Abn logo
Jun 6 2020 @ 23:20PM

ఇది నాకు బర్త్‌డే గిఫ్ట్‌!

వివాహానంతరం తన లైఫ్‌ మరింత బావుందంటున్నారు ప్రియమణి. సినిమాలతోపాటు ‘ఫ్యామిలీమ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ ఆమె సందడి చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన ప్రియమణి నటిగా 18 ఏళ్ల జర్నీ, ఇంటి ముచ్చట్లను ‘నవ్య’తో పంచుకున్నారు. 


నటిగా సినిమా పరిశ్రమలో 18 ఏళ్ల వయసు నాది. 2002లో నటిగా కెరీర్‌ మొదలుపెట్టా. హిట్లు, ఫ్లాపులు, ఎత్తుపల్లాలు అన్నీ చూశా. అవన్నీ ఈ జర్నీలో గేమ్‌ లాంటివి. హీరోయిన్‌ అయిన నాలుగేళ్లకే ‘పరుత్తి వీరన్‌’ సినిమాతో ఉత్తమనటిగా జాతీయ పురస్కారం అందుకున్నా. ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్లు చేయగలనని దర్శకులు నమ్ముతున్నారు. మెయిన్‌ లీడ్‌, మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రల అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 5 సినిమాలతో బిజీగా ఉన్నా. వెబ్‌ సిరీస్‌లూ చేస్తున్నా. మరో పక్క టీవీ షోలతో కూడా తీరిక లేకుండా గడుపుతున్నా. మరికొంతకాలం ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. నా సినిమా ప్రయాణంలో  ఓ సినిమా అంగీకరించేటప్పుడు ఏయే కోణాల్లో ఆలోచించాలి లాంటి విషయాలు నేర్చుకున్నా. అయితే  సినిమాల్లో ఇంత లాంగ్‌రన్‌ను  నేను ఊహించుకోలేదు. 


రెట్టింపు గుర్తింపు...

ప్రస్తుతం ‘నారప్ప’లో వెంకటేశ్‌ భార్య సుందరమ్మగా, ‘విరాటపర్వం’లో నక్సలైట్‌ భారతక్కగా నటిస్తున్నా. నా పుట్టినరోజు గిఫ్ట్‌గా ఆ  రెండు నిర్మాణ సంస్థలు ఫస్ట్‌ లుక్స్‌ విడుదల చేశాయి. సోషల్‌ మీడియాలో ఫస్ట్‌లుక్‌ రెస్పాన్ప్‌ చూసి చాలా ఆనందించా. నిజంగా ఈ గిఫ్ట్‌ నేను ఊహించలేదు. ఈ రెండు పాత్రల గురించి పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేను. రెండు పాత్రలు కచ్చితంగా రెట్టింపు గుర్తింపు తెస్తాయని  నమ్ముతున్నా. 


రియాలిటీ షోలు కష్టమే!

సినిమాలతో పోలిస్తే టీవీ రియాలిటీ షోలు చేయడం కాస్త కష్టమే. ఒక రోజులో కంటిన్యూగా 16 గంటలు షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది. మనుషుల్ని, వారి పెర్ఫార్మెన్స్‌ను జడ్జ్‌ చేయడం అంత ఈజీ కాదు. ఒత్తిడితో కూడిన పని అది. సినిమా అయితే ఐదారు నెలలు కాల్షీట్‌ ఇస్తే చాలు. టీవీ షోలకు అలా కాదు. షోలను బట్టి ఏడాది పాటు కాంట్రాక్ట్‌కు తగ్గట్టు చేయాలి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ చాలా అభివృద్ధి చెందుతోంది. ఈ మధ్యనే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ చేశా. సీజన్‌-1కు అమేజింగ్‌  రెస్సాన్స్‌  వచ్చింది. త్వరలో సీజన్‌-2 రాబోతుంది. హిందీ, తమిళ, కన్నడ భాషల నుంచి ఎక్కువగా సిరీస్‌ ఆఫర్స్‌ వస్తున్నాయి. నాకు ఏ పాత్ర పర్ఫెక్ట్‌ అనిపిస్తుందో అవే చేస్తా. అందుకే సెలక్షన్‌ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నా. 


మా ఆయన బంగారం

వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే నేను మరింత బిజీ అయ్యాను. నా భర్త ముస్తఫారాజ్‌ బంగారం. ఆయనే కాదు నా  అత్తమామలు కూడా మంచి సపోర్ట్‌ ఇస్తారు. ‘ఇప్పటి వరకూ చేసింది చాలు. ఇక ఫ్యామిలీ గురించి ఆలోచించు’ అని వారెప్పుడూ చెప్పలేదు. ఎలాంటి నిబంధనలు  నాకు పెట్టలేదు. నేను, ముస్తఫా ప్రతి విషయాన్నీ  చర్చించు కుంటాం. నా దగ్గరకు వచ్చిన ప్రాజెక్ట్స్‌ గురించి ఆయనతో చర్చించాకే చెయ్యాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటా. బాలీవుడ్‌కి సంబంధించి ఏ ఆఫర్‌ వచ్చినా ముస్తఫానే డీల్‌ చేస్తారు. ఆయన నాకు మేనేజర్‌లా పని చేస్తారు(నవ్వుతూ). నేను ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా అమ్మానాన్న, ముస్తఫాతో షేర్‌ చేసుకుంటా. ఈ ముగ్గురు నా జీవితానికి చాలా కీలకం. 


