Chay-Sam Divorce తర్వాత కొత్త చర్చ.. భరణం కింద భార్యలకు వందల వేల కోట్లు ఇచ్చుకున్న భర్తలు వీళ్ళే..!

ABN , First Publish Date - 2021-10-03T01:02:22+05:30 IST

విడాకులు తీసుకోబోయే జంటకు సమాజంలో హోదా, పేరు ప్రఖ్యాతులు ఉంటే సామాన్యులపై దృష్టి కూడా వారిపై పడుతుంది. ముఖ్యంగా..ఆస్తిపాస్తుల పంపకాలపై అమితాసక్తి నెలకొంటుంది.

Chay-Sam Divorce తర్వాత కొత్త చర్చ.. భరణం కింద భార్యలకు వందల వేల కోట్లు ఇచ్చుకున్న భర్తలు వీళ్ళే..!

ఇంటర్నెట్ డెస్క్: జీవితాంతం కలిసుండాల్సిన జంట విడిపోతోందంటే వారి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు బాధపడతారు. అయితే..నేటి ఆధునిక సమాజంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా కుదురుతున్నాయో..విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంత కూడా తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఇక విడాకులు తీసుకోబోయే జంటకు సమాజంలో హోదా, పేరుప్రఖ్యాతలు ఉంటే సామాన్యుల దృష్టి కూడా వారిపై పడుతుంది. ముఖ్యంగా విడాకులు పొందే క్రమంలో ఆస్తిపాస్తుల పంపకాలపై అమితాసక్తి నెలకొంటుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్-మిలిందా గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-మెకెన్జీ స్కాట్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ విడాకుల సమయంలో భారీగా ఆస్తుల పంపకం జరిగింది. అత్యంత ఖరీదైన విడాకులుగా ఇవి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసాయి.


జెఫ్ బెజోస్ మెకెన్జీ స్కాట్ విడాకులు

తాను భార్య నుంచి విడిపోతున్నట్టు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2019 జులైలో ప్రకటించారు. భార్య మెకెన్జీ స్కాట్‌తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వారి మధ్య కుదిరిన విడాకుల ఒప్పందంలో భాగంగా మెకెన్జీకి 36 బిలియన్ డాలర్లు అందినట్టు వెల్లడైంది. ప్రముఖుల విడాకుల ఉదంతాల్లో ఇదే అత్యంత ఖరీదైనదిగా పేరుపడింది. విడాకుల అనంతరం.. మెకెన్జీ ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతురాలిగా అవతరించారు. ఈ ఏడాది మార్చిలో ఆమె ఓ సైన్స్ టీచర్‌ను వివాహం చేసుకున్నారు. 


బిల్ గేట్స్-మిలిందా గేట్స్ విడాకులు

మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య నుంచి విడాకులు పొందుతున్నారన్న వార్త ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వారిది 27 ఏళ్ల వైవాహిక బంధం. అందునా ఇద్దరూ కలిసి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ జంట ఆస్తులు ఏకంగా 130 బిలియన్ డాలర్లు కావడంతో..మెలిందా గేట్స్‌కు విడాకుల తరువాత. భారీగా ఆస్తులు సమకూరాయని సమాచారం. అయితే..వీరి విడాకుల ఒప్పందం వివరాలు మాత్రం ఇప్పటికీ వెల్లడికాలేదు. 


ఈలాన్ మస్క్..

ఈలాన్ మస్క్ అంటే ముందుగా గుర్తొచ్చేది టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలే. అయితే..ఆయన వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మస్క్ కేనడా సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంటకు 2020 మేలో ఓ బాబు జన్మించాడు. అయితే.. మస్క్ కాలేజీ రోజుల్లోనే జస్టిన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఆరుగురు సంతానం. కానీ వారు 2008లో విడిపోయారు. వారి మధ్య కుదిరిన విడాకుల ఒప్పందంలో భాగంగా మస్క్ జస్టిన్‌కు నెలకు 20 వేల డాలర్లను చెల్లిస్తుంటాడు. అంతేకాకుండా.. పిల్లల ఖర్చులు కూడా ఆయనే భరిస్తారు. విడాకుల సందర్భంగా తాను అప్పట్లో నెలకు సగటున 170 వేల డాలర్లు ఖర్చుపెట్టాల్సి వచ్చిందని ఈలాన్ మస్క్ అప్పట్లో తెలిపారు. 


ఆ తరువాత.. టలూలా రైలీ అనే మహిళకు దగ్గరైన ఈలాన్ మాస్క్ ఆమెకు రెండు సార్లు డైవర్స్ ఇచ్చారు. తొలిసారి విడాకులు పొందిన ఈ జంట ఆ తరువాత మళ్లీ తమ వైవాహిక బంధాన్ని పునరుద్ధరించుకుంది. వారి మధ్య మళ్లీ విబేధాలు తలెత్తడంతో వీరి బంధం శాశ్వతంగా ముగిసింది. 2012లో వారు తొలిసారి డైవర్స్ తీసుకున్నప్పుడు టలూలా మస్క్ నుంచి 4.2 మిలియన్ డాలర్లు పొందింది. ఇక 2015లో వారు రెండో సారి విడిపోయినప్పుడు ఆమెకు 16 మిలియన్ డాలర్లు ముట్టాయి.


టైగర్ వుడ్స్..

గోల్ఫ్ క్రీడలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన టైగర్ వూడ్స్ వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. అతడికి పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో..ఆయన భార్య ఎలెన్ నార్డెగ్రెన్ 2009లో విడాకులు తీసుకున్నారు. వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. టైగర్ వుడ్స్ ఎలెన్‌కు 110 మిలియన్ డాలర్లు చెల్లించారు. 

Updated Date - 2021-10-03T01:02:22+05:30 IST