లక్ష చెట్లు నాటిన 'వనవాసి'!

ABN , First Publish Date - 2020-09-30T01:44:19+05:30 IST

ఇటీవలి కాలంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ బాగా పాపులర్ అయింది. ఈ ఛాలెంజ్ స్వీకరించిన చాలామంది సెలెబ్రిటీలు కూడా మొక్కలు నాటి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

లక్ష చెట్లు నాటిన 'వనవాసి'!

గయ: ఇటీవలి కాలంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ బాగా పాపులర్ అయింది. ఈ ఛాలెంజ్ స్వీకరించిన చాలామంది సెలెబ్రిటీలు కూడా మొక్కలు నాటి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అసలు సోషల్ మీడియానే లేని రోజుల నుంచీ ఓ వ్యక్తి ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూనే ఉన్నాడు. దాదాపు 40ఏళ్లుగా మొక్కలు నాటుతూ భూమాత రుణం తీర్చుకుంటున్నాడు.


బిహార్‌లోని గయకు చెందిన ఓ కుటుంబం.. దగ్గర్లోని బ్రహ్మయోని కొండల్లో పిక్నిక్‌ చేసుకోవడానికి వెళ్లింది. అక్కడకు తల్లిదండ్రులతోపాటు వెళ్లిన దిలీప్ కుమార్ సికందర్‌కు ఓ అనుమానం వచ్చింది. కొండలపై చెట్లు లేకుండా, ఏదో రాళ్ల గుట్టల్లా బోసిగా కనిపించడంతో ఏదో వెలితిగా అనిపించింది. వెంటనే తండ్రి వద్దకెళ్లి ఆ ప్రాంతంలో చెట్లు ఎందుకు లేవని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న తండ్రి.. గయలోని కొండలపై చెట్లు ఉండవు నాన్నా అంటూ బదులిచ్చాడు.


తండ్రి సమాధానం విన్న దిలీప్‌కు నిద్ర పట్టలేదు. ఎలాగైనా ఆ కొండప్రాంతాన్ని పచ్చగా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా కొండల్లోకి వెళ్లి మొక్కలు నాటడం ప్రారంభించాడు. తొలుత ఇది చాలా కష్టంగా అనిపించినా కాలం గడిచే కొద్దీ ఆ కష్టం దిలీప్‌కు అలవాటైపోయింది. ఇలా ఇప్పటికి దాదాపు 40ఏళ్లు గడిచిపోయాయి. అయినా దిలీప్ మాత్రం.. ఇప్పటికీ ఆ కొండల్లో మొక్కలు నాటుతూనే కనిపిస్తున్నాడు.


1982 నుంచి తాను ఇలా మొక్కలు నాటుతున్నానని, ఇప్పటి వరకూ దాదాపు లక్ష మొక్కలు నాటానని దిలీప్ తెలియజేశాడు. చిన్నతనం నుంచీ ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి మొక్కలు నాటేవాడినని, నాటిన మొక్కల బాగోగులు చూసుకోవడం కూడా తనకు అలవాటైపోయిందని చెప్పాడు. తను నాటే మొక్కలకు ఎక్కువగా స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టేవాడినని, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, లోకమాన్యతిలక్, ఝాన్సీలక్ష్మీబాయి తదితరుల పేరిట మొక్కలు నాటానని వెల్లడించాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల పేర్లు కూడా మొక్కలకు ఇకపై పెట్టాలని నిర్ణయించుకున్నట్లు దిలీప్ తెలియజేశాడు. దేశక్షేమం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికోసం రెండు నిమిషాలు మౌనం పాటించడం కన్నా, ఇలా వారి పేరుకు ఓ శాశ్వత గుర్తింపు ఇవ్వడమే గౌరవం అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాలని దిలీప్ భావిస్తున్నాడట.


తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ భూమాత రుణం తీర్చుకోవడానికి ఈ పని చేస్తూనే ఉంటానని దిలీప్ ప్రకటించాడు. పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యతని, దాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశాడు. ఆ భయంతోనే తాను ఇన్నేళ్లుగా మొక్కలు నాటుతున్నానని చెప్పాడు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయసహకారాలూ అందలేదని, అయితే ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి పరిరక్షిస్తే తనకు అంతకుమించి ఏమీ అక్కర్లేదని అంటున్నాడు.

Updated Date - 2020-09-30T01:44:19+05:30 IST