Abn logo
Sep 21 2021 @ 02:13AM

పిల్లల పక్షవాతం చికిత్సకు ‘బర్డ్‌’ పెద్దదిక్కు కావాలి: ఈవో

అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

తిరుపతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పుట్టుకకు ముందే మెదుడులో లోపం వల్ల ఎక్కువగా పిల్లల్లో వచ్చే పక్షవాతం (సెలిబ్రల్‌ పాలసి) చికిత్సలో బర్డ్‌ను దేశంలోనే అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన బర్డ్‌ ఆస్పత్రిపై సమీక్ష నిర్వహించారు. సెలిబ్రల్‌ పాలసీ నిర్ధారణ, చికిత్స ఏర్పాట్లకు బర్డ్‌లో ఎంత స్థలం కావాలి, సిబ్బంది ఎంత మంది అవసరం, పరికరాలు ఏవి కావాలి వంటి వాటి పై అవగాహనకు రావాలన్నారు. ఆస్పత్రి నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవటం తదితరాల పరిశీలన కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ను సందర్శించాలని అధికారులకు సూచించారు. బర్డ్‌లో అవసరమైన మేరకు పారామెడికల్‌ సిబ్బంది, డాక్టర్ల నియామకం చేసుకోవాలన్నారు. సీటీ స్కాన్‌ను వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలన్నారు. బర్డ్‌కు అవసరమైన మందులను బర్డ్‌ ఆస్పత్రి నుంచే కొనుగోలు చేయాలన్నారు. బర్డ్‌లో వార్డులను ఆధునికీకరించాలని సీఈని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎఫ్‌ఏఅండ్‌ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, ఆర్‌ఎంవో శేషశైలేంద్ర, ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.