చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిరుచ్చి భారతిదాసన్ విశ్వవిద్యాలయంలో హెలికాప్టర్ ప్రమాదం లో అసువులు బాసిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌రావత్ సహా 13 మంది సైనికులకు నివాళులర్పించారు. ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బిపిన్‌రావత్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిపిన్‌రావత్ దేశభద్రత విషయమై దీర్ఘకాలిక ప్రయోజనంతో కూడిన నిర్ణయాలను తీసుకునేవారని కొనియాడారు. ప్రధాని కార్యాలయంలో బిపిన్‌రావత్‌తోపాటు తాను కూడా కలిసి పనిచేశానని ఆయన చెప్పారు. రావత్ మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, జిల్లా కలెక్టర్ శివరాసు తదితరులు పాల్గొన్నారు.