తికమకల కమలం!

ABN , First Publish Date - 2020-08-12T09:40:26+05:30 IST

దేశాన్ని నడిపిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిర్దిష్ట దిశ లేకుండా నడుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తికమకల కమలం!

  • ఒక్కో నాయకుడిది ఒక్కో తీరు.. ఆంధ్రలో దిశ లేని బీజేపీ నావ
  • వర్గాలుగా నేతలు.. రాజధాని సహా కీలకాంశాలపై భిన్న వాదనలు
  • అధ్యక్షుడు ఒకలా.. ఇతరులు మరోలా.. రామ్‌ మాధవ్‌ ఇంకోలా


మొన్నటి దాకా ఉన్న అధ్యక్షుడు అమరావతికి అనుకూలం! ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు అమరావతికి వ్యతిరేకం! ఢిల్లీలో ఉన్న నాయకుడు ఒకమాట చెబుతారు. రాష్ట్రంలో ఉన్న నేత ఇంకొకటి చెబుతారు. ‘రాజధాని రాష్ట్రం పరిధిలోనే. కేంద్రం ఏమీ చేయలేదు’ అంటూనే... ‘అమరావతి రైతులకు మాత్రం న్యాయం జరగాలి’ అని చెబుతారు. ఇదీ... బీజేపీ పరిస్థితి. ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కోరకంగా జనాన్ని గందరగోళపరుస్తుండగా... సీనియర్‌ నేత రామ్‌మాధవ్‌ ‘మూడు రాజధానుల’ను వ్యతిరేకించారు. పరోక్షంగా అమరావతిని సమర్థించారు. ఇంతకీ... బీజేపీ వైఖరేమిటి? వారికి ఒక దశా దిశా ఉందా? రాష్ట్రంలో బలపడే విషయంలోగానీ, అధికారపక్షంపై పోరాటంలోగానీ స్పష్టత ఉందా? ఇవీ విశ్లేషకుల ప్రశ్నలు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

దేశాన్ని నడిపిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిర్దిష్ట దిశ లేకుండా నడుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క అంశంలోనూ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు సరికదా.. కీలకాంశాలపై అంతర్గత వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడుతుండడం.. కేంద్ర నాయకత్వం నోరు విప్పకపోవడంతో.. ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.  బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంత వరకూ ఆ పార్టీ అనుసరించిన వైఖరి.. సోము వీర్రాజు వచ్చాక తిరగబడింది. ఉదాహరణకు.. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తీరును కన్నా గట్టిగా ప్రతిఘటించారు. కానీ వీర్రాజు రాగానే పార్టీ వాణి మారిపోయింది.


రాజధాని రైతులకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నా.. రాజధాని విషయంలో కేంద్రానికి ఏ పాత్ర లేదని.. అందులో తలదూర్చదని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. మొదటి నుంచీ ఇదే ఆ పార్టీ వైఖరి అయితే ఇంతకుముందు కన్నా సహా ఇతర బీజేపీ నేతలు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయారన్నది ప్రశ్న. కేంద్రం పాత్ర లేదని వీర్రాజు ప్రకటించిన తర్వాత అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఆ అభిప్రాయంతో విభేదించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ఆ వెంటనే రాష్ట్ర బీజేపీ పేరిట ట్వీట్‌ విడుదల కావడం గమనార్హం. రాజధాని బిల్లులపై సంతకం విషయంలో రాష్ట్ర గవర్నర్‌ కాస్త జాప్యం చేయడం.. కేంద్ర ప్రభుత్వ పాత్రపై చర్చను పెంచింది.  మొత్తానికి ఆయన సంతకం పెట్టేయడంతో మూడు రాజధానులపై జగన్‌ ప్రభుత్వానికి కేం ద్రం మద్దతు ఉందన్న అభిప్రాయం కలగడానికి దారితీసింది. అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్న స్థానిక నేతలపై సస్పెన్షన్‌ వేటు వేస్తుండటం బీజేపీ వైఖరికి అద్దం పడుతోంది.


ప్రభుత్వాన్ని వదిలి ప్రతిపక్షంపై..

ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని మరింత బలహీనపడితే... ఆ స్థానంలో తాము ఎదగాలన్నది బీజేపీ వ్యూహమని చెబుతున్నారు. సోము వీర్రాజు నియామకంతో ఇక ఆ కోణంలోనే భావి కార్యాచరణ ఉంటుందని కొందరు నేతలు చెబుతున్నారు. వీరంతా వైసీపీపై సానుకూలంగా ఉన్నవారే కావడం విశేషం. అయితే అధికార పక్షం తప్పిదాలపై పోరాడకుండా ఏ రాజకీయ పార్టీ ఎదగదని.. ఆ విషయంలో మెతగ్గా ఉన్నట్లు కనిపిస్తే ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకత అంతా టీడీపీ ఖాతాలో పడుతుందని ఇంకొందరు నేతలు వాదిస్తున్నారు. 


సంబంధం లేకుంటే.. క్షేత్ర స్థాయిలో రగులుతున్న అంశాలపై పార్టీ ఒక వైఖరిని ఎంచుకోకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని కొందరు బీజేపీ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ‘రాజధాని విషయం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్రానికి సంబంధం లేదని మేం చెబుతున్నాం. బాగానే ఉంది. విద్యుత్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. విద్యుత్‌ పీపీఏల రద్దును రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించగానే కేంద్రం వెంటనే రంగంలోకి దిగింది.  ఇక్కడ కూడా రైతులతో ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రాష్ట్రం ఎలా తిరగదోడుతుంది? కేంద్రం ఒక విషయంలో జోక్యం చేసుకుని.. మరో విషయంలో నాకు సంబంధం లేదంటే జనం అంగీకరిస్తారా?’ అని ఒక సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.


మూడు వర్గాలు.. మూడు ధోరణులు

సోము వీర్రాజు నియామకానికి ముందు నుంచి రాష్ట్ర బీజేపీ మూడు ప్రవాహాలుగా చీలిపోయి ఉంది. ఒక వర్గం ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహార శైలితో విభేదిస్తోంది. మరోవర్గం ఆయన పట్ల సానుకూలతతో ఉంది. కొద్ది మంది నేతలు అటూ ఇటూ కాకుండా మధ్యేవాదంతో ఉన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ప్రభావం రాష్ట్రంలో అంతకుముందు కొంత మేరకు ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో ఆయనకు సన్నిహితంగా ఉండేవారిని వెనక్కి నెట్టేశారని వినవస్తోంది. 

Updated Date - 2020-08-12T09:40:26+05:30 IST