Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 16:42:48 IST

Bimbisara writer Vasudev: ‘ఉంటే అటుండు లేదా ఇటుండు’ ఇదే స్ఫూర్తి

twitter-iconwatsapp-iconfb-icon

‘ఉంటే అటుండు లేదా ఇటుండు’ 

ఈ ఒక్క డైలాగ్ ఓ యువకుడి జీవితాన్ని మార్చేసింది.. 

ఐఏఎస్‌ వైపు వెళ్లాల్సిన అతన్ని సినిమాల్లోకి తీసుకొచ్చింది..

ఒక్క డైలాగ్‌ స్ఫూర్తి... పుట్టినరోజు వేడుక కోసం రాసిన నాలుగు లైన్లు.. 

అతన్ని మాటల రచయితగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాయి. 

ఆయనే వాసుదేవ్‌ మునెప్పగారి (Vasudev). ‘బింబిసార’ చిత్రంతో రచయితగా పరిచయమైన వాసుదేవ్‌ తన జర్నీ గురించి ‘చిత్రజ్యోతి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...(Bimbisara movie writer vasu dev)


హాయ్‌ వాసుదేవ్‌గారు కంగ్రాట్స్‌? తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు? 

అవునండీ! చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఊహించలేదు. టీమ్‌ అంతా చేసిన కృషితో సక్సెస్‌ని ఊహించాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో కాదు. 


మీ నేపథ్యం గురించి... 

మాది చితూర్తు జిల్లా పుంగనూరు. చదువంతా మదనపల్లి, తిరుపతిలో సాగింది. ఎంఎస్‌సి చేశాను. ఐఎఎస్‌ లేదా ఐపీఎస్‌ చేయించాలని నాన్న కోరిక. అందులో భాగంగా కోచింగ్‌ ఇప్పించి గ్రూప్‌–2 రాయించారు. అది రెండు మార్కుల్లో మిస్‌ అయింది. ఆయనకు నా మీద మరింత నమ్మకం పెరిగింది. ఢిల్లీ వాజీరామ్స్‌లో జాయిన్‌ చేస్తాను.. ఐఎఎస్‌ కోచింగ్‌ తీసుకుంటే తప్పకుండ సాధిస్తావు అని గ్రూప్‌–1 కూడా రాయించే ప్రయత్నం చేశారు. నేను ఆ హాల్‌ టికెట్‌ చింపేసి వచ్చేశా. ఎందుకంటే అదే సమయంలో పూరి జగన్నాథ్‌ – తారక్‌ కాంబినేషన్‌లో ‘టెంపర్‌’ విడుదలైంది. ‘ఉంటే అటుండూ లేదా ఇటుండూ’ అని ఆ చిత్రంలో పూరి రాసిన డైలాగ్‌ నన్ను ఆలోచనలో పడేసింది. ‘అవును కదా లైఫ్‌లో ఒక డెసిషన్‌ తీసుకోకపోతే ఓడిపోయినట్లు అవుతుంది.. భవిష్యత్తులో రిగ్రెట్‌ అవుతాం’ అనిపించి నాన్నకు చెప్పేశా సినిమాల్లోకి వెళ్తా అని! దర్శకుడు కావాలన్నది నా కోరిక. వద్దని నాన్న చాలా చెప్పి చూశారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఒక ప్రయత్నంలో ‘మనం ఏం సాధిస్తాం అన్నది తెలిసినప్పుడు ముందడుగు వేయడయే కరెక్ట్‌’ అని స్టెప్‌ వేశా. చివరికి నాన్న కూడా నా మాట కాదనలేదు. వర్షం పడుతున్న ఓ సాయంత్రం రూ.16500 నా చేతికిచ్చి హైదరాబాద్‌ పంపారు. జనరల్‌గా నేను ఎక్కడి వెళ్లినా ఆయనే ఆయనే స్వయంగా ట్రైన్‌ ఎక్కించేవారు. ఆ రోజు మాత్రం నాతో రాలేదు. 


ఇంతకీ హైదరాబాద్‌ వచ్చాక మీకు ఇష్టమైన పూరి జగన్నాథ్‌ని కలిశారా? 

