ఇక దాతృత్వానికే అంకితం!

ABN , First Publish Date - 2020-03-15T07:30:24+05:30 IST

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కంపెనీ బోర్డు నుంచి కూడా వైదొలిగారు.

ఇక దాతృత్వానికే అంకితం!

  • మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి వైదొలిగిన బిల్‌ గేట్స్‌ 

శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కంపెనీ బోర్డు నుంచి కూడా వైదొలిగారు. తన వ్యక్తిగత జీవితంలో దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. 64 ఏళ్ల బిల్‌ గేట్స్‌.. 12 ఏళ్ల క్రితం నుంచే కంపెనీ రోజువారీ కార్యకలాపా ల్లో పాల్గొనడం లేదు. తన భార్య మిలిండా గేట్స్‌తో కలిసి ప్రారంభించిన ఛారిటీ సంస్థ ‘బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌’ కార్యక్రమాలపైనే దృష్టిపెడుతూ వచ్చారు. ఇందుకోసం 2014 తొలినాళ్లలోనే మైక్రోసాఫ్ట్‌ బోర్డు చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా మైక్రోసా్‌ఫ్టతోపాటు తన మిత్రు డు వారెన్‌ బఫెట్‌కు చెందిన కంపెనీ ‘బెర్క్‌షైర్‌ హాత్‌వే’ బోర్డుకు గుడ్‌బై చెప్పారు. 


20 ఏళ్ల క్రితమే పగ్గాలు వీడి.. 

2000 జనవరిలో బిల్‌ గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ సారథ్య బాధ్యతలను స్టీవ్‌ బామర్‌కు అప్పగించి దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2008లోనే కంపె నీ రోజువారీ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. 2014లో కంపెనీ చైర్మన్‌ పదవి నుంచీ వైదొలిగారు. అదే సమయంలో కంపెనీ మూడో సీఈఓగా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టారు. 


13 ఏళ్లకే కంప్యూటర్‌పై పట్టు 

బిల్‌ గేట్స్‌ 13 ఏళ్ల ప్రాయంలోనే కంప్యూటర్‌ ప్రో గామింగ్‌పై పట్టు సాధించారు. హార్వర్డ్‌లో విద్యాభ్యా సాన్ని మధ్యలోనే వదిలేసిన గేట్స్‌.. బాల్య స్నేహితుడైన అలెన్‌ పాల్‌తో కలిసి మైక్రోసా్‌ఫ్టను ప్రారంభించారు. విండోస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.


ప్రపంచ కుబేరుడు 

మైక్రోసాఫ్ట్‌ వ్యాపారం అనూహ్య విస్తరణ, వృద్ధితో బిల్‌ గేట్స్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 1987లోనే ఫోర్బ్స్‌ శ్రీమంతుల వార్షిక జాబితాలో చోటు దక్కించుకున్న గేట్స్‌.. 1995 నుంచి 2017 వరకు రిచ్‌ లిస్ట్‌లో నం.1 స్థానంలో కొనసాగారు. 2017లో అమెజాన్‌  వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. గేట్స్‌ను వెనక్కి నెట్టి అగ్రపీఠం దక్కించుకున్నాడు. ప్రస్తుతం 10,200 కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో గేట్స్‌ రెండో స్థానంలో ఉన్నారు. 


దాన కర్ణుడు 

రెండు దశాబ్దాల క్రితమే బిల్‌ గేట్స్‌ దాతృత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2000 సంవత్సరంలో విలియమ్‌ హెచ్‌. గేట్స్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. తర్వాత కాలంలో దాని పేరును బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌గా మా ర్చారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా పలు చారిటీ సంస్థలు, శాస్త్రీ య పరిశోధనలకు భూరీ విరాళాలు అందజేశారు. ప్రస్తు తం 4,680 కోట్ల డాలర్ల నిధులు కలిగిన ఈ ఫౌండేషన్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ఛారిటీ సంస్థ. 2009లో బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ (బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌) కలిసి ‘ది గివింగ్‌ ప్లెడ్జ్‌’ను ప్రారంభించారు. 




ఇన్నాళ్లూ బిల్‌ గేట్స్‌తో  కలిసి పనిచేయడం, ఆయన నుంచి నేర్చుకునే అవకాశం లభించడం నాకు లభించిన గొప్ప గౌరవం. సాఫ్ట్‌వేర్‌ను ప్రజాస్వామిక శక్తిగా మల్చడంతోపాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సవాళ్లను పరిష్కరించే ఉద్దేశంతో బిల్‌ గేట్స్‌ ఈ కంపెనీని ప్రారంభించారు. మున్ముందు కూడా గేట్స్‌తో కంపెనీ ప్రయాణం కొనసాగనుంది.  కంపెనీకి సాంకేతిక సలహాదారుగా ఆయన కొనసాగుతారు. బిల్‌ గేట్స్‌ స్నేహానికి కృతజ్ఞుడిని. మున్ముందూ తనతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా.

 - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ

Updated Date - 2020-03-15T07:30:24+05:30 IST