కారాగారంలో కరోనా... తీహార్ లో తగ్గిన ‘విద్యార్థుల’ సంఖ్య

ABN , First Publish Date - 2021-09-11T22:37:09+05:30 IST

కరోనా ప్రభావం అందరి మీదా పడింది. జైళ్లలోని ఖైదీలపై కూడా తీవ్రంగానే భారం పడింది. అయితే, ఢిల్లీలోని తీహార్ జైల్లో విద్యార్థుల సంఖ్య సైతం మహమ్మారి వల్ల తీవ్రంగా పడిపోయింది. కారాగారంలో విద్యార్థులు ఎందుకు ఉంటారనేనా మీ అనుమానం?

కారాగారంలో కరోనా... తీహార్ లో తగ్గిన ‘విద్యార్థుల’ సంఖ్య

కరోనా ప్రభావం అందరి మీదా పడింది. జైళ్లలోని ఖైదీలపై కూడా తీవ్రంగానే భారం పడింది. అయితే, ఢిల్లీలోని తీహార్ జైల్లో విద్యార్థుల సంఖ్య సైతం మహమ్మారి వల్ల తీవ్రంగా పడిపోయింది. కారాగారంలో విద్యార్థులు ఎందుకు ఉంటారనేనా మీ అనుమానం? దూరవిద్య ద్వారా జైల్లోని ఖైదీలు తమకు తగిన కోర్సుని చదువుకునే అవకాశం ఇప్పటికే అమల్లో ఉంది. దాని ద్వారా ప్రతీ ఏటా వేలాది మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవుతుంటారు. కానీ, కరోనా కటకటాల వెనక సాగే చదువులకి కూడా కాలు అడ్డువేసింది.

జైళ్ల శాఖ గణాంకాల ప్రకారం 2018-19 మధ్య కాలంలో 1,365 మంది ఖైదీలు 18 రకాల డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో చేరినట్టు తెలుస్తోంది. 2019-20లో అయితే 1,682 మంది చదువులు కొనసాగించారు. కానీ, ఢిల్లీని కరోనా ఉక్కిరిబిక్కిరి చేయటం ప్రారంభించాక కేవలం 765 మంది మాత్రమే కొత్తగా ఎడ్యుకేషన్ కోర్సుల వైపు మొగ్గు చూపారు. 

మహమ్మారి విజృంభించాక తీహార్ జైలు నుంచీ 6,740 మంది ఖైదీల్ని మధ్యంతర బెయిలు ద్వారానో, అత్యవసర పెరోల్ ద్వారానో విడుదల చేశారు. కారాగారం నుంచీ కాలు బయటకు మోపటంతో వారిలో చాలా మంది ‘ఖైదీ విద్యార్థులు’ చదువులు కొనసాగించలేదు. అలాగే, జైల్లోనే ఉన్న వారు కూడా కోవిడ్ నిబంధనల కారణంగా లైబ్రెరి వంటి వాటికి దూరంగా ఉండాల్సి రావటంతో విద్యపైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారట. ఎన్జీవోల సభ్యుల్ని కూడా తీహార్ జైల్లోకి రానివ్వటం లేదు. వారి సాయంతో ఇంత కాలం చదువులు కొనసాగించిన ఖైదీలు కూడా మార్గదర్శనం లేక చదువుకోలేకపోతున్నారు.

2021లో కూడా ఇప్పటి వరకూ 4,337 మందిని కరోనా నేపథ్యంలో బెయిల్ పై విడుదల చేశారు. అయినప్పటికీ పోయిన సంవత్సరం 122 మంది తీహార్ జైలు ఖైదీలు, 293 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. వారిలో ఇద్దరు మరణించారు. ఈ సంవత్సరం 616 మంది మొత్తంగా ఇన్‌ఫెక్షన్‌కి గురికాగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మళ్లీ బాగుపడటానికి కొంత సమయం పడుతుందని జైలు అధికారులు అంటున్నారు. కరోనా వెనక్కి తగ్గితే తప్ప తీహార్‌లో చదువులు ముందుకు సాగేలా లేవు...                 

Updated Date - 2021-09-11T22:37:09+05:30 IST