భాగ్యనగరంలో Bipin Rawat స్మృతులు.. చెరగని ముద్ర

ABN , First Publish Date - 2021-12-10T17:28:32+05:30 IST

వీరుడా.. వందనం అంటూ త్రివిధ దళాల సారథి బిపిన్‌ రావత్‌కు నగరం నివాళి అర్పించింది....

భాగ్యనగరంలో Bipin Rawat స్మృతులు.. చెరగని ముద్ర

  • తుపాకులు, అణ్వాయుధాల పనితీరుపై..
  • నగరదళాలకు బిపిన్‌ అవగాహన
  • భాగ్యనగర ఆర్మీ విభాగాలపై చెరగని ముద్ర
  • స్మరించుకుంటున్న నగరం

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : వీరుడా.. వందనం  అంటూ త్రివిధ దళాల సారథి బిపిన్‌ రావత్‌కు నగరం నివాళి అర్పించింది. నగర ఆర్మీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అధికారులు, సిబ్బందిలో చైతన్యం నింపిన బిపిన్‌ బాస్‌.. క్లాసులను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది. నాలుగు దశాబ్దాలపాటు ఆయన దేశానికి చేసిన సేవలను మాజీ సైనికులు, ప్రజాప్రతినిధులు, పౌరులు స్మరించుకున్నారు. రావత్‌ మృతికి సంతాపంగా గురువారం నగరవ్యాప్తంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు.


చివరిసారిగా...

- 2018 డిసెంబర్‌ 14న సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈ స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిపిన్‌ రావత్‌ ప్రసంగం ఇంజినీర్లతోపాటు మిలటరీ అధికారులను, కెడెట్లను ఆకట్టుకుంది. ‘తుపాకులు పట్టుకుని, శత్రువులను తుదముట్టించేందుకు చూపే తెగువతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. భవిష్యత్‌లో మానవ రహిత యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సాంకేతికతకు పెద్దపీట వేయాలి’ అని ఆయన అప్పట్లో పిలుపునిచ్చారు. ఎంసీఈఎంఈ, కాలేజీ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, తదితర సంస్థలను సందర్శించిన బిపిన్‌ రావత్‌ అక్కడి ఆర్మీ అధికారులు, ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించడాన్ని వారు పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. 


- సికింద్రాబాద్‌: పరేడ్‌గ్రౌండ్‌లోని అమర వీరుల స్మారక స్తూపం వద్ద త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌, ఇతర ఉన్నతాధికారులకు గురువారం రాత్రి వివిధ రంగాల నిష్ణాతులు నివాళులర్పించారు. దర్శనమ్‌ మాస పత్రిక సంపాదకులు ఎం.వెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో సైనిక ఉన్నతాధికారులు మేజర్‌ శివకిరణ్‌, మేజర్‌ పి.టి.చౌదరిలు అమరులైన అధికారులకు శ్రద్ధాంజలి ఘటించారు.


నగరంలో రావత్‌ స్మృతులు

- 2016 జనవరి 15న సదరన్‌ కమాండ్‌ జనరల్‌ (పుణె) ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ హోదాలో ఆర్మీ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

- 2017 సెప్టెంబర్‌ 17న దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరిగిన 199వ కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు విచ్చేశారు.

- 2017 డిసెంబర్‌ 17న కాలేజీ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ (సీడీఎం)ను సందర్శించారు.

Updated Date - 2021-12-10T17:28:32+05:30 IST