బిల్‌గేట్స్‌ మెచ్చిన పుస్తకాలివి!

ABN , First Publish Date - 2021-12-27T05:30:00+05:30 IST

సంవత్సరాంతం వస్తోదంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది పుస్తకప్రదర్శనల గురించి. ఇదే విధంగా ప్రతి ఏడాది ప్రముఖులు..

బిల్‌గేట్స్‌ మెచ్చిన పుస్తకాలివి!

సంవత్సరాంతం వస్తోదంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది పుస్తకప్రదర్శనల గురించి. ఇదే విధంగా ప్రతి ఏడాది ప్రముఖులు - తాము ఆ సంవత్సరంలో చదివిన పుస్తకాల జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ చదివిన పుస్తకాలు.. వాటి ప్రత్యేకతలేమిటో చూద్దాం..



ఏ థౌజెండ్‌ బ్రెయిన్స్‌: ఏ న్యూ థిరీ ఆఫ్‌ ఇంటిలిజెన్స్‌ (జెఫ్‌ హాకిన్స్‌)

కృత్రిమ మేధ(ఏఐ) - మానవ పురోగతికి శాస్త్రవేత్తల ఎంచుకున్న ఆయుధం. దీనిని మరింత సమర్ధంగా ఎలా ఉపయోగించాలనే విషయంపై పామ్‌ పైలెట్‌ ఆవిష్కర్త ‘జెఫ్‌ హాకిన్స్‌’ రాసిన పుస్తకమిది. మన శరీరంలోని న్యూరాన్లకు.. మిషిన్‌ ఇంటిలిజెన్స్‌ (ఎంఐ)కు మధ్య సారూప్యతలను వివరించే గొప్ప పుస్తకమిది. ఏఐపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. 


జీన్‌ ఎడిటింగ్‌ అండ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రేస్‌ (వాల్టర్‌ ఇసాక్‌సన్‌)

జన్యు ఎడిటింగ్‌ అనేది గత దశాబ్దంలో వచ్చిన గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణగా శాస్త్రవేత్తలు పేర్కొంటూ ఉంటారు. అయితే దీని వల్ల అనేక దుష్పరిణామాలున్నాయనేది కొందరి వాదన. ఈ విషయాలన్నింటిపైన వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన పుస్తకమే - ‘జీన్‌ ఎడిటింగ్‌ అండ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రేస్‌’. 


క్లారా అండ్‌ ది సన్‌ 

(కాజో ఇష్‌గురో)

మనిషి-రోబోల మధ్య ప్రేమ పుట్టినప్పుడు జరిగే సంఘటనల కథాంశంతో ‘రోబో’ వంటి సినిమాలు వచ్చాయి. ఇలాంటి ఒక ఇతివృత్తంతో రాసిన పుస్తకమే ‘క్లారా అండ్‌ ది సన్‌’. భవిష్యత్తులో రోబోలు మానవులకు సహచరులుగా మారినప్పుడు జరిగే సంఘటనలను ఊహించి రాసిన ఈ అందమైన ప్రేమ కథకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. 


హేమ్‌నట్‌ 

(మేగి ఓ ఫేరల్‌)

ఇంగ్లీషు సాహిత్యం గురించి తెలిసిన వారికి షేక్‌స్పియర్‌ ప్రాముఖ్యత చెప్పాల్సిన అవసరం లేదు. షేక్‌స్పియర్‌కు హేమ్‌నట్‌ అనే ఒక కొడుకు ఉండేవాడు. అతను 11వ ఏట మరణించాడు. అతని మరణం షేక్‌స్పియర్‌ను క్రుంగదీసింది. తన కుమారుడి మరణించిన రెండేళ్ల తర్వాత షేక్‌స్పియర్‌ రాసిన నాటకం ‘హేమ్లట్‌’. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ నాటకంలో షేక్‌స్పియర్‌ తన వ్యక్తిగత బాధను ఎలా వ్యక్తీకరించాడనే విషయాన్ని తెలిసే నవల హేమ్‌నట్‌. షేక్‌స్పియర్‌ అభిమానులందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. 


ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ 

(యాండీ వియర్‌)

‘ది మార్షియన్‌’ పుస్తకం రాసిన యాండీ వియర్‌ తాజా నవల ఇది. ఒక హైస్కూల్‌ సైన్స్‌ టీచర్‌ ఉదయాన్నే నిద్ర లేచేసరికి.. వేరే నక్షత్ర వ్యవస్థలో ఉంటాడు. అతనికి అక్కడికి ఎలా వచ్చాడో తెలియదు. అక్కడ నుంచి మళ్లీ భూమికి ఎలా తిరిగి వచ్చాడనేదే ఈ నవల ఇతివృత్తం. సైన్స్‌ ఫిక్షన్‌ను ఇష్టపడేవాళ్లు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. 

Updated Date - 2021-12-27T05:30:00+05:30 IST