కామన్వెల్త్‌లో తెలుగు తేజాలు

ABN , First Publish Date - 2022-07-27T09:54:19+05:30 IST

ఇరవై క్రీడాంశాలు.. 72 దేశాలు.. ఐదు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలు మరో 24 గంటల్లో మొదలవనున్నాయి.

కామన్వెల్త్‌లో  తెలుగు తేజాలు

ఇరవై క్రీడాంశాలు.. 72 దేశాలు.. ఐదు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలు మరో 24 గంటల్లో మొదలవనున్నాయి. ఈ మెగా క్రీడా సంబరంలో భారత్‌ నుంచి 205 మంది పాల్గొంటుండగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది బరిలోకి దిగుతున్నారు. వీరిలో పీవీ సింధు, శ్రీకాంత్‌, నిఖత్‌ జరీన్‌, హుస్సాముద్దీన్‌ వంటి స్టార్‌ ప్లేయర్లతో పాటు శ్రీజ, గాయత్రి గోపీచంద్‌ వంటి యువ కుసుమాలు సత్తా చాటేందుకు సై అంటున్నారు. పతకాలే లక్ష్యంగా ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన తెలుగు తేజాలపై ఓ లుక్కేద్దాం..


స్వర్ణమే లక్ష్యంగా సింధు..

భారత బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధు ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్‌తో పాటు టీమ్‌ ఈవెంట్‌లో పోటీ పడనుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో సైనా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్న సింధు ఈ దఫా పసిడిపై గురి పెట్టింది. ఇటీవల సింగపూర్‌ టైటిల్‌ నెగ్గి లయ దొరకబుచ్చుకుంది. ఈ ఏడాది 3 అంతర్జాతీయ టైటిళ్లను సొంతం చేసుకున్న సింధు బర్మింగ్‌హామ్‌లో ఏదో ఒక పతకం గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.


శ్రీకాంత్‌ పసిడి తెచ్చేనా?

గాయాలు, పేలవ ఫామ్‌ దశ నుంచి విజయాల ట్రాక్‌లోకి వచ్చిన మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో పోటీ పడుతున్నాడు. 2018  క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీకాంత్‌ ఈసారి స్వర్ణం తీసుకొస్తాడనే అంచనాలున్నాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ద్వయం పసిడి పతకానికి గట్టి పోటీదారుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్‌ నెంబర్‌-7గా ఉన్న ఈ జోడీకి 2018లో స్వర్ణం చిక్కినట్టే చిక్కి చేజారింది. 


 డార్క్‌ హార్స్‌.. గాయత్రి జోడీ

జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌  కుమార్తె గాయత్రి తన సహచరి ట్రీసా జాలీతో కలిసి మహిళల డబుల్స్‌లో డార్క్‌ హార్స్‌గా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది సయ్యద్‌ మోదీ టోర్నీలో గాయత్రి-ట్రీసా జోడీ విజేతగా నిలవడంతో పాటు ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో తొలిసారి సెమీఫైనల్‌ చేరిన భారత జోడీగా సంచలనం సృష్టించింది. 


సుమిత్‌ మురిపిస్తాడా..!

తెలుగు షట్లర్‌ సుమిత్‌ రెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప జతగా బరిలోకి దిగుతున్నాడు. వెన్నునొప్పితో చాలాకాలంగా బ్యాడ్మింటన్‌కు దూరంగా ఉన్న సుమిత్‌ ఈ ఏడాది అనూహ్యంగా పుంజుకుని కామన్వెల్త్‌ బెర్త్‌ పట్టేశాడు. టోర్నీలో అశ్విని, సుమిత్‌ స్థాయికి తగ్గట్టు రాణిస్తే సంచలనాలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.


జ్యోతి సత్తా చాటేనా..?

మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ జాతీయ రికార్డును బద్దలుకొట్టడమే కాకుండా మూడుసార్లు ఆ టైమింగ్‌ను సవరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన విశాఖపట్నం అథ్లెట్‌ యర్రాజీ జ్యోతి.. కామన్వెల్త్‌లో తన దమ్ము చూపేందుకు సై అంటోంది. యూర్‌పలో జరిగిన రెండు ఇంటర్నేషనల్‌ పోటీల్లో రజతాలు కొల్లగొట్టిన జ్యోతి ప్రస్తుతం 13.04 సెకన్ల తన బెస్ట్‌ టైమింగ్‌ను అధిగమిస్తే పతక రేసులో ముందుండే అవకాశాలున్నాయి.


టీటీలో శ్రీజ వేట

ఆకుల శ్రీజ కెరీర్‌లో తొలిసారి కామన్వెల్త్‌ క్రీడల బరిలోకి దిగుతోంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌, డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్‌లో పోటీ పడనుంది. జాతీయ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో ఒలింపియన్‌ మౌమా దాస్‌ను ఓడించి  శ్రీజ విజేతగా నిలిచింది. డబుల్స్‌లోనూ అహికా ముఖర్జీతో కలిసి టైటిల్‌ను ముద్దాడింది. ఇలా అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్‌  ట్రయల్స్‌లో సీనియర్లను వెనక్కి నెట్టి బెర్త్‌ దక్కించుకున్న ఈ హైదరాబాదీపై పతక అంచనాలు భారీగానే ఉన్నాయి. 


హుస్సామ్‌.. వన్స్‌మోర్‌!

గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు కాంస్యం అందించిన హుస్సాముద్దీన్‌ (57 కి.) కొద్దికాలంగా స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చడంలో విఫలమవుతున్నాడు. హుస్సామ్‌ కనుక పూర్తి స్థాయిలో పంచ్‌ పవర్‌ను చూపిస్తే బర్మింగ్‌హామ్‌లో పతకం గ్యారెంటీ.


 క్రికెట్‌లో మేఘన, హాకీలో రజని

కామన్వెల్త్‌ క్రీడల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మరోసారి క్రికెట్‌కు అవకాశమిచ్చారు. పది జట్లతో కూడిన మహిళల టీ20 టోర్నీలో భారత్‌ ప్రధాన పోటీదారుగా దిగుతోంది. హర్మన్‌కౌర్‌ నేతృత్వంలోని టీమిండియాలో తెలుగు క్రికెటర్‌ సబ్బినేని మేఘనకు చోటు దక్కింది. హాకీ జట్టులో ఆంధ్ర గోల్‌కీపర్‌ ఎతిమరపు రజని రిజర్వ్‌ కీపర్‌గా చోటు దక్కించుకుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన అనుభవం రజని సొంతం. 


హాట్‌ ఫేవరెట్‌.. నిఖత్‌

మేరీకోమ్‌ గాయంతో ట్రయల్స్‌ నుంచి వైదొలగడంతో కెరీర్‌లో తొలిసారి కామన్వెల్త్‌ బరిలోకి దిగుతున్న ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌పైనే అందరి ఫోకస్‌ నెలకొంది. 50 కిలోల విభాగంలో తలపడుతున్న నిఖత్‌కు ఆతిథ్య ఇంగ్లండ్‌ బాక్సర్ల నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. అందుకే రెండు వారాలు ముందుగానే నిఖత్‌ ఐర్లాండ్‌ చేరి ప్రత్యేక శిక్షణ తీసుకొని అక్కడి పరిస్థితులకు అలవాటు పడింది. ఈ ఏడాది నిఖత్‌ ఫామ్‌ను చూస్తుంటే తన ఖాతాలో మరో పసిడి చేరడం పక్కా అనుకోవచ్చు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2022-07-27T09:54:19+05:30 IST