కలిశానండీ! ఆయన చదివిన మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే నేనూ చేరాను. వర్దన్‌గారి దగ్గర కోచింగ్‌ తీసుకున్నా. పూరిగారి పుట్టినరోజున ఓ అభిమానిగా ఆయన్ను కలవడానికి ఆయన ఇంటి ముందు నిలబడ్డాను. మేనేజర్‌ను పట్టుకుని ఏదోలా ఆయను కలిశాను. ఆయన గురించి నేను రాసుకున్న కొన్ని లైన్లు చదివి వినిపించా. ‘టెంపర్‌ సినిమా వల్ల నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టానని  చెప్పా. పేరు అడిగి మేనేజర్‌తో టచ్‌లో ఉండమన్నారు. 


తండ్రి ఇచ్చిన కొంత డబ్బుతో హైదరాబాద్‌ వచ్చిన మీరు ఇక్కడ జీవనాన్ని ఎలా సాగించారు. 

నాన్న ఇచ్చిన డబ్బులు ఫీజు, ఇంటి అద్దెకు అయిపోయాయి. తదుపరి నెలకు ఇంట్లో అడగకూడదని ట్యూషన్స్‌ చెప్పడం మొదలుపెట్టా. నాకు రైటింగ్‌ కూడా తెలుసు. అప్పుడప్పుడు నా రాతల్ని ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేయడం వల్ల నన్ను ఫాలో అయ్యే వారి  నుంచి గుర్తింపు వచ్చింది. అలా ట్యూషన్స్‌ చెప్పా. బయట ఎవరన్నా కంటెంట్‌ అడిగితే రాసిచ్చేవాడిని ఆ సంపాదనతో జీవితాన్ని సాగించా. ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు మనం ఏం తింటున్నాం... ఏం కట్టుకుంటున్నాం ఎలా ఉంటున్నాం అనేది పెద్దగా పట్టించుకోము. చేసే పని మీద ధ్యాస తప్ప ఇంకోటి ఉండదు. అయితే కష్టంలో మాత్రం స్నేహితులు అండగా నిలిచారు. సోమశేఖర్‌, మహేశ్‌, అనన్యా, విజయభారతి,  వినోద్‌ చాలా సపోర్ట్‌ చేశారు. నాకు అండగా ఉంటూ ధైర్యం చెప్పేవారు. 


Bimbisara writer Vasudev: ఉంటే అటుండు లేదా ఇటుండు  ఇదే స్ఫూర్తి


కళ్యాణ్‌రామ్‌ సినిమాకు అవకాశం ఎలా వచ్చింది? 

