బిల్లా-రంగా సినిమా హీరోల్లా మోదీ, కేసీఆర్‌ స్టంట్లు!

ABN , First Publish Date - 2022-07-01T08:52:21+05:30 IST

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బిల్లా-రంగా సినిమాలో హీరోల్లాగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

బిల్లా-రంగా సినిమా హీరోల్లా మోదీ, కేసీఆర్‌ స్టంట్లు!

  • ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
  • చలో ఢిల్లీ అన్న కేసీఆర్‌..ఇప్పుడు మోదీని నిలదీయగలరా?
  • నోవాటెల్‌ హోటల్‌ ఎదుట ధర్నా చేస్తారా?
  • కేసీఆర్‌ను నిలదీసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బిల్లా-రంగా సినిమాలో హీరోల్లాగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీని నిజంగా వ్యతిరేకిస్తున్నట్లయితే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మోదీ బస చేసే నోవాటెల్‌ హోటల్‌ ఎదుట కేసీఆర్‌ నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీ, టీఆర్‌ఎ్‌సకు రాజకీయంగా సమాధి కడతారన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రాజకీయాల గురించి తెలియదని, ఆయనో మెడికల్‌ మాఫియా అని పేర్కొన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి, పార్థసారథి మెడికల్‌ మాఫియా కోసం అధికారంలో ఉన్నవారి పంచన చేరతారని విమర్శించారు. బీజేపీ నీచమైన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. శివసేనలో చీలికలు తెచ్చి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చిందన్నారు. తెలంగాణలో విచిత్ర పాలన నడుస్తోందని, మొన్నటి దాకా కుస్తీ పట్టిన బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు ఇప్పుడు సైలెంట్‌గా మారిపోయాయని చెప్పారు. చలో ఢిల్లీ అన్న కేసీఆర్‌.. ఇప్పుడు మోదీనే మూడు రోజులు హైదరాబాద్‌కి వస్తున్నా నిరసన ఎందుకు తెలపడం లేదని నిలదీశారు. 


తెలంగాణ ప్రజల్ని బీజేపీ-టీఆర్‌ఎ్‌సలు కలిసి మోసం చేస్తున్నాయనే విషయం ఇక్కడే తెలిసిపోతోందని చెప్పారు. బీజేపీకి అధికారంలోకి రావాలన్న ధ్యాసే తప్ప ప్రజల బాధలు పట్టవని విమర్శించారు. మోదీని కలుసుకునేందుకు కేసీఆర్‌ అపాయింట్‌ తీసుకోవాలన్నారు. ఒకవేళ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే.. ప్రధాని బస చేసే హోటల్‌ ఎదుటనే ధర్నాకు ఉపక్రమించాలని సూచించారు. కేసీఆర్‌, మోదీల స్టంట్‌.. బిల్లా-రంగా సినిమాలో చిరంజీవి, మోహన్‌బాబు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల ముందు చిరంజీవి-మోహన్‌బాబు కొట్లాడుతున్నట్టే ఉంటుందని.. ప్రజలు వెళ్లిపోయాక ఇద్దరూ అల్లుకుంటారని చెప్పారు. చిరంజీవిలా మోదీ, మోహన్‌బాబులా కేసీఆర్‌ తయారయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. సినిమాలో ఆ స్టంట్‌లు నడుస్తాయన్నారు. కేసీఆర్‌, మోదీలు మాత్రం జనాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎ్‌స-బీజేపీల ఫ్లెక్సీలకు తాము దీటుగా సమాధానం చెబుతామన్నారు. జులై 2, 3, 4 తేదీల్లో కార్యాచరణ ఉంటుందన్నారు. ‘కేంద్రం ఇవ్వడం లేదన్నారు. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది. అడగండి’ అని జగ్గారెడ్డి కేసీఆర్‌కు సూచించారు. ఎలాంటి తప్పు లేకున్నా రాహుల్‌, సోనియాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. మహారాష్ట్రలో ఎంపీ సంజయ్‌ రౌత్‌కి ఈడీ నోటీసులు ఇచ్చారని.. కేసీఆర్‌కి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్‌ కేవలం కోతల రాయుడని.. ఆయన చేసేదేం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పుణ్యాన ఎంపీ అయిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసలు లీడరే కాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉందనే ఆయన బీజేపీలో చేరుతున్నారని.. ఫార్మా వ్యాపారులంతా బీజేపీ వెంట పోతున్నారని చెప్పారు.

Updated Date - 2022-07-01T08:52:21+05:30 IST