టీచర్లకు మళ్లీ బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2022-08-19T07:40:20+05:30 IST

ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

టీచర్లకు మళ్లీ బయోమెట్రిక్‌

కొవిడ్‌తో రెండేళ్లుగా అమలుకాని విధానం

ఈ నెల 25లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి

సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి

డీఈవోలకు ఉన్నతాధికారుల ఆదేశాలు

ప్రస్తుతానికి 14 జిల్లాల్లోనే అమలు

మిగతా జిల్లాల్లోనూ అమలుకు ప్రతిపాదనలు

ఉపాధ్యాయులకు మళ్లీ బయోమెట్రిక్‌  


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని జిల్లాల విద్యాధికారులకు (డీఈవోలకు) ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 25వ తేదీ నాటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని పేర్కొన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో గతంలోనే 14 జిల్లాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే... కొవిడ్‌ కారణంగా రెండేళ్ల నుంచి ఈ విధానాన్ని అమలుచేయడం లేదు. అయితే ఈ ఏడాది మళ్లీ ప్రత్యక్ష తరగతులను ప్రారంభించిన నేపథ్యంలో... బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని కూడా పునరుద్ధరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూలై 30న ప్రత్యేక సమావేశం  నిర్వహించి దీనిపై చర్చించారు. అనంతరం ఆయా జిల్లాల డీఈవోలకు సర్క్యులర్‌ను జారీచేశారు. దీన్ని అనుసరించి... బయోమెట్రిక్‌ యంత్రాలు ఉన్న పాఠశాలల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల్లోని యంత్రాలను పరిశీలించి, అవసరమైతే రిపేర్లు చేయడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ఉపాధ్యాయుల ఐరిస్‌, వేలిముద్రలను నమోదు చేయనున్నారు. అంతేగాక బయోమెట్రిక్‌ యంత్రాలు లేని జిల్లాల్లో కూడా వాటిని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదించి, నిధులు మంజూరుచేస్తే మిగిలిన జిల్లాల్లో కూడా బయోమెట్రిక్‌ హాజరు విధానం అమల్లోకి రానుంది.


 ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం... ఆయా స్కూళ్లలో ఉపాధ్యాయుల హాజరు కోసం మాన్యువల్‌ రిజిస్టర్‌లను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు రిజిస్టర్‌లో సంతకం చేస్తే... హాజరయినట్టుగా పరిగణిస్తారు. సంబంధిత స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ పర్యవే క్షణలో ఈ రిజిస్టర్‌ ఉంటుంది. అయుతే... అనేక స్కూళ్లలో కొందరు ఉపాధ్యాయులు విధులకు వెళ్లకుండానే... రిజిస్టర్‌లో ఒకేసారి రెండు మూడు రోజులకు సంబంధించిన సంతకాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేగాక ఆయా స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పరస్పర అవగాహనతో... కొన్నిసార్లు గైర్హాజరు అయినప్పటికీ రిజిస్టర్‌లో మాత్రం హాజరయినట్లుగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో స్కూల్‌కు వచ్చినా మధ్యలోనే వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చటానికి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఉపాధ్యాయులు రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్‌ యంత్రం ద్వారా హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్‌కు వచ్చినప్పుడు, తిరిగి వెళ్లే సమయంలో బయోమెట్రిక్‌ హాజరును నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా టీచర్ల హాజరును క్రమబద్దీకరించటంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధనను అందించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - 2022-08-19T07:40:20+05:30 IST