కుబేరుల రాజ్యం

ABN , First Publish Date - 2021-04-10T05:57:52+05:30 IST

కరోనా కష్టకాలంలోనూ మరికొందరు అపర కుబేరులుగా అవతరించారనీ, సంపన్నుల వద్ద మరింత సంపద పోగుబడిందనీ ఫోర్బ్స్‌ పత్రిక ఇటీవల ప్రకటించింది. ఆర్థిక మాంద్యానికి తోడు....

కుబేరుల రాజ్యం

కరోనా కష్టకాలంలోనూ మరికొందరు అపర కుబేరులుగా అవతరించారనీ, సంపన్నుల వద్ద మరింత సంపద పోగుబడిందనీ ఫోర్బ్స్‌ పత్రిక ఇటీవల ప్రకటించింది. ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా మహమ్మారి కమ్ముకురావడంతో సామాన్యుల జీవితాలు ఛిన్నాభిన్నమైనాయి. ప్రపంచమంతా దివాలా తీసినా ఈ మాంద్యాలు, మహమ్మారులు కొందరిని మాత్రం తాక లేదని ఈ నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా బిలియనీర్లయిన 660మందిలో కనీసం నలభైమంది కేవలం కరోనా సంబంధిత ఉత్పత్తులతో ఈ జాబితాలోకి వచ్చిచేరడం మరో విశేషం. 


ప్రైవేటుకు తలుపులు తెరిచేసిన ఈ మూడుదశాబ్దాల శ్రమా ఊరికే పోలేదు. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ మేగజైన్‌ 35వ వార్షిక బిలియనీర్ల జాబితాలో భారతదేశం మూడోస్థానం సాధించింది. అమెరికా, చైనా తరువాత 140మంది బిలియనీర్లతో ఈ కీర్తి గడించింది. అమెరికాలో శతకోటీశ్వరులు ౬14 నుంచి ౭24కు, చైనాలో ౪5౬నుంచి ౬98కి పెరిగారట. భారత్‌లోనూ దాదాపు నలభైమంది పెరిగారు. జర్మనీ, రష్యాలు భారత్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనా ప్రభువుల కన్నెర్రకు గురై, కొంతకాలం ఎవరికీ కనిపించకుండా పోయిన జాక్‌మాను రెండోస్థానంలోకి నెట్టేసి, ముఖేష్‌ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. అనతికాలంలోనే అతివేగంగా ఎదిగొచ్చిన అదానీ ఆ తరువాత స్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి ఇరవైమందిలో తొలిసారిగా చేరిన అదానీ ఎదుగుదల వేగం చూస్తుంటే, ఆయన త్వరలోనే మరిన్ని రికార్డులు సృష్టించ వచ్చు. ప్రపంచ కోటీశ్వరుల్లో తొలిస్థానాల్లో ఉన్న జెఫ్‌ బెజోస్‌, ఎలన్‌మస్క్‌లకంటే ఈ ఏడాది ఎక్కువ సంపాదించిన ఘనత ఆయనది. ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గుగనులు, విద్యుత్‌ప్లాంట్లతో ఆయన విస్తరణ వేగం ఊహకు అందనిది. ఆరేళ్ళక్రితమే వివిధ రంగాల్లోకి వ్యాపించడం ఆరంభించిన ఈయన సంపద ఏడాది కాలంలో కనీసం నాలుగురెట్లు పెరగడం విశేషం. 


భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఏడున్నరశాతం క్షీణించిందని ప్రభుత్వం చెప్పిన కాలంలోనే, కొత్తగా నలభైమంది కుబేరులు పుట్టుకొచ్చారు, ఉన్నవారి ఆస్తిపాస్తులు మరింత హెచ్చాయి. కొవిడ్‌ కాలంలో వేలాదిమంది వలస పోయారు, కోట్లాది కుటుంబాలు కకావికలమైనాయి. ఇంతటి కష్టకాలంలోనూ సంపన్నులు మరింత సంపదపోగేసుకోగలగడానికి కరోనాను కూడా వారికి వరంగా మార్చగలిగే విధానాలే కారణం. కరోనా సాకుగా చూపి వందలమందిని ఉపాధులు, ఉద్యోగాలకు దూరం చేసినవారు దేశ విదేశాల్లో ఖరీదైన భవనాలను కొనుగోలు చేసిన ఘట్టాన్నీ చూశాం. ఈ కష్టకాలంలో పాలకులు ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలన్నీ పేదలకు కాక పెద్దలకే ప్రయోజనం చేకూర్చాయి. సంపద సృష్టికర్తలన్న ముద్దుపేరుతో ప్రభుత్వాలు వారిని మరింత దాచుకొనేందుకూ, దోచుకొనేందుకూ సహకరిస్తున్నాయి. సంపద పంపిణీలో అసమానతలు, శ్రమజీవికి తగిన ఫలం దక్కకపోవడం పాలకులకు పట్టడం లేదు. కార్మికులకు రక్షణనిచ్చే చట్టాలన్నీ చట్టుబండలు చేసి, బడా పారిశ్రామికవేత్తల వీరవిహారానికి ఆటంకాలు లేకుండా చేయడమే జరుగుతోంది. పెరిగిన సంపద అందరిదీ కాదనీ, కొందరిది మాత్రమేననీ, ప్రజలందరికీ చెందాల్సిన దానిని కొందరికి కట్టబెట్టే పని సాగిపోతున్నదనీ గ్రహించాలి. 


కరోనాతో భారత్‌లో డెబ్బయ్‌శాతం మంది మరింత పేదరికంలోకి జారిపోయారనీ, ఒకశాతం సంపన్నులు నాలుగురెట్లు బాగుపడ్డారని ఇటీవల ఆక్స్‌ఫామ్‌ వ్యాఖ్యానించింది. పేదలు తిరిగి తేరుకోవడానికి కనీసం పదేళ్లు పడుతుందనీ, ప్రజలకు నేరుగా ఆర్థికమేలు సమకూర్చే ప్రయత్నాలు అవసరమనీ ఆక్స్‌ఫామ్‌ అన్నది. ప్రభుత్వరంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ప్రజాపంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం, సామాజిక రక్షణలు కల్పించడం ఇత్యాది సూచనలు చేసింది. ఈ కష్టకాలంలో సంపన్నులమీద మరిన్ని పన్నులు వేసి సొమ్ముసమకూర్చుకోమని హితవూ చెప్పింది. అటువంటి ప్రతిపాదన చేసినందుకు కొందరు అధికారులను శిక్షించిన ఘనత మన పాలకులది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంతవరకూ కుబేర జాబితాలో ఏటా మరింతమంది చేరుతూనే ఉంటారు, ఆక్స్‌ఫామ్‌ ఆవేదన చెందుతూనే ఉంటుంది.

Updated Date - 2021-04-10T05:57:52+05:30 IST