బైక్‌ల దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-09-29T05:59:36+05:30 IST

మోటారు సైకిళ్ల దొంగతనం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసినట్లు పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ తెలిపారు.

బైక్‌ల దొంగల ముఠా అరెస్టు

29 బైక్‌లు స్వాధీనం
ఏలేశ్వరం, సెప్టెంబరు 28: మోటారు సైకిళ్ల దొంగతనం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసినట్లు పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ తెలిపారు. వారి వద్ద నుంచి 29 మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలేశ్వరం పోలీ్‌సస్టేషన్‌లో ప్రత్తిపాడు సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌లతో కలసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను మురళీమోహన్‌ వెల్లడించారు. గత కొద్ది నెలలుగా ఏలేశ్వరం మండలంతో పాటు వివిధ ప్రాంతాల్లో మోటారుసైకిళ్లు చోరీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సీఐ,ఎ్‌సఐలు నిఘా పెట్టి పెద్దాపురం డివిజన్‌ క్రైం పార్టీ హెడ్‌కానిస్టేబుళ్లు బలరామ్‌, రాధాకృష్ణ, నాగరాజు, ఏలేశ్వరం హెచ్‌సీ బి.మాణిక్యం, కె.సుకుమార్‌బాబు, ఆర్‌.లోవరాజు, వెంకటరమణ, బ్రహ్మానందం, గంగాధర్‌, పండుదొర తదితర మొత్తం 13 మంది సిబ్బందితో  టీమ్‌ ఏర్పాటు చేశామన్నారు.  ఈనేపథ్యంలో నర్సీపట్నంరోడ్‌లో సి.రాయవరం గ్రామం సమీపాన సత్తెమ్మతల్లి గుడి ప్రాంతంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానంతో ఏలేశ్వరం గొల్లలమెట్ట ప్రాంతానికి చెందిన పాండ్రంకి అప్పారావు(24), కోన ప్రసాదరావు(24), కారంగి ఏసుదాసు(24)ను అదుపులోకి తీసుకున్నామన్నారు. రికార్డులు లేకుండా బైక్‌లు నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని, విచారణలో వారి వద్ద నుంచి వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడిన 29 మోటారుబైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారు దొంగిలించిన బైక్‌లను గొల్లలమెట్టకు చెందిన ముత్యాల రాంబాబు, ఇల్లరపు రమేష్‌, మండల దుర్గావీరప్రసాద్‌, ముత్యాల శివశ్రీనివాస్‌, తిరుమాలి గ్రామానికి చెందిన కోలా సూరిబాబు, తోట వీరగంగాధర్‌ అనే వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించామని,  ఆ ఆరుగురుపైనా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఏలేశ్వరం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 10, అన్నవరం-4, ప్రత్తిపాడు-5, జగ్గంపేట, తుని, పిఠాపురం, అంగర, గోలుగొండ, పశ్చిమగోదావరి జిల్లా బందంచర్ల స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి వంతున, అడ్డతీగల, కిర్లంపూడి పరిధిలో రెండేసి వంతున బైక్‌లు దొంగిలించినట్లు గుర్తించామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌ల విలువ రూ.10,22,000 విలువ ఉంటుందని, 20 బైక్‌లకు సంబంధించిన వివరాలు గుర్తించామని వెల్లడించారు. తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని, చోరీ గుట్టురట్టు చేసిన పోలీ్‌స సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారన్నారు.

Updated Date - 2022-09-29T05:59:36+05:30 IST