నాకున్న గుడ్‌ విల్‌తో నా ఫోన్‌ నంబర్‌ ఓ నలుగురికి చేరువైంది. అలా కళ్యాణ్‌గారి ఇంట్లో ట్యూషన్‌ చెప్పడానికి వెళ్లా. ఆయన నాతో మాట్లాడిన కాసేపటికే నాలో ఏదో గ్రహించారు. 2018 జూలై 5న ఆయన పుట్టినరోజు సందర్భంగా హరికృష్ణగారు, కల్యాణ్‌రామ్‌గారిది డ్రాయింగ్‌ వేయించి దానిపై నాలుగు వాక్యాలు రాసి బహుమతిగా ఇచ్చాను. అది చూసి ‘118’ సెట్స్‌కి పిలిచి ఏం చేద్దామనుకుంటున్నారు అనడిగారు. నా ప్యాషన్‌ ఏంటో ఆయన ముందుంచా. సరేనని ఓ కథ వింటున్నా. ఓకే అయ్యాక చర్చల్లో కూర్చుందామన్నారు. 2019 మార్చి 19న కల్యాణ్‌గారి ఆఫీస్‌లో అడుగుపెట్టా. నిర్మాత హరి దర్శకుడి వశిష్టని పరిచయం చేశారు. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉంటానేమో అనుకున్నా. కానీ రైటింగ్‌ సైడ్‌ అవకాశం ఇచ్చారు. ఓ సీన్‌కి డైలాగ్‌ రాస్తానన్నా.. అది చాలా హైలో వచ్చింది. ‘మన దగ్గరున్న మెయిన్‌ పాయింట్‌ ఇది. దీని మీద కథ రెడీ చేస్తున్నాం. దీనికి సంబంధించి నీ దగ్గర ఏమన్నా పాయింట్స్‌ ఉంటే చెప్పండి’ అని దర్శకుడు అడిగారు. అలా స్ర్కిప్ట్‌లో నేనూ భాగమయ్యా. ఓ రోజు మెయిన్‌ లీడ్‌కి సంబంధించి ఓ డైలాగ్‌ రాశాను. దానికి బాగా ఇంప్రెస్‌ అయి స్ర్కిప్ట్‌ మొత్తం ఇచ్చేసి నా వెర్షన్‌ రెడీ చేసుకోమన్నారు. నేను రాసిన ప్రతీది సింగిల్‌ అటెంప్ట్‌లో ఓకే చేసేవారు. గంట, రెండు గంటల్లో రాసి ఇచ్చేయడం.. ఇచ్చిన పనిని అతి త్వరగా పూర్తి చేయడంతో సినిమాటిక్‌ మీడియం బాగా తెలిసిపోయింది. టీమ్‌ అందరికీ అది బాగా నచ్చేది. అక్కడి నుంచి ప్రతి విషయంలో నన్ను ఇన్‌వాల్వ్‌ చేశారు. దర్శకుడికి నాకు బాగా సింక్‌ అయింది. కల్యాణ్‌రామ్‌గారు ఇచ్చిన స్వేచ్ఛతో ‘బింబిసారుడు’ అనే పాత్ర బాగా ఎక్కిపోయింది. దానిని బట్టి ఇంకా మంచి డైలాగ్‌లు రాయగలిగా. అలా మొదలైన జర్నీ సినిమా సక్సెస్‌ వరకూ తీసుకొచ్చింది. 

కల్యాణ్‌రామ్‌తో మీ జర్నీ ఎలా ఉంది? (Kalyan ram)

అదొక అద్భుతం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా తక్కువ మాట్లాడతారాయన. ఎదుట మనిషిని రిసీవ్‌ చేసుకునే తీరు నాకు నచ్చుతుంది. తాజాగా జరిగిన సక్సెస్‌ పార్టీలో పిలిచి ‘మీకు పర్సనల్‌ థ్యాంక్స్‌ చెప్పలేదండీ’ అంటూ ప్రశంసించారు. అమ్మానాన్న జన్మనిస్తే... నా కెరీర్‌ పరంగా పుట్టుకను ఇచ్చింది మాత్రం కల్యాణ్‌రామ్‌గారే! అసలు ఆయన సినిమాకు నన్ను ఎందుకు పెట్టుకోవాలి? చాలామంది గొప్ప రచయితలు ఉన్నారు. అయినప్పటికీ నన్ను చూసిన మొదటి రోజే నాలో ఏదో గమనించి అవకాశం ఇచ్చారు. వాళ్ల సినిమాకు నేను ఉపయోగపడతాను అనడం గ్రేట్‌ కదా. ఈ పేరు రావడానికి మీరే కారణం కల్యాణ్‌ గారూ అన్నా సరే.. ఆ క్రెడిట్‌ ఆయన తీసుకోవడం లేదు. మీ టాలెండ్‌ మాట్లాడింది అంటున్నారంతే! అలా అనాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. 

‘బింబిసారా’ రిలీజ్‌ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయట కదా? 

