హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి ఒక్క లైన్‌ను కూడా ట్రాన్స్‌లేట్ చేయలేకపోయిన హెడ్మాస్టర్: వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-07-12T01:13:13+05:30 IST

బీహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అతి సులభమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయారు

హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి ఒక్క లైన్‌ను కూడా ట్రాన్స్‌లేట్ చేయలేకపోయిన హెడ్మాస్టర్: వీడియో వైరల్

పాట్నా: బీహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అతి సులభమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో తనిఖీకి వచ్చిన అధికారులు నోరెళ్లబెట్టారు. మోతిహరి జిల్లాలో పక్డిదయాళ్ బ్లాక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను దున్నేస్తోంది.


సబ్ డివిజినల్ ఆఫీస్ (SDO) రవీంద్ర కుమార్ ఆ ప్రాంతంలోని పాఠశాలలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈక్రమంలో చైత పంచాయతీలోని స్కూల్‌ను సందర్శించారు. నేరుగా ఓ క్లాస్‌రూములోకి వెళ్లారు. అక్కడున్న అసిస్టెంట్ టీచర్‌ ముకుల్ కుమార్‌ను ఈ క్లాస్ రూములోని పిల్లలకు ఎవరు బోధిస్తున్నారంటూ వాతావరణాన్ని తేలిక పరిచే ప్రశ్న అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్పలేక కళ్లప్పగించి చూస్తుండిపోయారు. 


ఆ తర్వాత అక్కడి నుంచి హెడ్మాస్టర్ విశ్వనాథ్ రామ్ రూముకు వెళ్లిన ఎస్‌డీవో ఆయనను కొన్ని సులభమైన ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాదు, ఒక హిందీ పంక్తిని ఇచ్చి దానిని ఇంగ్లిష్‌లోకి అనువదించమన్నా హెడ్మాస్టర్ వల్ల కాలేదు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై  నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువు ఇలాగే ఉంటుందని కొందరంటే, ఇదేమీ కొత్తకాదని మరికొందరు అంటున్నారు. 



Updated Date - 2022-07-12T01:13:13+05:30 IST