బడాబాబులకోసమే బయోడీజిల్‌!

ABN , First Publish Date - 2022-03-22T08:02:28+05:30 IST

ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంధన చమురు ధర పెరుగుదలకు దారితీసింది. యుద్ధం కొనసాగిన పక్షంలో చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ సంభావ్యత, ప్రత్యామ్నాయ మార్గాలలో ఇంధన భద్రతను...

బడాబాబులకోసమే బయోడీజిల్‌!

ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంధన చమురు ధర పెరుగుదలకు దారితీసింది. యుద్ధం కొనసాగిన పక్షంలో చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ సంభావ్యత, ప్రత్యామ్నాయ మార్గాలలో ఇంధన భద్రతను సమకూర్చుకోవల్సిన అగత్యాన్ని కలిగిస్తోంది.


మూడు ప్రధాన ఇంధన వనరులు చమురు, బొగ్గు, యురేనియం- దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. జీవ ఇంధనాలను ప్రోత్సహించడం ఒక ప్రత్యామ్నాయ మార్గమని పలువురు సూచిస్తున్నారు. చెరుకు నుంచి, సారహీన నేలల్లో పెరిగే జట్రోఫా మొక్కల విత్తనాల నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. సారహీన నేలలను ఉపయోగించుకోవడం ద్వారా జీవ ఇంధనాల ఉత్పత్తిని ఇతోధికంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. అయితే అవే నేలలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ప్రశ్న జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయగలమా, ఉత్పత్తి చేసి తీరాలా అన్నది కాదు. ఏ ప్రత్యామ్నాయ పంటలు మనకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయో మనం నిర్ధారించుకోవడమే ముఖ్యం.


బయోడీజిల్‌‌ ఉత్పత్తికి భారీ పరిమాణంలో నీరు అవసరమవుతుంది. ఒక హెక్టారు భూమిలో చెరకు సాగుకు, గోధుమ సాగు కంటే 20 రెట్లు అధికంగా నీరు అవసరమవుతుంది. మరి మన జల వనరులు ఇప్పటికే బాగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా భూగర్భ జలాలు శీఘ్రగతిన తగ్గిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చెరుకు సాగుకు మరింతగా భూగర్భ జలాలలను వాడుకుంటే భూగర్భ జల మట్టం మరింతగా పడిపోతుంది. ఈ పరిస్థితి తప్పకుండా మన ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.


మరి జీవ ఇంధనాలను ప్రోత్సహించడమెందుకు? సంపన్నులకు ప్రయోజనకరం కాబట్టే జీవ ఇంధనాల ఉత్పత్తి వైపు విధాన నిర్ణేతలు మొగ్గుచూపుతున్నారు. జీవ ఇంధనాలకు డిమాండ్ ప్రధానంగా సంపన్న వర్గాల వారినుంచే వస్తోందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం ఒకటి వెల్లడించింది. జీవ ఇంధనాలను సంపన్నులే ఎక్కువగా వినియోగించుకుంటుండగా ఎండుగడ్డి లాంటి జీవ ద్రవ్యాన్ని సామాన్య ప్రజలు అధికంగా ఉపయోగించుకుంటారు. వరి, గోధుమ పంటల సాగు ఎండుగడ్డిని సమకూరుస్తుంది. ఇదే పశువులకు ముఖ్య ఆహారం. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగి బాలలకు పోషకాహారం సమృద్ధిగా లభించేందుకు దోహదం జరుగుతోంది.


రాజస్థాన్‌లో నేను నిర్వహించిన ఒక అధ్యయనంలో వాణిజ్య పంటలను సాగు చేసే రైతు కుటుంబాల పిల్లల ఆరోగ్య స్థితిగతులు దిగజారిపోతున్నాయని వెల్లడయింది. కారణమేమిటి? వాణిజ్య పంటల సాగుద్వారా లభించిన ఆదాయాన్ని ఆ కుటుంబాలు పాలు, ఇతర పోషకాహార పదార్థాలను సమకూర్చుకోవడానికి తక్కువగా వినియోగిస్తున్నాయి. బయోడీజిల్‌ ఉత్పత్తికి చెరుకును మరింతగా ఉత్పత్తి చేయడం వల్ల అధికాదాయం లభిస్తుంది. అయితే ఆ అధికాదాయంలో గణనీయమైన భాగాన్ని పాలు మొదలైన ఆహార పదార్థాలు కాకుండా మోటార్ సైకిళ్లు, టెలివిజన్ సెట్లు మొదలైన వాటి కొనుగోలుకు వినియోగిస్తున్నారు. ఫలితంగా వాణిజ్య పంటల సాగు సామాన్య ప్రజల ఆరోగ్య భద్రతకు దోహదం చేయడం లేదు. చెప్పవచ్చిందేమిటంటే దేశ శ్రేయస్సు దృష్ట్యా కాకుండా సంపన్నుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బయోడీజిల్‌ మొదలైన జీవ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నారు.


