ఇక దూసుకుపోదాం..

ABN , First Publish Date - 2022-07-06T08:48:24+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

ఇక దూసుకుపోదాం..

  • త్వరలో అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్‌ ర్యాలీలు
  • కేసీఆర్‌ విషప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతిరోజూ ఐదారు గ్రామాల్లో ఈ ర్యాలీలు కొనసాగేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ ఈ నెల 10న రానున్నారని, బైక్‌ర్యాలీలతో పాటు ఇతర కార్యక్రమాలు ఎప్పుడు? ఎలా నిర్వహించాలన్నది ఆరోజున ఖరారు చేయనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. స్థానిక సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తాము అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చే లక్ష్యంతో ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతదన్నారు.


 పంద్రాగస్టు రోజున ప్రతీ కార్యకర్త ఇంటిపై  జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలందరి సహకారం వల్లే బహిరంగ సభతోపాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమయ్యాయన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ఘనంగా సభ లు జరగలేదని జాతీయ నాయకత్వం అభినందించిందని తెలిపారు. సభను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఎంత విషప్రచారం చేసినా ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదన్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించినందుకు, జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు అవకాశం కల్పించినందుకు జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పదాధికారుల సమావేశం ధన్యవాదాలు తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీ్‌పకుమార్‌ మీడియాతో మాట్లాడారు. విజయ సంకల్పసభకు 6 లక్షల నుంచి 6.5 లక్షల మంది వచ్చి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.


రేపు హైదరాబాద్‌కు సింధియా..

హైదరాబాద్‌ పార్లమెంటు క్లస్టర్‌ ఇన్‌చార్జిగా ని యమితుడైన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈనెల 7న హైదరాబాద్‌ రానున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. 3 రోజుల పాటు ఉంటారని చెప్పారు. 

Updated Date - 2022-07-06T08:48:24+05:30 IST