అతని పెళ్లికి, అంత్యక్రియలకు వెళ్లడం వల్ల 111 మందికి సోకిన కరోనా

ABN , First Publish Date - 2020-07-03T05:08:55+05:30 IST

నిబంధనలను, భౌతిక దూరాన్ని విస్మరిస్తే కరోనా ఎలా విజృంభిస్తోందో...

అతని పెళ్లికి, అంత్యక్రియలకు వెళ్లడం వల్ల 111 మందికి సోకిన కరోనా

పాట్నా: నిబంధనలను, భౌతిక దూరాన్ని విస్మరిస్తే కరోనా ఎలా విజృంభిస్తోందో కళ్లకు కట్టే ఘటన ఇది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం తప్పదని.. వీలైనంత తక్కువ మంది పెళ్లిళ్లకు హాజరుకావాలని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా ఆ యువకుడి పెళ్లికి 400 మంది హాజరయ్యారు. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ యువకుడు కరోనా సోకి మరణించాడు. అతని అంత్యక్రియలకూ దాదాపు 200 మంది దాకా హాజరయ్యారు.


దీంతో.. అతని పెళ్లికి, అంత్యక్రియలకు హాజరయిన వారిలో ఇప్పటివరకూ 111 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లక్షణాలు కనిపించినా కరోనా టెస్ట్ చేయించుకోకుండా ఆ యువకుడు పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పెళ్లయిన రెండు రోజులకే మరణించాడు. ఈ విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది.


బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వరుడు గురుగ్రామ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వతేదీన తన స్వగ్రామమైన దీహపాలికి వచ్చాడు. ఈ కాలంలో యువకుడికి కరోనా సోకింది. అయినా అతను పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో జూన్ 15 వతేదీన ఓ యువతిని  వివాహమాడారు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్య క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వరుడి బంధువులు కరోనా పరీక్ష చేయించకుండానే అతని మృతదేహాన్ని దహనం చేశారు.

Updated Date - 2020-07-03T05:08:55+05:30 IST