బయోడీజిల్‌ మొదలైన జీవ ఇంధనాలను ప్రోత్సహించాలని సూచిస్తున్న వారు బ్రెజిల్ అనుభవాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. ఆ లాటిన్ అమెరికా దేశం భారీ పరిమాణంలో చెరకు దిగుబడులను సాధిస్తోంది. ఆ చెరుకు నుంచి నేరుగా బయోడీజిల్‌‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే మనం ఒక వాస్తవాన్ని విస్మరించకూడదు. మన దేశంలో కంటే బ్రెజిల్‌లో సాగుభూమి, సాగునీరు సమృద్ధంగా ఉన్నాయి. ఆ దేశంలో ప్రతీ 1000 మంది వ్యక్తులకు 32.5 హెక్టార్ల భూమి సాగులో ఉంది. ఇదే మన దేశంలో అయితే ప్రతీ వేయి మందికి కేవలం 1.48 ఎకరాల భూమి మాత్రమే ఉంది. బ్రెజిల్‌లో తలసరిన 29,006 క్యూబిక్ మీటర్ల పునరుద్ధరణీయ జల వనరులు అందుబాటులో ఉన్నాయి. మరి మన దేశంలో ఈ తలసరి సంపద కేవలం 1,152 క్యూబిక్ మీటర్లు మాత్రమే.


నేల, నీరు అపారంగా ఉన్న కారణంగా, ఆహార భద్రతపై ఎటువంటి ప్రభావం లేకుండా ఆ సహజ వనరులలో గణనీయమైన భాగాన్ని బయోడీజిల్‌ ఉత్పత్తికి వినియోగించుకునే వెసులుబాటు బ్రెజిల్‌కు ఉంది. మనకు ఇటువంటి సౌలభ్యం లేదు. బయోడీజిల్‌ ఉత్పత్తికి సాగు భూములను వినియోగిస్తే ఆహారోత్పత్తి తగ్గిపోవడం అనివార్యం. ఫలితంగా దేశ ప్రజలకు ఆహార భద్రత కొరవడుతుంది. ఇన్నేళ్లుగా వ్యవసాయరంగంలో మనం సాధించిన స్వావలంబన నిరర్థకమైపోతుంది. అన్నిటికంటే ముఖ్యం తిండిగింజలు కదా.


జీవ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నవారు మరో వాదన చేస్తున్నారు. చక్కెర ఉత్పత్తికి వినియోగించుకున్న అనంతరం మిగిలే చెరుకు పిప్పిని విద్యుదుత్పత్తికి వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు. నిశితంగా చూస్తే ఇది సమంజసమైన వాదన కాదని స్పష్టమవుతుంది. వరి, గోధుమ పంటలసాగుతో కూడా మనకు ఎండుగడ్డి అపారంగా సమకూరుతుంది. దానిని పశుగ్రాసంగా మాత్రమే కాకుండా విద్యుదుత్పత్తికి కూడా బాగా వినియోగించుకోవచ్చు. అలాగే కాగితాల తయారీ మొదలైన ఇతర ప్రయోజనాలు కూడా ఎండుగడ్డితో సమకూరుతాయి. కనుక వివిధ ఉపయోగాలు ఉన్న కారణంగా ఎండుగడ్డిని ఉత్పత్తి చేసుకోవడమే మనకు అనేక విధాలుగా లాభకరమైన వ్యవహారం. కనుక జీవ ఇంధనాలను ప్రోత్సాహించాలనే విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత ఇంధన సంక్షోభ సమయమే అందుకు అనువైనది. సమస్యను అధిగమించేందుకు ఇంధన వినియోగాన్ని మరింతగా తగ్గించే విషయమై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. సంపన్నులు, సామాన్యులను అందుకు అనుగుణంగా ప్రోత్సహించాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే మన పర్యావరణంపై అనవసర ఒత్తిళ్లు ఉండవు. మరీ ముఖ్యంగా మన ఆహార భద్రతకు ఎటువంటి ముప్పూ వాటిల్లబోదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-03-22T08:02:28+05:30 IST