మహనీయులను ఆదర్శంగా తీసుకోండి

ABN , First Publish Date - 2022-05-25T09:33:03+05:30 IST

దేశ భవిష్యత్‌ యువత చేతుల్లోనే ఉందని, వారు మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని..

మహనీయులను ఆదర్శంగా తీసుకోండి

యువతకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ పిలుపు

ఘనంగా వీఎ్‌సయూ స్నాతకోత్సవం


నెల్లూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్‌ యువత చేతుల్లోనే ఉందని, వారు మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎ్‌సయూ) ఆరు, ఏడు స్నాతకోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు గవర్నర్‌ పట్టాలు అందజేశారు. అనంతరం రెడ్‌క్రాస్‌ కేన్సర్‌ ఆసుపత్రిలో రేడియో థెరపీ బ్లాక్‌ను ప్రారంభించారు. బుద్ధిమాంద్య, తలసేమియా పిల్లలతో కొద్దిసేపు గవర్నర్‌ ముచ్చటించారు. కాగా తొలుత వీఎ్‌సయూలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఎంతో మంది మహనీయుల ప్రాణ త్యాగంతో నేడు స్వేచ్ఛ అనుభవిస్తున్నామని గుర్తుచేశారు.  దేశ, విదేశాల్లో ఎంతటి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినా మాతృభూమికి సేవచేయడాన్ని మాత్రం మరవకూదదన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌ నడిచిన మార్గాలు వేరైనా వారి లక్ష్యం మాత్రం స్వాతంత్య్రమేనని అన్నారు.  ఈ సందర్భంగా.. శ్రీసిటీ ఎండీ సన్నారెడ్డి రవీంద్రరెడ్డికి వీఎ్‌సయూ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ (హైదరాబాదు) చాన్సలర్‌ డీఎన్‌.రెడ్డి, వీఎ్‌సయూ వీసీ సుందరవల్లి తదితరులు పాల్గొన్నారు.


హాజరుకాని విద్యాశాఖ మంత్రి

వీఎ్‌సయూ స్నాతకోత్సవానికి ప్రభుత్వం తరపున మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారని వీఎ్‌సయూ అధికారులు ప్రకటించినా ఆయన రాలేదు. కనీసం ఉన్నత విద్యా విభాగం అధికారులు వస్తారని భావించినా వారు కూడా పాల్గొనలేదు. ఇక, గవర్నర్‌ జిల్లాకు విచ్చేస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి కాకాణి  కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-05-25T09:33:03+05:30 IST