ఉచిత బియ్యం లేనట్టే!

ABN , First Publish Date - 2022-05-18T06:51:10+05:30 IST

కరోనా నేపథ్యంలో పేదల కోసం కేంద్రం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం వరుసగా రెండో నెలలోనూ జిల్లా వాసులకు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రతినెలా 18 లేదా 20వ తేదీ నుంచి ఈ బియ్యాన్ని రేషన్‌ డిపోల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, జిల్లాకు ఇంతవరకు స్టాకు రాలేదు.

ఉచిత బియ్యం లేనట్టే!

వరుసగా రెండో నెలా పేదలకు రిక్తహస్తమే

ఇప్పటివరకు గోదాములకు చేరని సరకు 

సమాచారం లేదంటున్న జిల్లా అధికారులు 

గత నెలలోనూ బియ్యం అందక పేదల గగ్గోలు 

  

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పేదల కోసం కేంద్రం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం వరుసగా రెండో నెలలోనూ జిల్లా వాసులకు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రతినెలా 18 లేదా 20వ తేదీ నుంచి  ఈ బియ్యాన్ని రేషన్‌ డిపోల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, జిల్లాకు ఇంతవరకు స్టాకు రాలేదు. 

జిల్లాలో 4.99 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు ఈ ఏడాది మార్చి వరకూ ఉచిత బియ్యం పంపిణీ ఉంటుందని కేంద్రం తొలుత ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఈ ఏడాది మార్చి రెండో పక్షంలో కార్డుదారులకు బియ్యాన్ని అందజేశారు. ఆ తరువాత ఈ పథకం నిలిచిపోతుందని ఇక్కడి అధికారులు భావించినప్పటికీ...మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు కేంద్రం మార్చిలోనే ప్రకటించింది. అయితే అందుకు అనుగుణంగా ఇండెంట్లు పెట్టి నిల్వలు రప్పించాల్సిన యంత్రాంగం స్పందించకపోవడంతో ఏప్రిల్‌లో ప్రజలకు బియ్యం అందలేదు. మే నెలలో అయినా అందుతాయని భావించినా...ఇప్పటివరకు సరకు చేరకపోవడంతో ఈ నెలలోనూ పంపిణీ జరగనట్టేనని భావిస్తున్నారు.  

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద కార్డుదారులకు ప్రతినెలా ఉచితంగా దుడ్డు బియ్యం (నాన్‌సార్టెక్స్‌) పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం భారత ఆహార సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది. గత నెలలో రాష్ట్రానికి బియ్యం సకాలంలో అందలేదు. దీంతో రెండు నెలలకు సంబంధించి మేలో అందిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే మంగళవారం వరకు జిల్లాకు స్టాకు రాలేదు. సాధారణంగా కార్డుదారులకు సరఫరా చేసే బియ్యం పది రోజుల ముందుగా స్టాకు పాయింట్లకు చేరితే, అక్కడి నుంచి డీలర్లకు చేరవేసేందుకు సమయం ఉంటుంది. కానీ ఇప్పటివరకు గోదాములకే సరకు రాకపోవడంతో ఈ నెలలో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. దీనిపై జిల్లా పౌర సరఫరాలశాఖాధికారి జి.సూర్యప్రకాశ్‌ వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు జిల్లాకు ఉచిత బియ్యం స్టాకు రాలేదన్నారు. వచ్చిన వెంటనే కార్డుదారులకు సరఫరా చేస్తామన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి అందజేసే కిలో రూపాయి బియ్యం పంపిణీ మంగళవారంతో ముగిసింది. జిల్లాలో 4,99,986 కార్డులకుగాను 4,92,485 కార్డులకు (98.5 శాతం) ఈ బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. 




Updated Date - 2022-05-18T06:51:10+05:30 IST