Abn logo
May 4 2021 @ 08:58AM

బిల్​గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి

వాషింగ్టన్: ప్రపంచ కుబేరులలో ఒకరు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట.. ఇకపై దంపతులుగా కలిసి ఉండలేమని భావిస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఇరువురు సంయుక్త ప్రకటన చేశారు. అయితే, తమ బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ట్విటర్ వేదికగా సోమవారం ఈ విషయాన్ని బిల్‌గేట్స్ దంపతులు వెల్లడించారు.

"27 ఏళ్ల మా వివాహ బంధానికి ముగింపు పలకాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్​ను స్థాపించాం. ఈ ఫౌండేషన్​ కోసం మేము కలిసే పనిచేస్తాం. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో మేము దంపతులుగా కొనసాగలేమని భావిస్తున్నాం." అని తమ సంయుక్త ప్రకటనలో బిల్‌గేట్స్ దంపతులు పేర్కొన్నారు. 

ఇక ప్రస్తుతం బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ సుమారు 137 బిలియన్ డాలర్లు. ఇకపోతే 2000లో స్థాపించిన బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్‌ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు వినియోగించారు. కాగా, 1994లో వివాహబంధంతో ఒక్కటైన బిల్‌గేట్స్ దంపతులు 27 ఏళ్ల తర్వాత విడిపోతుండడం గమనార్హం. ఇక ఇటీవలే మరో ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సైతం తన భార్య మాకెంజీ స్కాట్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ప్రపంచ కుబేరులు లేటు వయసులో సంచలన నిర్ణయం తీసుకుంటూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు.  

తాజా వార్తలుమరిన్ని...

Advertisement