లకు రాజీనామా చేశారు. దాంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి.


కాగా ఆజంగఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి గుడ్డూ జమాలి గట్టి పోటీ ఇచ్చి 2.5 లక్షలకుపైగా ఓట్లు సాధించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో విజయం ఖాయం అనుకున్న ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఆజంగఢ్‌లో ఆయన తన మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్‌ను నిలబెట్టారు. కాగా... యూపీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ఫలితాలతో కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలను ప్రజలు ఆదరించినట్లయిందని మోదీ అన్నారు. త్రిపురలో బీజేపీ అభివృద్ధి ఎజెండాకు ప్రజలు మద్దతు పలికారని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వారసత్వ పాలన, కులతత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారని యూపీ సీఎం యోగి  అన్నారు.


పంజాబ్‌లో ఆప్‌కు ఎదురుదెబ్బ

కాగా... పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి ఉప ఎన్నికలు షాక్‌ ఇచ్చాయి. ఆ రాష్ట్రంలోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థిపై శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌ వర్గం) అభ్యర్థి విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అకాలీదళ్‌ అధ్యక్షుడు సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌... ఆప్‌ అభ్యర్థి గుర్మైల్‌ సింగ్‌పై 5,822 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో లోక్‌సభలో తనకున్న ఒకే ఒక్క సీటును ఆప్‌ కోల్పోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సంగ్రూర్‌లో 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన రాజీనామా చేయడంతోనే ఉప ఎన్నికలు జరిగాయి. ఇటీవల గాయకుడు మూసేవాలా హత్య కారణంగా ప్రజల్లో ఆప్‌ పట్ల వ్యతిరేకత ఏర్పడిందంటున్నారు. అయితే ఢిల్లీలోని రాజేందర్‌నగర్‌ అసెంబ్లీ సీటును ఆప్‌ దక్కించుకోగలిగింది. కాగా.. త్రిపురలోని అగర్తలా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీపై కాంగ్రెస్‌ విజయం సాధించింది. అక్కడ ఓట్ల లెక్కింపు సందర్భంగా హింస చెలరేగింది. తమ నాయకులపై బీజేపీ గూండాలు దాడులకు దిగారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్‌ ఓ సీటును దక్కించుకుంది. 


ఆత్మకూరులో వైసీపీ భారీ విజయం

నెల్లూరు: ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో లేకపోవడంతో ఆది నుంచి ఏకపక్షంగా సాగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా పోటీకి దిగిన బీజేపీకి డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఆ పార్టీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌ కేవలం 19,332 ఓట్లకే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆయన/ఆమె కుటుంబ సభ్యులకు టికెట్‌ లభిస్తే పోటీ చేయకూడదన్న ఆనవాయితీని చాలా ఏళ్లుగా పాటిస్తున్న టీడీపీ.. ఆత్మకూరులోనూ అదే ఆనవాయితీ కొనసాగించింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో వైసీపీ ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డిని బరిలోకి దించడంతో టీడీపీ బరిలోకి దిగలేదు. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ పోటీకి దిగింది. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి సహా మొత్తం 14 మంది పోటీలో నిలిచారు. మొత్తం 2,13,338 ఓట్లుకు గాను 1,37,038 ఓట్లు పోలయ్యాయి వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు, బీజేపీకి 19,332 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి నందా ఓబులేశుకు 4,897 ఓట్లు పడ్డాయి.

Updated Date - 2022-06-27T09:08:20+05:30 IST