బిపిన్‌ రావత్‌.. యుద్ధ వీరుడు!

ABN , First Publish Date - 2021-12-09T07:34:51+05:30 IST

బిపిన్‌ లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ఫోర్‌ స్టార్‌ జనరల్‌గా సైనిక దళాలకు ఆయనొక ఉత్తేజం. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన..

బిపిన్‌ రావత్‌.. యుద్ధ వీరుడు!

  • సైన్యాధిపతి నుంచి రక్షణ దళాల చీఫ్‌ వరకు!
  • సర్జికల్‌, బాలాకోట్‌ దాడుల వ్యూహకర్త..
  • సాధారణ సైనికుడిగా.. రావత్‌ ప్రస్థానం ఆరంభం


బిపిన్‌ లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ఫోర్‌ స్టార్‌ జనరల్‌గా సైనిక దళాలకు ఆయనొక ఉత్తేజం. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. మిలిటరీ వ్యూహాల నుంచి ఆపరేషన్ల అమలు వరకు అందెవేసిన చేయి. అపజయం ఎరుగని సైన్యాధికారిగా పేరుగడించారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీలో క్షత్రియ (రాజ్‌పుత్‌) కుటుంబంలో 1958 మార్చి 26న జన్మించారు. మూడు తరాలుగా ఆయనది సైనిక కుటుంబం. ఆయన తండ్రి లక్ష్మణ్‌సింగ్‌ రావత్‌ కూడా అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్‌ జనరల్‌.. ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు.  1971 పాకిస్థాన్‌ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఆయన చిన్నాన్నలు కూడా సైన్యంలో పనిచేసి రిటైరయ్యారు. రావత్‌ తాత 1947-48 యుద్ధంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రావత్‌ తల్లి ఉత్తర కాశీకి చెందినవారు. ఆమె తండ్రి ఉత్తరకాశీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిషన్‌సింగ్‌ పర్మార్‌ కుమార్తె. రావత్‌ భార్య మధూలిక రాజేసింగ్‌. వారికి ఇద్దరు కుమార్తెలు (కృత్తిక, తరుణి) ఉన్నారు.


చదువు.. యుద్ధం..

డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్‌ హాల్‌ స్కూలు, సిమ్లా సెయింట్‌ ఎడ్వర్డ్స్‌ స్కూలులో రావత్‌ విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఖడక్‌వాస్లా (పుణే)లోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చదివారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో చేరారు. ఆ సందర్భంగా ‘గౌరవ ఖడ్గం (స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌)’ పొందారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో డిఫెన్స్‌ స్టాఫ్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. బుధవారం ఇదే కాలేజీలో లెక్చర్‌ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడే ఆయన పర్యటిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో డిఫెన్స్‌ స్టడీస్‌పై ఎం.ఫిల్‌ డిగ్రీ తీసుకున్నారు. మిలిటరీ-మీడియా స్ట్రాటజిక్‌స్టడీస్‌లో పరిశోధనకు గాను 2011లో మీరట్‌లోని చౌధురి చరణ్‌సింగ్‌ విశ్వవిద్యాలయం ఆయనకు పీహెచ్‌డీ ప్రదానం చేసింది. 1978 డిసెంబరు 16న రావత్‌ గూర్ఖా రైఫిల్స్‌ (11) ఐదో బెటాలియన్‌లో సైనికుడిగా చేరారు. మంచుకొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరాల నుంచి జరిగే యుద్ధాల్లో ఎంతో అనుభవం గడించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పదేళ్లు పనిచేశారు. 


డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆప్‌ కాంగోలో వివిధ దేశాల సైనికులతో కూడిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం లీడర్‌గా పనిచేశారు. మేజర్‌ జనరల్‌గా పదోన్నతి పొందాక.. ఆయన 19వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ (ఉరి) జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరి 1న సదరన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ పదవి చేపట్టారు. తర్వాత ఏడునెలలకే సెప్టెంబరు 1న ఆర్మీ వైస్‌చీ్‌ఫగా నియమితులయ్యారు. అదే ఏడాది డిసెంబరు 17న భారత ప్రభుత్వం రావత్‌ కంటే సీనియర్లయిన లెఫ్టినెంట్‌ జనరళ్లు ప్రవీణ్‌ బక్షీ, పీఎం హారిజ్‌లను కాదని.. ఆయన్ను 27వ ఆర్మీ చీఫ్‌ (సైన్యాధిపతి)గా నియమించింది. సైనిక దళాల ప్రధాన అధిపతిగా ఆయన ఆ ఏడాది డిసెంబరు 31న నాటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌సింగ్‌ సుహాగ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గూర్ఖా బ్రిగేడ్‌ నుంచి ఈ అత్యన్నత పదవి చేపట్టిన మూడో వ్యక్తి రావత్‌. ఆయనకు ముందు జనరల్‌ సుహాగ్‌, శామ్‌ మానెక్‌ షా మాత్రమే ఆర్మీ చీఫ్‌ అయ్యారు. 2019 డిసెంబరు 31న కేంద్రం ఆయన్ను మొట్టమొదటి మహాదళాధిపతిగా (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎ్‌స)గా నియమించింది. కెరీర్‌లో ఆయన ఎక్కువగా చైనా సరిహద్దుల్లో, జమ్మూకశ్మీర్లోనే పనిచేశారు.


ఐరాస మిషన్‌లో సఫలం..