అవునండీ! సినిమా సక్సెస్‌ కావడం, మాటలకు మంచి స్పందన రావడంతో మంచి గుర్తింపు వచ్చింది. చాలా నిర్మాణ సంస్థల నుంచి ఫోన్లు వచ్చాయి. అసలు ‘బింబిసారా’ 40 శాతం చిత్రీకరణలో ఉండగానే సురేందర్‌రెడ్డిగారి నుంచి పిలుపొచ్చింది. అప్పట్లో నేను ‘ఎంవీడీ’ కాన్సెప్ట్‌ పేరుతో పాడ్‌క్యాస్ట్‌ ప్రారంభించా. విమెన్‌, గర్ల్‌, స్ట్రగుల్స్‌, మనీ, ఇండియా ఇలా 20 కాన్సెప్ట్‌ పోస్ట్‌ చేశా. అందులో ‘ఇండియా’ అనేది సురేందర్‌రెడ్డిగారికి బాగా నచ్చి నన్ను పిలిచారు. ఓ సీన్లు రాసిమన్నారు. అవి వారికి నచ్చి ఓ అవకాశం ఇచ్చారు. కానీ నేను అంగీకరించలేదు. ‘ఎలాంటి అనుభవం, బ్యాగ్రౌండ్‌ లేకపోయినా కల్యాణ్‌గారు నమ్మి నాపై పెద్ద బాధ్యత పెట్టారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఫుల్‌ఫిల్‌ చేశాకే బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను’ అని సురేందర్‌గారి చెప్పాను. అందుకు ఆయన ‘ఓకే అని.. భవిష్యత్తులో మనిద్దరం కలిసి పనిచేస్తాం’ అని మెసేజ్‌ పెట్టారు. (Bimbisara writer Vasudev interview)

Bimbisara writer Vasudev: ఉంటే అటుండు లేదా ఇటుండు  ఇదే స్ఫూర్తి


పాడ్‌క్యాస్ట్‌, ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు ద్వారా సోషల్‌ మీడియా వరకే తెలిసిన మీరు.. ఇప్పుడు రైటర్‌ వాసుదేవ్‌గా పూర్తిస్థాయిలో అందరికీ పరిచయమయ్యారు. ఈ ఫీలింగ్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారు. 

‘ఓ మనిషి సక్సెస్‌ సాధించిన తర్వాత వెనుక పదిమంది ఉండొచ్చు. సక్సెస్‌ లేకపోతే మనం వైపు కూడా ఎవరూ చూడరు’ అని పరిశ్రమలో తరచూ అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి బ్యాగౌండ్‌ లేనివారికి మరీ కష్టం అవుతుంది. కానీ కల్యాణ్‌రామ్‌ నా గురించి ఏమీ తెలియకుండా నేను రాసిన నాలుగు వాక్యాలు నచ్చి నాలో ఏదో ప్రతిభ ఉందని గమనించి అవకాశం ఇచ్చారు. ఇది నేను ఊహించని అవకాశం. ఆయన నాపై పెట్టిన నమ్మకమే నేను అందుకున్న తొలి విజయం. అక్కడి నుంచి దర్శకనిర్మాతలు, నా టీమ్‌ ఇచ్చిన సపోర్ట్‌తో ‘నేను చేయగలను’ అనే నమ్మకంతో ముందుకెళ్లా. హార్డ్‌వర్క్‌, నాపై నాకున్న నమ్మకం ముందుకు నడిపించాయి. ఈ సక్సెస్‌ని నిలబెట్టుకోవడానికి రెట్టింపు కష్టపడాలి. ఇది జస్ట్‌ బిగినింగ్‌ మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది. రచన పరంగా ఇంకా కొత్తగా ఆలోచించాలి. ఇన్నోవేటివ్‌ థాట్స్‌తో ముందుకెళ్లాలి. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఇదే.  రైటింగ్‌ అనే నా పుస్తకంలో ఒక పేజీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. నెక్ట్స్‌ ఏంటి అంటే మళ్లీ తెల్ల కాగితం అనే చెబుతా. ఎందుకంటే మళ్లీ కొత్త అవకాశం వచ్చి.. ఆ పనుల్లో నిమగ్నమయ్యేంత వరకూ నా పని తెల్ల కాగితమే అని నమ్ముతా. ‘బింబిసారా’ సక్సెస్‌ని చాలా ఆస్వాదిస్తున్నా. సినిమా వద్దన్న నాన్న కూడా మెచ్చుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి. 12 నుంచి 15 పాయింట్‌ డెవలప్‌ చేసుకున్నా. 5 పాయింట్స్‌ని బౌండెడ్‌ స్ర్కిప్ట్స్‌గా రెడీ చేసుకున్నా. ఇంకా కొన్ని ఆలోచనలు, దాని తాలూక షెడ్యూల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ‘బింబిసారా 2’ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి.. కల్యాణ్‌గారి నమ్మకాన్ని నిలబెట్టాలి కాబట్టి ఈ పని పూర్తయ్యాక నేను పూర్తిస్థాయిలో దర్శకత్వం వైపు వెళ్తా. అలాగని రైటింగ్‌వదలను. 

