బిక్కు బిక్కుమంటూ గడప గడపకు..

ABN , First Publish Date - 2022-06-05T06:05:09+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ‘గడప గడపకు మ న ప్రభుత్వం’ కార్యక్రమం నిరసనల సెగ పుట్టిస్తోంది.

బిక్కు బిక్కుమంటూ గడప గడపకు..
మునిమడుగులో హౌసింగ్‌ బిల్లు మంజూరు కాలేదని ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే శంకరనారాయణను నిలదీస్తున్న మహిళ (ఫైల్‌)

ప్రజల నుంచి నిరసన సెగలు 

బజారున పడుతున్న ప్రభుత్వ పరువు 

పూర్తిగా నీరసించిన ప్రచార కార్యక్రమం 

బయటి వ్యక్తులు వీడియోలు తీయకుండా జాగ్రత్తలు 

ప్రజాప్రతినిధుల పర్యటనకంటే ముందే..

వలంటీర్లు, కార్యకర్తల మోహరింపు 


హిందూపురం టౌన, జూన 4: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ‘గడప గడపకు మ న ప్రభుత్వం’ కార్యక్రమం నిరసనల సెగ పుట్టిస్తోంది.  ఆపార్టీ ప్ర జాప్రతినిధులకు గడప గడపనా నిలదీతలే ఎదురవుతున్నాయి.  ప్రభుత్వం అందజేసిన పథకాల కంటే.. మోపుతున్న బాదుడే ఎ క్కువని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నీరసించిన ప్రచార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బిక్కుబిక్కుమంటూ ప్రజల గడ ప దాటుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పరువు బజారున పడుతోం ది. అసలే ప్రభుత్వం బాదుతున్న పన్నులు, ధరలు, చార్జీల మోత తో జనం విసుగు చెందారు. ఈ తరుణంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పెట్టడంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.  అధికార పార్టీ నేతలకు ఈ సెగ ఊపిరాడనీయడం లేదు. ఏ ఇం టికి వెళ్తే ఏం జరుగుతుందోనని భయం వారిని వెంటాడుతోంది. ప్రజలు ఏ సమస్యమీద నిలదీస్తారో, అది వీడియో తీసి బయట పెడితే మా పరువు పోతుందోనని వణుకుతున్నారు. ఈకారణంగా ఇంటింటికి వెళ్లే ముందు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రజలనుంచి మాత్రం నిరసన సెగ రాజుకుంటూనే ఉంది. దీంతో అధికా ర పార్టీ నేతలు తలలు బాదుకుంటున్నారు. ప్రచార కార్యక్రమం నీరసించిపోతోంది. గతనెల 11న ఆర్భాటంగా ప్రారంభించిన కార్యక్రమం కాస్త చల్లబడిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆందోళనలు వ్య క్తమవుతుండటంతో పలువురు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒకటి కి పదిసార్లు ఆలోచించి కార్యక్రమానికి వెళ్తున్నారు. రానున్న ఎనిమిది నెలలు ఎలా తిరగాలో తెలియక సన్నిహితులు, పార్టీ నేతల వద్ద మదన పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 


అభివృద్ధి ఎక్కడ?

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి మూడేళ్లలో చేసిన అభివృద్ధిని గొప్పగా చెప్పుకోవచ్చని వెళ్లిన అధికార పార్టీ నేతలకు నిరాశే మిగులుతోంది. కొన్నిచోట్ల మహిళలు ప్ర భుత్వ తీరును ఎండగడుతున్నారు. పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న భూదందాలు, సెటిల్‌మెంట్లు, అసాంఘి క కార్యకలాపాలపై గట్టిగా నిలదీస్తున్నారు. పెనుకొండ మండలంగోనిపేటలో ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీసిన ఘటన జనం లో చర్చ జరుగుతోంది. ‘మీరైతే ఇళ్ల మీద ఇళ్లు కట్టుకోవచ్చు. మాకు ఇళ్లే ఇవ్వరు’ అని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. పార్టీ, ప్రభుత్వ పరువు బజారున పడుతోందని ఆపార్టీ నేతలే పలువురు బాహా టంగా విమర్శిస్తున్నారు. 


అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి..

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నేతలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలవాణి ఒక్కటే. మీరేమో ఒకచేత్తో ఇచ్చి... రెండు చేతులతో లాగేసుకుంటున్నారని అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. అభివృద్ధి దేవుడెరుగు.. మా ఆదాయం కంటే ఖర్చే అధికంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఆవిరవుతున్న ఆర్భాటం

వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చెప్పుకోవచ్చని భావించిన పార్టీ పెద్దలకు చుక్కెదురవుతోంది. మొదట్లో మైకులు, బాణసంచా పేల్చి గడప గడపకూ వెళ్లారు. వారి ఆర్భాటం చూసి ప్రజలు పెదవి విరుస్తుండడంతో ప్రచారం కాస్త సన్నగిల్లింది. ఈపరిస్థితుల్లో ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా తూతూమంత్రంగా గడప గడపకు వెళ్తున్నారు. 


నేతల కంటే ముందే వలంటీర్లు, కార్యకర్తలు... 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభంలో ఒకటి, రెండు రోజులు ప్రజల నుంచి నిరసన సెగ మొదలవడంతో ముం దస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని వలంటీర్లను ఇళ్లవద్దకు పంపుతు న్నారు. సారొస్తున్నారు.. మీరెవరూ ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే ఈ పథకాలకు ముప్పు అంటూ భయపెడుతున్నారు. సారొచ్చినప్పు డు నోరు మెదపకూడదంటూ, సారు చెప్పింది వినాలని హుకుం జారీచేస్తున్నారు. ఎక్కడైనా నిరసన సెగ ఎదురైతే వీడియోలు తీ యకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఒకవేళ మీడియావారు వెళ్లి కవరేజ్‌ చేస్తుంటే సెల్‌ఫోన లాక్కెళ్తున్నారు. 15 రోజుల క్రితం హిం దూపురంలో సమస్యలపై మహిళలు ఎమ్మెల్సీని ప్రశ్నిస్తుండగా, వీడియో తీసేందుకు ప్రయత్నించిన పాత్రికేయుడి సెల్‌ఫోనను వైసీపీ నాయకులు లాక్కోవడం విమర్శలపాలైంది. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నా, బయటకు పొక్కలేదు.     గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అభాసుపాలవుతోంది. ఆశయం పక్కదారి పట్టి.. క్షేత్రస్థాయిలో నిరసనల సెగ రాజుకుంటోంది. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ కార్యక్రమంలో స్పష్టంగా బయట పడుతోందన్న చర్చ ప్రజల్లో జోరందుకుంది. 


Updated Date - 2022-06-05T06:05:09+05:30 IST