పాట్నా: బీహార్‌లో ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్టు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలకు ఉద్దేశించిన ‘పోషన్ పథకం’లో బాలురకు శానిటరీ నాప్కిన్లు, ఇతర దుస్తులు కొనుగోలు కోసం నిధులు మంజూరైన ఘటన సరన్ జిల్లాలోని హల్‌కోరీ షా స్కూల్లో వెలుగు చూసింది. ఆ స్కూల్‌లో కొత్తగా నియమితులైన హెడ్‌మాస్టర్ ఈ విషయాన్ని గుర్తించి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. గత మూడేళ్ల రికార్డుల్లో ఇలాంటివి పలు గుర్తించానని ఆయన పేర్కొన్నారు. కాగా.. తనకు హెడ్‌మాస్టర్ నుంచి లేఖ అందిన విషయాన్ని శరన్ జిల్లా విద్యాశాఖాధికారి శనివారం ధృవీకరించారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆ కమిటీ వారంలోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.