నేను చాలా స్ట్రాంగ్‌ 

బెంగళూరులో పుట్టి పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్‌గా, బోల్డ్‌గా ఉండేదాన్ని. భయపడటం ఎరుగను. ఏదైనా ధైర్యంగా మాట్లాడతా. డొంకతిరుగుడు మాటలు, చేతలు నా దగ్గర ఉండవు. నా మనస్తత్వానికి తగ్గట్టు మొదట్లో తమిళంలో బోల్డ్‌ పాత్రలే దక్కాయి. తెలుగు సినిమాల్లోకి వచ్చాక కాస్త సాఫ్ట్‌నెస్‌ అలవాటైంది. ధైర్యంగా ఉండటం, పక్కవారికి  ధైర్యాన్ని ఇవ్వడం నాకు చాలా ఇష్టం. సవాళ్లు అంటే సరదా...


ఏ వృత్తిలో అయినా పోటీ ఉంటేనే మరో మెట్టు ఎక్కగలం. పోటీ పడడం, సవాళ్లు ఎదుర్కొవడం అంటే నాకు భలే సరదా. పోటీకి భయపడితే ఎక్కడివాళ్లం అక్కడే ఉంటాం. గెలిచి ముందుకెళ్తేనే ఓ స్థానం ఉంటుంది. ‘పరుత్తి వీరన్‌’, ‘పెళ్లైన కొత్తలో’, ‘చారులత’, ‘యమదొంగ’, ఇప్పుడు చేస్తున్న ‘నారప్ప’, ‘విరాట పర్వం’....  నాకు సవాల్‌ విసిరిన సినిమాలు. 


చిన్న విషయాలతోనే ఆనందం..

కరోనా లాంటి విపత్తుని ఎవరూ ఊహించరు. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. ఆరోగ్యం బావుంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. ఏదైనా చేయవచ్చు. ఏదో చేసేయాలి, సాధించాలని కాలంతో పరుగులు తీస్తూ తెలియకుండా చాలా కోల్పోతున్నాం. కుటుంబ సభ్యులు, ఇష్టమైన వారికోసం కనీస సమయాన్ని కేటాయించలేపోతున్నాం. అసలు మన గురించి మనం ఆలోచించుకునే సమయం కూడా దొరకని పరిస్థితి. లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితం కావడం వల్ల చాలామంది ఈ విషయాలను గ్రహించారు. ఇప్పుడు తీరిక దొరికి కుటుంబ సభ్యులతో గడపడం వల్ల ఒకరికొకరు దగ్గరై, బంధాల విలువ తెలుసుకున్నారు. ముఖ్యంగా మాలాంటి వారు షూటింగ్‌లంటూ ఇంటి పట్టున అస్సలు ఉండం. ఇప్పుడు మంచి టైమ్‌ దొరికింది. ఇది దేవుడిచ్చిన వరం.


ఈసారి నా పుట్టినరోజు కుటుంబ సభ్యులు మధ్య ఆర్భాటంగా కాకపోయినా ఆనందంగా జరిగింది. నేనైతే భౌతిక దూరం పాటిస్తూ మార్కెట్‌కి వెళ్లి నిత్యవసర వస్తువులు కొని తెచ్చేదాన్ని. ఇల్లు తుడవడం, వంట సామగ్రి శుభ్రం చేయడం లాంటి పనులు చేశా. వంటకు, నాకు చాలా దూరం. మా అత్తగారే ప్రతిరోజూ వంట చేస్తారు. ముస్తఫాతో కలిసి ఓటీటీలో సిరీస్‌లు, సినిమాలను బాగా ఎంజాయ్‌ చేశా. లాక్‌డౌన్‌ టైమ్‌ అంతా నేను ముంబయ్‌లో ఉన్నా. ప్రతిరోజూ వందల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి నియమాలు పాటించడమే దీనికి మందు. ఇదే సమయంలో ఉపాధి కోల్పోయినవారు, వలస కార్మికుల దుస్థితి చూసి కన్నీరు ఆగలేదు. మనకు ఎంత సంపాదన ఉన్నా అందులో ఆనందం లేదనీ సింప్లిసిటీ చాలా బెస్ట్‌ అని తెలుసుకున్నా. చిన్నచిన్న విషయాలతోనే చాలా సంతోషం ఉందని గ్రహించా. లాక్‌డౌన్‌ మనుషులకు మంచి గుణపాఠం చెప్పింది. 


పెళ్లి తర్వాత హీరోయిన్లు ఇంటికే పరిమితం కావాలనే రూలేమీ లేదు. కెరీర్‌ కొనసాగించాలా వద్దా! అన్నది ఆయా నాయికలు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. పెళ్లయినా కెరీర్‌ కొనసాగించడానికి ఈతరం నాయికలు సిద్ధంగా ఉన్నారు.


విద్యాబాలన్‌ నా కజిన్‌. నేను తనతో టచ్‌లో లేను. ఆమె తండ్రి బాలన్‌ అంకుల్‌తో ఎక్కువగా మాట్లాడుతుంటా. అలాగే మా ఆంటీ మాల్గాడి శుభతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటా. 

ఆలపాటి మధు

Advertisement
Advertisement
Advertisement