‘టెంపర్‌’ సినిమా డైలాగ్‌, పూరి జగన్నాథ్‌ ప్రభావం.. వీటికి ముందు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉండేదా? 

100 శాతం ఉండేది. ఓ రోజు నేనొక టిఫిన్‌ సెంటర్‌లో బజ్జీలు తిని పేపర్‌ నలిపి పడేస్తుంటే ఆ పేపర్‌ వెనక భగత్‌సింగ్‌గారి ఫొటో ఒకటి జనన–మరణాల తేదీలతో ఉంది. నిజం చెప్పాలంటే ఆయన పేరు తెలుసు కానీ... అంతగా ఆయన మీద అవగాహన లేదు. 21 ఏళ్ల వయసులో చనిపోయిన ఆయన్ను ఇప్పటికీ మనం స్మరించుకుంటున్నాం అంటే.. ‘ఆయనలో ఎలాంటి ఆలోచనలు ఉండేవి.. ఎంతగా పోరాటం చేశాడు’ అన్నది ఆలోచించా. ఆయనకు సంబంధించిన పలు పుస్తకాలు చదివి చాలా విషయాలు తెలుసుకున్నా. దాంతో ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యా. ‘నా ప్రతి స్టెప్పులోనూ ఆయన ఉన్నారు’ అనేంతగా మారిపోయాను. ‘అమ్మానాన్న జన్మనిచ్చారు.. దేవుడు అవకాశం ఇచ్చారు. ఎవరైనా గొప్పవారు కావాలంటే వారిని వారే మలుచుకోవాలి.. సో.. నన్ను కూడా నేనే మలుచుకోవాలి’ అన్న ఆలోచనలో రైటింగ్‌ అనేది నా మెదడులో పుట్టింది. దీనికి 100 శాతం భగత్‌సింగ్‌ ఆధ్యం అని చెబుతాను. 

సినిమాల వైపు వద్దన్న మీ నాన్నగారు.. మీ సక్సెస్‌ చేసి ఏమన్నారు?

సినిమా విడుదల వరకూ అమ్మానాన్న చాలా భయపడ్డారు. నా ప్రతిభ ఏంటో బయటకు తెలియాలంటే సినిమా విడుదలయ్యాక నలుగురు నా గురించి మంచి మాటలు చెప్పాలి. అలాంటి మాటలు నా తండ్రి విన్నారు. ప్రివ్యూ చూసి కీరవాణిగారు దర్శకుణ్ణి పిలిచి ‘డైలాగ్స్‌ రాసిందెవరు’ అని అడిగి అభినందనలు చెప్పు అన్నారట. ఆ తర్వాత వి.వి.వినాయక్‌గారు ఈ ‘డైలాగ్స్‌ రాసిన అబ్బాయి ప్యాషన్‌ కనిపిస్తుంది సినిమాలో. ఈ కథను మాటల్లో చెప్పడం చాలా కష్టం’ అని అన్నారు. పెద్ద కథ, హీరో కల్యాణ్‌రామ్‌, దర్శకుడు, కీరవాణి సంగీతం, ఛోటా  ఫొటోగ్రఫీ ఇన్ని శాఖల్లో పెద్దపెద్ద వాళ్లు ఉన్నా నువ్వు రాసిన మాటల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే నీలోనూ ప్రతిభ ఉంది. మామూలు ఆలోచనతో నువ్వు సినిమాల్లోకి వెళ్లలేదు. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్‌ మాకేమీ వద్దు’ అని నాన్న అనడం చాలా ఆనందంగా ఉంది. నా మీద నాకున్న నమ్మకమే ఇంత వరకూ తీసుకొచ్చింది. 

కొత్తగా వస్తున్న రచయితలకు ఎలాంటి సవాళ్లు ఉంటాయి. 

