బిరబిరా కృష్ణమ్మ.. ఉగ్రంగా గోదారమ్మ

ABN , First Publish Date - 2022-08-12T09:12:55+05:30 IST

బిరబిరా కృష్ణమ్మ.. ఉగ్రంగా గోదారమ్మ

బిరబిరా కృష్ణమ్మ.. ఉగ్రంగా గోదారమ్మ

గోదారి ఉగ్రరూపం

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్కుల విడుదల

ప్రవాహం మరింత పెరిగే అవకాశం

 మునిగిన లంకలు.. గ్రామాల్లోకీ నీరు

పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు బంద్‌

కృష్ణానదిలోనూ భారీగా వరద

నాగార్జునసాగర్‌ 26 గేట్లు ఎత్తివేత

నిండుకుండల్లా శ్రీశైలం, నాగార్జునసాగర్‌

శ్రీశైలం నుంచి 4.38 లక్షల క్యూసెక్కులు విడుదల

ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత



(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులలో భారీగా వరదలు తన్నుకొస్తున్నాయి. గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 14.60 అడుగులకు చేరడంతో గురువారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి 14,05,991 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలంలో నీటిమట్టం 52.4 అడుగులకు చేరింది. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం భారీగా పెరగడంతో ఏజెన్సీ గ్రామాలు మునిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో ఇప్పటికే పలు లంకలు మునిగిపోయాయి. సీతానగరం మండలం ములకల్లంకకు నీటి తాకిడి మొదలైంది. మరింత పెరిగి గత నెలలో వరద ముంచెత్తిన పరిస్థితి మళ్లీ ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాటిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అనేకచోట్ల కాజ్‌వేలు పూర్తిగా మునిగిపోయాయి. ఏలూరు జిల్లా వింజరం వద్ద కుక్కునూరు-భద్రాచలం ప్రధాన రహదారి నీటమునిగింది. దీంతో భద్రాచలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి పోటు కారణంగా గతంలో కన్నా గోదావరి వరద ప్రభావం ఈసారి ఎక్కువగా ఉంది. పోలవరం మండలంలో పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు సాగించే రహదారిలో కడమ్మ వంతెన నీటమునిగింది. పోలవరం ప్రాజెక్టు చెక్‌పోస్టులో మూడడుగుల ఎత్తున వరద  ప్రవహి స్తోంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి నీటిమట్టం 34.040 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 25.540 మీటర్లు, పోలవరం వద్ద 24.507 మీటర్లు నమోదైంది.  


కృష్ణమ్మ పరవళ్లు..

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైల జలాశయం నిండుకుండలా మారింది. జూరాల నుంచి 2,72,034, సుంకేశుల నుంచి 1,74,493 మొత్తం 4,46,527 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో డ్యాం పది క్రస్టు గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల ద్వారా మరో 61,577 క్యూసెక్కులు మొత్తం 4,38,247 క్యూసెక్కుల నీటిని  నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దిండి, ఇతర చిన్న వాగుల ద్వారా కూడా నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వరద వస్తోంది. నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో 26 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను ఎత్తి 3,80,016 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2009 సంవత్సరం తరువాత 26 క్రస్ట్‌గేట్లను మొదటిరోజే ఒకేసారి ఎత్తడం ఇదే మొదటిసారి. ఇక పులిచింతల గరిష్ఠ నీటి నిల్వ 45.77 టీఎంసీలకుగాను ప్రస్తుతం 33.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 4.10 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 4,40,474 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీకి 1,33,925 క్యూసెక్కుల నీరువస్తోంది. ఇది 4.50 లక్షల క్యూసెక్కులకు పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లలో 60 గేట్లను రెండు అడుగులు, మిగిలిన పది గేట్లను మూడు అడుగులు ఎత్తి 1,06,370 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.


ఎగువ  నుంచి భారీ వరద 

గత రెండు రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్రల నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోకి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విపత్తు నిర్వహణ చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది.


వరద ప్రాంతాలకు 6 సహాయ బృందాలు

గోదావరి పరివాహక ప్రాంతాలకు ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌  తెలిపారు. వరద సహాయక చర్యల కోసం పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు, కూనవరం, వీఆర్‌పురం, జంగారెడ్డిగూడెంలలో ఈ బృందాలను ఉంచినట్లు తెలిపారు.

Updated Date - 2022-08-12T09:12:55+05:30 IST