బిల్లుల పెండింగ్‌.. నిలిచిన అమ్మకాలు

ABN , First Publish Date - 2020-06-23T10:52:21+05:30 IST

నరసాపురం, యలమంచిలి లంకల్లోని ర్యాంపుల్లో ఇసుక అమ్మకాలు నిలిచిపోయాయి.

బిల్లుల పెండింగ్‌.. నిలిచిన అమ్మకాలు

నరసాపురం/యలమంచిలి, జూన్‌ 22: నరసాపురం, యలమంచిలి లంకల్లోని ర్యాంపుల్లో ఇసుక అమ్మకాలు నిలిచిపోయాయి. పడవదారులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పేరుకుపోవడంతో కొద్ది రోజులుగా పడవ యజమానులు ఇసుక రవాణా నిలిపివేశారు. ఎక్కడి పడవలు అక్కడే నిలిచిపోయాయి. ఇసుక గుట్టలు లేక ఖాళీగా మారాయి. నరసా పురం గోదావరిలో నుంచి ఇసుకను తవ్వి, దాన్ని పడవలపై పాలకొల్లు రోడ్డులోని లాకుల వద్దకు తీసుకొచ్చి చాలా ఏళ్లు నుంచి అమ్మకాలు జరుపుతున్నారు. రోజుకు సుమారు వంద యూనిట్ల ఇసుక  ఈ ర్యాంపులో విక్రయించేవారు. పడవ కార్మికులతోపాటు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, లోడింగ్‌ కూలీలతో కలిపి సుమారు 300 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ర్యాంపు ద్వారా ఉపాధి పొందుతున్నారు.


గత నెల వరకు పడవదారులకు ప్రతి వారం తీసుకొచ్చిన ఇసుకకు బిల్లుల చెల్లింపు జరిగేది. ఇటీవల రూ.14 లక్షల వరకు పెండింగ్‌ పడ్డాయి. దీంతో పడవ యజమానులు పెట్టుబడులు పెట్టలేక గురువారం నుంచి ఇసుక రవాణాను నిలిపివేశారు. సోమవారం వరకు ఉన్న స్టాక్‌ను డెలివరీ చేశారు. కొత్తగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి పరిస్థితి వివరించి, నాలుగు రోజులు ఆగమని సిబ్బంది చెబుతున్నారు. ఇసుక తీత కార్మికులకు ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలని యలమంచిలి శాండ్‌, బోట్‌ వర్కర్స్‌, లేబర్‌ కాంట్రాక్ట్‌  కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు కొల్లు పేతురు డిమాండ్‌ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ యలమంచిలి లంక ఇసుక తీత కార్మికులకు రూ.15 లక్షలు, అబ్బిరాజుపాలెం కార్మికులకు రూ.13 లక్షలు, దొడ్డిపట్ల కార్మికులకు రూ.15 లక్షలు, చించి నాడ కార్మికులకు రూ.2.5 లక్షల బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-06-23T10:52:21+05:30 IST