Big Bull Rakesh Jhunjhunwala : బిలియనీర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-14T15:00:51+05:30 IST

బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్

Big Bull Rakesh Jhunjhunwala : బిలియనీర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

న్యూఢిల్లీ : బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణించారు. 1960 జూలై 5న జన్మించిన ఆయన ముంబైలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. 


ఆదివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో దాదాపు ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రికి చేరుకునేసరికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. కొద్ది వారాల క్రితం ఆయన ఈ ఆసుపత్రిలోనే మూత్రపిండాల సంబంధిత సమస్యకు చికిత్స చేయించుకున్నారు. 


రాకేశ్ బిజినెస్ వెంచర్లలో ఒకటి భారత దేశంలో నూతన బడ్జెట్ వైమానిక సేవల సంస్థ ఆకాశా ఎయిర్. ఇటీవలే ఈ వైమానిక సంస్థ సేవలను ప్రారంభించింది. మొదటి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ ప్రయాణించింది. 


రాకేశ్ తండ్రి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌. రాకేశ్ సిడెన్హామ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఎన్‌రోల్ అయ్యారు. 


రాకేశ్ విద్యార్థి దశలోనే రూ.5,000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో ప్రవేశించారు. 2022 జూలైనాటికి ఆయన సంపద నికర విలువ 5.5 బిలియన్ డాలర్లు అని అంచనా. ఆయన మన దేశంలోని సంపన్నుల జాబితాలో 36వ స్థానంలో ఉన్నారు. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రొవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, వైస్‌రాయ్ హోటల్స్ లిమిటెడ్, టాప్స్ సెక్యూరిటీ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 


‘బిగ్ బుల్ ఆఫ్ ఇండియా’ (Big Bull of India) గా రాకేశ్‌ సుపరిచితులు. ‘కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్’ (King of Bull Market)గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. స్టాక్ మార్కెట్ జోస్యాలకు ఆయన పెట్టింది పేరు. భారత దేశ వారన్ బఫెట్ (Warren Buffet of the Indian market) కూడా ఆయనకు పేరు ఉంది.


ఆకాశా ఎయిర్‌ను రాకేశ్, జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ వినయ్ దూబే కలిసి ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రస్తుతం 2 విమానాలు ఉన్నాయి. మరో 70 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆగస్టు 9 నాటికి మూడు నగరాలకు ఈ విమానాల సేవలు విస్తరించాయి. 


Updated Date - 2022-08-14T15:00:51+05:30 IST