రూ.3 కోట్లు హాంఫట్‌!

ABN , First Publish Date - 2021-10-04T04:32:08+05:30 IST

ఏజెన్సీలో రహదారుల నిర్మాణం పేరిట నిధుల దోపిడీ సాగుతోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చే నిధులను కేటాయించింది. మెళియాపుట్టి మండలానికి సంబంధించి కేరశింగి, గూడ, అడ్డివాడకు రహ‘దారి’ సుగమం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా నిధులు మంజూరు చేసింది. కానీ ఈ మూడు రోడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.3 కోట్లు హాంఫట్‌!
నిఽధులు ఖర్చు చేసినా, పనులు సాగని కేరశింగి రోడ్డు

రహదారులు నిర్మించకుండానే బిల్లులు

కీలక ప్రజాప్రతినిధి బంధువులే కాంట్రాక్టర్లు

మెళియాపుట్టి మండలంలో వెలుగుచూస్తున్న అక్రమాలు

(మెళియాపుట్టి)

ఏజెన్సీలో రహదారుల నిర్మాణం పేరిట నిధుల దోపిడీ సాగుతోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చే నిధులను కేటాయించింది. మెళియాపుట్టి మండలానికి సంబంధించి కేరశింగి, గూడ, అడ్డివాడకు రహ‘దారి’ సుగమం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా పరశురాంపురం నుంచి కేరశింగికి రోడ్డు నిర్మాణానికి రూ.కోటి, కేరశింగి నుంచి గూడ వరకూ రోడ్డుకు రూ.కోటి, వీరన్నపేట నుంచి చందనగిరి వరకూ రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారు. ఐటీడీఏ ఇంజనీరింగ్‌ శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ మూడు రహదారులు ఏర్పాటు కావాలంటే మూడు కొండలను తవ్వాలి. జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టి ముందుకు సాగాలి. కానీ ఈ మూడు రోడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇవే రహదారులకు ఇంతే నిధులు మంజూరయ్యాయి. అప్పుడు కూడా నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చే నిధులనే కేటాయించారు. అప్పట్లో కొంతవరకూ పనులు జరిపించి వదిలేశారు. ఇప్పుడు అవే పనులు తాము చేసినట్టు చూపి కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ పనులను నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి బంధువులు దక్కించుకున్నారు. అందుకే ఇంజనీరింగ్‌ అధికారులు కిమ్మనకుండా ఉన్నారు. బిల్లులు ముందస్తుగానే చెల్లించారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అసలు వాటిని రహదారులు అంటారా? అని ప్రశ్నిస్తున్నారు. 


 అందని పౌరసేవలు

మండలంలో కేరశింగి, గూడ, అడ్డివాడ, వీరన్నపేట, చందనగిరి తదితర కొండ శిఖర గ్రామాలకు సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో పౌరసేవలు అందని దుస్థితి. అనారోగ్య, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు గగనంగా మారుతున్నాయి. కనీసం ఫీడర్‌ అంబులెన్స్‌లు వెళ్లలేని దుస్థితి నెలకొంది. రేషన్‌ కోసం కొండలు దిగి..వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. ప్రభుత్వం రేషన్‌ సరఫరా బండ్లు ఏర్పాటుచేసినా.. కొండశిఖర గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రహదారులు నిర్మించనున్నట్టు ప్రకటించడంతో గిరిజనులు ఎంతగానో సంతోషించారు. కానీ వైసీపీ కీలక నేత బంధువులు పనులు దక్కించుకోవడం... తూతూమంత్రపు పనులతో బిల్లులు డ్రా చేసుకోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవల గిరిజన గ్రామాల ప్రజలు మండల, ఐటీడీఏ, కలెక్టరేట్‌ స్పందన విభాగాల్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంతో పాటు ఐటీడీఏ అధికారులు స్పందించాల్సిన అవసరముంది. 


  చేసిన పనులకే బిల్లులు

కొండ శిఖర గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేస్తాం. పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకూ చేసిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాం. మిగతా పనులు త్వరితగతిన పూర్తిచేస్తాం. గిరిజనుల రహదారి కష్టాలు తీర్చుతాం. 

-గణేష్‌, ఏఈ, ఐటీడీఏ పాతపట్నం సెక్షన్‌

Updated Date - 2021-10-04T04:32:08+05:30 IST