బైక్‌ దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-21T05:10:12+05:30 IST

వారిద్దరు ఆరితేరిన దొంగలు. ఒకటి రెండూ కాదు 27 బైకులను చోరీ చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. అలాంటి వారిని సీసీఎస్‌, నెల్లూరు రూరల్‌ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పట్టుకున్నారు.

బైక్‌ దొంగల అరెస్ట్‌
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్లతో పోలీసులు

27 వాహనాలు స్వాధీనం


నెల్లూరు(క్రైం), జనవరి 20 : 

వారిద్దరు ఆరితేరిన దొంగలు. ఒకటి రెండూ కాదు 27 బైకులను చోరీ చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. అలాంటి వారిని సీసీఎస్‌, నెల్లూరు రూరల్‌ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పట్టుకున్నారు. నిందితుల వివరాలను సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌సైదా గురువారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు.

జిలాల్లో వరుసగా మోటారుసైకిళ్ల దొంగతనాలు జరుగుతుండటంపై ఎస్పీ సీహెచ్‌ విజయరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాలు, ఏఎస్పీ పీ వెంకటరత్నం సూచనలతో సీసీఎస్‌ డీఎస్పీ ఏ శివాజీరాజు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే బాజీజాన్‌ సైదా, నెల్లూరు రూరల్‌ ఎస్‌ఐ కే శ్రీకాంత్‌ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నింది తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం గొలగమూడి క్రాస్‌ రోడ్డు వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి వారిదైన శైలిలో విచారించి వాస్తవాలు రాబట్టారు.  దుత్తలూరు మండలం రాచవారిపల్లి గ్రామానికి చెందిన పత్తి వెంకటరత్నం అలియాస్‌ మధు పాత నేరస్తుడు. అనేకసార్లు మోటార్‌ సైకిళ్లు దొంగలించిన కేసులు, ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో జైలుకు పోయివచ్చాడు. పదేళ్లుగా దొంగతనాలు చేస్తూ జైలుకు పోతున్నాడు. ప్రస్తుతం ఉదయగిరి పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎర్రచందనం కేసులో నిందితుడిగా పరారీలో ఉన్నాడు. ఇక రెండో నిందితుడు ఆత్మకూరు మండలం జగన్నాథరావు పేటకు చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాస్‌ కలవల కిషోర్‌. అతను కూడా పాత నేరస్తుడే. చైన్‌ స్నాచింగ్‌ కేసులలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ ఇద్దరు జిల్లాలోని 14 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బైకులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు రూరల్‌లో 7, బుచ్చిలో 4, వెంకటాచలంలో 2, విడవలూరులో 2, సూళ్లూరుపేటలో 2, ఆత్మకూరు, ఏఎస్‌పేట, కొడవలూరు, ఇందుకూరుపేట, నవాబుపేట, మనుబోలు, దొరవారిసత్రం, సంగం పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కో మోటారు సైకిల్‌, ఆచూకి తెలియనివి మరో రెండు ఇలా రూ.15 లక్షల విలువ చేసే 27 మోటర్‌ సైకిళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సీసీఎస్‌ ఏఎస్‌ఐ జే వెంకయ్య, హెడ్‌కానిస్టేబుళ్లు వారిస్‌ అహ్మద్‌, గంగిశెట్టి భాస్కర్‌, రామగిరి సురేష్‌ కుమార్‌, కానిస్టేబుళ్లు ఎం సుబ్బారావు, జీ నరేష్‌, జీ అరుణ్‌కుమార్‌, ఎస్‌కే మహబూబ్‌ బాషా, ఏ గోపీ, షేక్‌ ఇస్మాయిల్‌, నెల్లూరు రూరల్‌ సిబ్బంది ఏఎస్‌ఐ వైవీ రామారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ వీ భాస్కర్‌, ఈ వేణుగోపాలరావు, కానిస్టేబుళ్లు  అల్లాభక్షు, టీ శ్రీనివాసులు, మునికృష్ణను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు. సర్వీసు రివార్డ్స్‌కు సిఫారసు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-01-21T05:10:12+05:30 IST