కాంగోలో ఐరాస శాంతి పరిరక్షక దళంలో రావత్‌ కీలక పాత్ర పోషించారు. ప్రాంతీయ రాజధాని ఉత్తర కివులో మోహరించిన రెండు వారాల్లోనే తన యుద్ధ నైపుణ్యాన్ని చాటారు. రెబెల్స్‌కు మద్దతివ్వకుండా స్థానికుల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన నాలుగు నెలల అవిశ్రాంత పోరాటం ఫలించింది. కాంగో సుస్థిరత సాధించింది. తిరుగుబాటుదారులు ఆయుధాలు వదిలేశారు. వారిని సైన్యంలో చేరేందుకు అంగీకరింపజేయడంలో రావత్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యానికి మెచ్చి.. ఐరాస సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక ప్రతినిధులు, ఐరాస మిషన్ల ఫోర్స్‌ కమాండర్లకు సంబంధించిన శాంతిపరిరక్షక దళం తీరుతెన్నులపై చార్టర్‌ను సవరించే బాధ్యతలను 2009 మే 16న లండన్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఐరాస అప్పగించింది. అలాగే.. ఈశాన్య భారతంలో ఉగ్రవాదం నియంత్రణలో రావత్‌ది కీలక పాత్ర. మణిపూర్‌లో 2015 జూన్‌లో ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడిచేశారు. ఈ సందర్భంగా 18 మంది జవాన్లు అమరులయ్యారు. అప్పుడు రావత్‌ సారథ్యంలో పారాచూట్‌ రెజిమెంట్‌ 21వ బెటాలియన్‌ మియన్మార్‌ సరిహద్దుల్లోని ఎన్‌ఎస్‌సీఎన్‌-కే స్థావరంపై మెరుపుదాడులు చేసి నేలమట్టం చేసింది. ఇరవై మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

- సెంట్రల్‌ డెస్క్‌


సర్జికల్‌ దాడుల వ్యూహకర్త..

2016లో నియంత్రణ రేఖను దాటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోకి భారత సైన్యం చొరబడి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయాలన్న వ్యూహాన్ని రూపొందించినవారిలో రావత్‌ కూడా ఉన్నారు. సదరు ఆపరేషన్‌ను ఆయనే పర్యవేక్షించారు. అలాగే 2019 ఫిబ్రవరిలో భారత యుద్ధవిమానాలు పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహమ్మద్‌ శిక్షణ శిబిరాన్ని కూల్చివేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర. ఢిల్లీలోని రక్షణ కార్యాలయంలో ఉండి ఈ దాడిని పర్యవేక్షించారు. ఈ దాడి తర్వాత ఆయన పేరు దేశమంతా మార్మోగింది.


ఎన్నెన్నో పురస్కారాలు..

39 ఏళ్ల సైనిక కెరీర్‌లో రావత్‌ ఎన్నో సాహస, ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పథకం (పీవీఎ్‌సఎం), ఉత్తమ విశిష్ట సేవా పథకం (యూవీఎ్‌సఎం), అతి విశిష్ట సేవా పథకం (ఏవీఎ్‌సఎం), యుద్ధ సేవా పతకం, సేనా పతకం, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ప్రశంసాపత్రాలు రెండు సార్లు, ఆర్మీ కమాండర్‌ ప్రశంసాపత్రం లభించాయి.


గతంలోనూ ఓ సారి..

బుధవారం హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనరల్‌ రావత్‌.. గతంలో ఓసారి ఇలాంటి ప్రమాదం నుంచే తప్పించుకున్నారు. ఆరేళ్ల కింద 2015 ఫిబ్రవరి 3న ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్‌ దిమాపూర్‌లో కూలిపోయింది. అప్పట్లో లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్న రావత్‌ ప్రాణాలతో బయటపడ్డారు.


దేశం వీరుడిని కోల్పోయింది

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి, ఇతర సిబ్బంది మరణ వార్త  దిగ్ర్భాంతికి గురిచేసింది. దేశం అత్యంత ధైర్యవంతులైన వీరుల్లో ఒకరిని కోల్పోయింది. నాలుగు దశాబ్దాల పాటు దేశానికి ఆయన అసాధారణ సేవలందించారు. 

- రాష్ట్రపతి కోవింద్‌


తీవ్రంగా కలచివేసింది..

 రావత్‌, ఆయన సతీమణి, ఇతర సిబ్బంది హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేసింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వారందరి కుటుంబాలకూ నా ప్రగాఢ సానుభూతి. 

- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 


అద్భుతమైన సైనికుడు, నిజమైన దేశభక్తుడు

బిపిన్‌ రావత్‌ అద్భుతమైన సైనికుడు, నిజమైన దేశభక్తుడు. దేశ సాయుధ బలగాలు, భద్రతా యంత్రాంగాన్ని ఆధునికీకరించడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన అసాధారణ సేవలను దేశం ఎప్పటికీ మరవదు.  ప్రమాదంలో మరణించిన వారందరి కుటుంబాలకూ నా ప్రగాఢ సానుభూతి.   

- ప్రధాని మోదీ


దేశానికి రావత్‌ మరణం తీరని లోటు

రావత్‌ అకాల మరణం దేశానికి, సాయుధ బలగాలకు తీరని లోటు.  అసాధారణ ధైర్యంతో దేశానికి రావత్‌ సేవలందించారు. ప్రమాదంలో మరణించిన వారందరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. 

- రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి

Updated Date - 2021-12-09T07:34:51+05:30 IST