మానవాళి మనుగడకు జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-05-23T06:15:43+05:30 IST

మానవాళి మనుగడకు మన చుట్టూ వున్న జీవ వైవిధ్య పరిరక్షణ అత్యంత కీలకమైనదని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ అన్నారు.

మానవాళి మనుగడకు జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలి
పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రతీప్‌కుమార్‌, తదితరులు

రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌  ప్రతీప్‌కుమార్‌ 

ఆరిలోవ, మే 22: మానవాళి మనుగడకు మన చుట్టూ వున్న జీవ వైవిధ్య పరిరక్షణ అత్యంత కీలకమైనదని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌  (పీసీసీఎఫ్‌) ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. తొలుత ఆయన జూ క్యూరేటర్‌ నూతన కార్యాలయాన్ని, సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతీప్‌కుమార్‌ మాట్లాడుతూ మన చుట్టూ వున్న చిన్నచిన్న జీవులను, జంతువులను సంరక్షిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం జూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొత్తగా నిర్మించిన రిప్పైల్‌ హౌస్‌, హెర్బివోర్‌ క్వారంటైన్‌ సదుపాయాలను ఆయన ప్రారంభించారు. రిప్పైల్‌ హౌస్‌ను గ్రీన్‌ ఇగువానా, ఇతర సరీసృపాల కోసం, హెర్బివోర్‌ క్వారంటైన్‌ను ఇతర ప్రాంతాల నుంచి జూకు తీసుకువచ్చిన జంతువులు, పక్షుల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్మించడం జరిగిందన్నారు. అవసరమైన సౌకర్యాలు, ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసుకుంటూ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కాగా జూ టికెట్‌ రేట్లు పెంచే యోచన కూడా ఉందన్నారు. జూ అభివృద్ధి కోసం సీఈఆర్‌, సీఎస్‌ఆర్‌ నిధులను తీసుకురావడంలో క్యూరేటర్‌ నందనీ సలారియా చూపిన చొరవకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో అనంతశంకర్‌, అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ఉమామహేశ్వరి, సెక్షన్‌ అధికారులు, జూ ఎడ్యుకేషన్‌ టీమ్‌, తదితరులు పాల్గొన్నారు.

యానిమల్‌ కీపర్ల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా..

జూలో మోట్‌ల సంఖ్య పెంచడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జంతువులు కూడా వచ్చినందున అందుకు తగ్గట్టుగా యానిమల్‌ కీపర్‌లను పెంచుతారా అని విలేఖరులు పీసీసీఎఫ్‌ ప్రతీప్‌కుమార్‌ను ప్రశ్నించగా.. అది ప్రభుతానికి సంబంధించిన అంశమని, అయినప్పటికీ ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకువెళతామన్నారు. యానిమల్‌ కీపర్లు జూకి వెన్నుముక వంటి వారన్నారు. వారి సేవలకు వెల కట్టలేమని పేర్కొన్నారు. కాగా సాయంత్రం జూలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా  కోస్టల్‌ ఎకో సిస్టమ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ, ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సహకారంతో సైంటిస్ట్‌ డాక్టర్‌ సుమిత్‌ చక్రబర్తి, తదితరులు జీవవైవిధ్యంపై అవగాహన కల్పించారు ముఖ్యంగా సాలెపురుగుల గురించి, జీవవైవిధ్యంలో వాటి పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో జూలో స్పైడర్‌ వాక్‌ను నిర్వహించారు.


Updated Date - 2022-05-23T06:15:43+05:30 IST