తిరుపతి ఉప ఎన్నికకు కమలదళం సన్నద్ధం

ABN , First Publish Date - 2020-11-12T03:41:11+05:30 IST

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ పరితపిస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికకు కమలదళం సన్నద్ధం
సునీల్‌ దియోదర్‌, సోము వీర్రాజు

‘దుబ్బాక’ విజయోత్సాహంలో బీజేపీ శ్రేణులు

అదే స్ఫూర్తితో తిరుపతి పార్లమెంట్‌ బరిలోకి..

వెంకన్న సన్నిధిలో బీజేపీ విస్తృత సమావేశం

పాల్గొననున్న రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్‌చార్జి


కమలదళంలో ‘దుబ్బాక’ విజయం ఎంతో ఉత్సాహం నింపింది. ఇదే దూకుడుతో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికకు సమాయత్తం అవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోదర్‌ల నేతృత్వంలో ఉపఎన్నిక వ్యూహరచనపై నాయకులు సమావేశం అవుతున్నారు. ఇదే సమయంలో మరో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సైతం ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండటంతో పార్లమెంట్‌ పరిధిలో రాజకీయం మెల్లమెల్లగా వేడెక్కుతోంది.


తిరుపతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ పరితపిస్తోంది. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ ఫలితంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జెండా ఎగరవేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీని ఒంటరిని చేసిన విషయం ఆ పార్టీ అగ్రనేతలు సీరియ్‌సగా తీసుకున్నారు. ఆ క్రమంలోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి బీజేపీ తహతహలాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటోంది. రాష్ట్రంలో పార్టీ గతంలో కన్నా బలపడిందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం నిరూపించుకోవడానికి తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికను ఒక అవకాశంగా మలుచుకొంటున్నారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల గడువు ఉండగానే బీజేపీ పోరుకు రంగం సిద్ధం చేసుకొంటోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోదర్‌ ఎన్నికలు అయ్యే వరకు తిరుపతిలోనే మకాం వేయనున్నట్లు సమాచారం. 


నేడు సమావేశం

తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోకర్‌ గురువారం తిరుపతిలో ఆ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు.  చిత్తూరు, నెల్లూరు జిల్లాల కమలనాథులు పాల్గొనే ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటిరిగా పోటీ చేస్తుందన్న క్లారిటీతోపాటు ఎన్నికల కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థి ఎవరన్నదానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రావెళ్ల కిషోర్‌బాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆశావహుల జాబితాలో ఈయన పేరు కూడా పార్టీ అగ్రనేతల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 


వేడెక్కుత్ను రాజకీయం

తిరుపతి ఉప ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల అయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మూడు నెలలకు ముందే సన్నాహాలు మొదలు పెట్టాయి. ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండమని పార్టీ జిల్లా శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు మొదలు పెట్టారు. నాయకత్వ సమస్య ఉన్న నియోజకవర్గల్లో కొత్త ఇన్‌చార్జులను నియమిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఽధీటైన అభ్యర్థిని బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అధికార వైసీపీ నుంచి టిక్కెట్టు ఆశిస్తూ పలువురు ఆశావహులు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నాయకులు పలువురి పేర్లను అగ్రనేతల దృష్టికి తెస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. మూడు ప్రధాన పార్టీలు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలపై దృష్టి సారించడంతో రాజకీయ సందడి కనిపిస్తోంది. 

Updated Date - 2020-11-12T03:41:11+05:30 IST