రోజులు మారుతున్నాయి.. ఆడియన్స్‌ అప్‌డేట్‌ అవుతున్నారు. ఏదైనా కొత్తగా ఉండాలి. దానికి తగ్గట్టే కథ మీద కసరత్తులు చేయాలి. కథకు సోల్‌ ఉండాలి.. ఉదాహరణకు భగత్‌సింగ్‌ గారి విషయానికొస్తే.. ఆయన జీవితం గురించి ఎవరైనా పుట్టినప్పటి నుంచి లేదా మధ్య నుంచీ చెప్పాలనుకుంటారు. నాకు మాత్రం ఆయన చనిపోయినప్పటి నుంచి చెప్పాలనుంటుంది. అది నాకు సోల్‌. సోల్‌ కోసం ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి. కథ, మాటల్లో కొత్తదనం చూపించాలి.


మూడేళ్ల క్రితం సినిమాల్లో ఏదో సాధించాలనే తపన, ఇప్పుడు వచ్చి నిరూపించుకున్నారు? అప్పటికీ ఇప్పటికీ మీలో మీరు గమనించిన తేడా? 

అప్పట్లో చాలా ఫైర్‌గా ఉండేవాణ్ణి. ఏదో చేయాలనే తపన. 24 గంటలూ అదే ఆలోచన. కమిట్‌మెంట్‌తో ఉండేవాడిని. నేను ఇటు వచ్చేటప్పుడు ఒకటే అనుకున్నా.. ‘భయమేస్తుందని మనసుకి అనిపిస్తే బ్యాగ్‌ సర్దుకుని ఇంటికి వెళ్లిపో. ఉండి సాధించాలి.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడాలి అనుకుంటే నిరూపించుకో. ప్రపంచానికి నువ్వు నిరూపించుకోవలసిన అవసరం లేదు. నువ్వేంటో నువ్వు నిరూపించుకో’ ఇదే నేను అనకున్నా. ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను. నాపై బరువు బాధ్యత పెరిగాయి. ఈ సినిమా సక్సెస్‌తో నా పుస్తకంలో ఓ పేజీ పూర్తయింది. మళ్లీ కొత్త పేజీ మొదలైంది. అదంతా తెల్లగా ఉంటుంది. మళ్లీ అవకాశాలు లేని వాసుదేవ్‌లాగా పని చేయాలి. ఇదే ఆలోచన నాలో ఉంది. అలాగే ఆలోచించాలి అలాగే ప్రయాణించాలి. 


తదుపరి అడుగు ఎటువైపు? 

హైదరాబాద్‌కి వచ్చేటప్పటికే కల్యాణ్‌రామ్‌గారికి కోసం ఓ కథ రాసుకున్నా. ఓ ఆడియో ఫంక్షన్‌లో ఆయన లుక్‌ చూసి ఆ లైన్‌ అనుకున్నా. అయితే ‘బింబిసారా 2’ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకూ మరో సినిమాకు కమిట్‌ కాను. ఒకవేళ ఆ చిత్రం ఆలస్యం అవుతుందీ అంటే నా దగ్గర ఉన్న కథలతో కల్యాణ్‌గారిని అప్రోచ్‌ అవుతా. హీరో నానికి ఓ కథ రాసుకున్నా. యువ క్రియేషన్స్‌లో కూడా ఓ కథ చెప్పా. అయితే గతంలోనే యువీ నుంచి నాకు పిలుపు వచ్చింది. ‘సాహో’ సమయంలో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ చేరాలని సుజీత్‌ని కలిశా. ఇక్కడ ఆల్‌రెడీ ఉన్నారు.  మీరు రావాలంటే మరో మనిషి తీసేయాలి అని సుజీత్‌ చెప్పారు. నేనే తప్పుకొంటే అక్కడున్న అతనికి అవకాశం ఉంటుందని వెళ్లిపోయా. ‘రాధేశ్యామ్‌’ సమయంలో మళ్లీ ఆఫర్‌ వచ్చింది. అప్పటికే ‘బింబిసారా’తో బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయా. బెల్లంకొండ సురేశ్‌ కూడా పిలిచారు. ఆయన దగ్గర ఓ కథ ఉంది. డెవలప్‌ చేస్తారా అనడిగారు. నా కథల్ని కూడా అడిగారు. డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తానని చెప్పారు. (Bimbisara writer Vasudev interview)


- ఆలపాటి మధు Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement